టాప్ పదవి నుంచి మాల్యా ఔట్
న్యూఢిల్లీ : ప్రతిష్టాత్మక మోటార్ బాడీ ఎఫ్‌ఐఏలో దేశీయ మోటార్‌స్పోర్ట్ బాడీకి టాప్ ప్రతినిధిగా ఉన్న విజయ్ మాల్యా ఆ పదవి నుంచి తప్పుకున్నారు. క్రీడా మంత్రిత్వశాఖ జోక్యంతో ఆయన ఈ పదవి నుంచి తప్పుకున్నట్టు తెలిసింది. బ్యాంకులకు వేలకోట్ల రూపాయలు ఎగొట్టిన విజయ్ మాల్యా, యూకేలో దర్జాగా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. ఆయన్ను భారత్‌కు రప్పించడానికి అధికారులు, ప్రభుత్వం శతవిధాల ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం లండన్‌లో ఆయన్ను భారత్‌కు అప్పగించే ప్రక్రియపై విచారణ కూడా జరుగుతోంది. గత కొన్నిరోజులుగా మాల్యా స్థానంలో డిఫ్యూటీ విక్కీ చందోక్ భారత్ తరఫున అంతర్జాతీయ సంస్థ ఎఫ్‌ఐఏ సమావేశాలకు హాజరవుతున్నారు.
జూన్‌లో ఎఫ్‌ఐఏ వరల్డ్ మోటార్ స్పోర్ట్ కౌన్సిల్ చివరి సమావేశం జరుగనున్న నేపథ్యంలో మాల్యా రాజీనామా చేసినట్టు తెలిసింది. ఈ విషయంపై మంత్రిత్వశాఖ ఫెడరేషన్ ఆఫ్ మోటార్ స్పోర్ట్స్ క్లబ్ ఆఫ్ ఇండియా(ఎఫ్‌ఎంఎస్‌సీఐ)కు ఆదేశాలు జారీచేసినట్టు వెల్లడైంది. అయితే దీనిపై స్పందించడానికి ఎఫ్‌ఎంఎస్‌సీఐ బాస్ అక్బార్ ఇబ్రహిం నిరాకరించారు. అధికారిక ఎఫ్‌ఎంఎస్‌సీఐ వెబ్‌సైట్‌లో మాత్రం ఎఫ్‌ఐఏ ప్రతినిధుల జాబితా నుంచి విజయ్ మాల్యా, మాజీ ఎఫ్‌ఎంఎస్‌సీఐ విక్కీ చందోక్ పేర్లను తొలిగించారు.
మూడేళ్ల కాలానికిగాను ఎఫ్‌ఐఏలో భారత ప్రతినిధిగా మాల్యాను నామినేట్ చేశారు. ఆయన పదవీకాలం 2018తో ముగుస్తోంది. ఒకవేళ మాల్యాను అర్ధంతరంగా తప్పిస్తే, నిబంధనల ప్రకారం ఎఫ్‌ఐఏలో భారత్ నుంచి కొత్త ప్రతినిధిని నామినేట్ చేసేందుకు అవకాశముండదని అంతకముందు అక్బర్ ఇబ్రహీం చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో మాల్యా పదవీకాలం ముగిసేదాకా వేచిచూడడం తప్ప ఏమీ చేయలేం అని అక్బర్ అన్నారు. కానీ తాజాగా క్రీడా మంత్రిత్వశాఖ జోక్యంతో ఆయన తప్పుకున్నట్టు తెలిసింది.