అల్ట్రాటెక్ నికరలాభం 25% అప్
తగ్గిన ఆదాయం.. రూ.6,509 కోట్లకు
న్యూఢిల్లీ: అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీ నికర లాభం(కన్సాలిడేటెడ్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో 25 శాతం పెరిగింది. వ్యయాలు తక్కువగా ఉండడం వల్ల ఈ స్థాయి వృద్ధి సాధించామని ఆదిత్య బిర్లా గ్రూప్‌కు చెందిన ప్రధాన కంపెనీ, అల్ట్రాటెక్ సిమెంట్ తెలిపింది. గత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రూ.491 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రె ైమాసిక కాలంలో రూ.614 కోట్లకు పెరిగిందని పేర్కొంది.
మొత్తం ఆదాయం మాత్రం రూ.6,669 కోట్ల నుంచి రూ.6,509 కోట్లకు తగ్గిందని వివరించింది. ప్రభుత్వం మౌలిక సదుపాయాల అభివృద్దిపై దృష్టి సారించడం, వర్షాలు బాగా కురియడం, స్మార్ట్ సిటీల అభివృద్ధి తదితర అంశాల కారణంగా టైర్ 1, టైర్ 2 నగరాల్లో గృహ నిర్మాణ రంగానికి డిమాండ్ బాగా ఉండగలదని కంపెనీ అంచనా వేస్తోంది. ఈ డిమాండ్‌ను అందిపుచ్చుకునే స్థితిలో ఉన్నామని కంపెనీ పేర్కొంది. జేపీ గ్రూప్‌కు చెందిన సిమెంట్ ప్లాంట్ల కొనుగోళ్లకు కాంపిటీషన్ కమీషన్(సీసీఐ) ఆమోదం పొందామని తెలిపింది.