అల్ట్రాటెక్ సిమెంట్ లాభం 15శాతం జంప్
న్యూఢిల్లీ: ఆదిత్యా బిర్లా గ్రూప్ కంపెనీ అల్ట్రాటెక్ సిమెంట్ నికరలాభం 2017 జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో 15.14 శాతం పెరుగుదలతో రూ. 897.91 కోట్లకు చేరింది. గతేడాది ఇదేకాలంలో కంపెనీ నికరలాభం రూ. 779.83 కోట్లు. కంపెనీ మొత్తం ఆదాయం 6.45 శాతం వృద్ధితో రూ. 7,603 కోట్ల నుంచి రూ. 8,094 కోట్లకు చేరింది. తాజా ఫలితాల్లో తాము ఇటీవల టేకోవర్ చేసిన జైప్రకాష్ అసోసియేట్స్, జేపీ సిమెంట్ కార్పొరేషన్‌లకు చెందిన సిమెంటు ప్లాంట్ల ఫలితాలు కూడా కలిసివున్నాయని కంపెనీ మంగళవారం స్టాక్ ఎక్సే్ఛంజీలకు తెలిపింది.
జేపీ గ్రూప్‌నకు ఆంధ్రప్రదేశ్‌తో సహా వివిధ ప్రాంతాల్లో వున్న 2.13 కోట్ల టన్నుల వార్షిక సామర్థ్యంగల సిమెంటు ప్లాంట్లను అల్ట్రాటెక్ కొనుగోలుచేసింది. తాజా టేకోవర్‌తో తమ మొత్తం వార్షిక ఉత్పాదక సామర్థ్యం 9.3 కోట్ల టన్నులకు చేరుతుందని కంపెనీ తెలిపింది. ముగిసిన త్రైమాసికంలో ఇంధన ధరల పెరుగుదల కారణంగా వ్యయాలు ఎగిసాయని అల్ట్రాటెక్ పేర్కొంది. ఫలితాల నేపథ్యంలో అల్ట్రాటెక్ సిమెంటు షేరు ధర స్వల్ప తగ్గుదలతో రూ. 4,355 వద్ద క్లోజయ్యింది.