
న్యూఢిల్లీ: వీడియోకాన్ గ్రూప్‌నకు రుణాలివ్వడం ద్వారా ఐసీఐసీఐ బ్యాంక్ సీఈఓ చందా కొచర్, ఆమె కుటుంబ సభ్యులు లబ్ధి పొందారన్న(క్విడ్ ప్రో కో) ఆరోపణలపై అమెరికా స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ.. ఎస్‌ఈసీ కూడా రంగంలోకి దిగనుంది. ఈ ఉదంతంలో ఐసీఐసీఐ బ్యాంక్, చందా కొచర్‌లపై దర్యాప్తు చేపట్టనున్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే సీబీఐతోపాటు పలు దేశీ దర్యాప్తు ఏజెన్సీలు దీనిపై విచారణ మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. తమకు సహకరించాల్సిందిగా మారిషస్ ఇతర విదేశీ దర్యాప్తు సంస్థలను దేశీ నియంత్రణ సంస్థలు, ఏజెన్సీలు కోరినట్లు అధికారిక వర్గాల సమాచారం. అయితే, అమెరికా నియంత్రణ సంస్థ దర్యాప్తు వార్తలపై ఇటు ఐసీఐసీఐ బ్యాంక్, ఇటు ఎస్‌ఈసీ ప్రతినిధులు కూడా స్పందించలేదు.
ఈ ఏడాది మార్చిలో ఈ క్విడ్ ప్రో కో వ్యవహారం వెలుగు చూసిన వెంటనే కొచర్‌పై తమకు పూర్తి నమ్మకం ఉందంAటూ పేర్కొన్న ఐసీఐసీఐ డైరెక్టర్ల బోర్డు.. తాజాగా స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించడం గమనార్హం. కాగా, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు అమెరికాలో కూడా లిస్టయిన నేపథ్యంలో(ఏడీఆర్) ఈ అంశంపై మన స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ నుంచి ఎస్‌ఈసీ వివరాలను కోరనుందని ఆయా వర్గాలు పేర్కొన్నాయి. దర్యాప్తులో భాగంగా సెబీ ఇప్పటికే ఐసీఐసీఐ, కొచర్‌లకు షోకాజ్ నోటీసులు కూడా జారీ చేసింది.