మాల్యాపై విచారణ వాయిదాపడింది
మాల్యాపై విచారణ వాయిదాపడింది
Published Sat, May 13 2017 8:51 AM | Last Updated on Tue, Sep 5 2017 11:05 AM
లండన్ : భారత బ్యాంకులకు వేల కోట్ల రూపాయల ఎగనామం పెట్టి యూకేలో తలదాచుకుంటున్న లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. విజయ్ మాల్యాను భారత్ కు అప్పగించే విషయమై లండన్ లోని వెస్ట్ మినిస్టర్ మెజిస్ట్రేట్ కోర్టు ముందుకు రాబోతున్నకేసు విచారణ వాయిదా పడింది. విజయ్ మాల్యా అప్పగింత విచారణ జూన్ 13కు వాయిదా పడినట్టు బ్రిటన్ క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్(సీపీఎస్) శనివారం పేర్కొంది. భారత అధికారుల తరుఫున వెస్ట్ మినిస్టర్ కోర్టులో క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీసు తమ వాదనలు వినిపించనుంది. మాల్యాను భారత్ కు అప్పగించే కేసు విచారణను మే17న చేపట్టనున్నట్టు అంతకముందు లండన్ కోర్టు పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే ఆ విచారణ జూన్ 13కు వాయిదా పడినట్టు సీపీఎస్ అధికార ప్రతినిధి చెప్పారు.
మాల్యాను భారత్ కు అప్పగించే ప్రయత్నాల్లో భాగంగా గతనెలే ఆయన్ను స్కాట్లాండ్ పోలీసులు అక్కడ అరెస్టు చేశారు. అరెస్టు అయిన గంటల వ్యవధిలోనే ఆయన బెయిల్ పై బయటికి వచ్చారు. మాల్యా అరెస్టు తర్వాత ఆయన్ను వీలైనంత త్వరగా భారత్ కు రప్పించాలని ఇక్కడి అధికారులు ప్రయత్నాలు సాగిస్తున్నారు. నలుగురు సభ్యుల సీబీఐ, ఈడీ టీమ్ కూడా గత నెలే లండన్ కు వెళ్లింది. ఈడీ, సీబీఐ సమర్పించిన డాక్యుమెంట్ల ఆధారంగా సీపీఎస్ అక్కడి కోర్టులో తమ వాదనలు వినిపించనుందని అధికార వర్గాలు చెప్పాయి. కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ అధినేత అయిన మాల్యా, భారత బ్యాంకులకు 9వేల కోట్ల రూపాయల ఎగ్గొట్టి, యూకేకు పారిపోయిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి సీబీఐ, ఈడీ అధికారులు ఆయన్ను భారత్ కు రప్పించడానికి, బ్యాంకులు తమ రుణాలు రికవరీ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి.
Advertisement
Advertisement