
వైజాగ్‌స్టీల్ ఉక్కు ధర టన్నుకు రూ.600 పెంపు
సాక్షి,విశాఖపట్నం: కేంద్రప్రభుత్వరంగ సంస్థ వైజాగ్ స్టీల్ మార్కెట్లో ఉక్కు ధరలను పెంచింది. ఇటీవల రైల్వే రవాణా ఛార్జీల పెంపు నేపథ్యంలో యాజమాన్యం ఉక్కు ధరల పెంపుపై అనేక తర్జనభర్జనల అనంతరం టన్నుకు రూ.600వరకు పెంచాలని మంగళవారం నిర్ణయిచింది. బహిరంగ విపణిలో వివిధ ఉక్కు ముడి సరకుల ధరలు పెరిగిన నేపథ్యంలో మే నెలలో టన్ను ఉక్కుకు ఆర్‌ఐఎన్‌ఎల్ రూ.1500 పెంచింది.
మళ్లీ ఇప్పుడు రైల్వే రవాణా ఛార్జీల పెంపు వలన అదనంగా సంస్థపై పడుతోన్న రూ.96కోట్ల అదనపు భారాన్ని తట్టుకునేందుకు ధరలను పెంచినట్లు ప్రకటించింది. అందులోభాగంగా రీ బార్స్ విభాగంలో 8,10,12 ఎంఎం రకం టన్నుకు రూ.600చొప్పున, 20,25,32 ఎంఎంకు టన్నుకు రూ.500 చొప్పున, డబ్ల్యూఆర్‌ఎం ఉత్పత్తులు( రాడ్స్) టన్నుకు రూ.450, బిల్లెట్స్ రూ.300, ఛానల్స్(రూఫ్‌కు బిగించే ఉక్కు) టన్నుకు రూ.300, బీమ్స్ టన్నుకు రూ.300చొప్పున పెంచాలని నిర్ణయించింది.