వైజాగ్ స్టీల్‌ప్లాంట్ టర్నోవర్ రూ. 4,524 కోట్లు
ఉక్కునగరం(విశాఖపట్నం): నవరత్న సంస్థ విశాఖ స్టీల్‌ప్లాంట్ ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-ఆగస్టు మధ్య ఐదు నెలల్లో రూ. 699 కోట్లు విలువైన ఎగుమతులతో రూ. 4,524 కోట్లు టర్నోవర్ సాధించింది. ఆగస్టులో రూ.176 కోట్లు ఎగుమతులు చేయడం ద్వారా గతేడాది ఇదే వ్యవధి కంటే 46% వృద్ధి సాధించింది. ఎగుమతుల్లో 82 శాతం వృద్ది సాధించగా.. అందులో స్పెషల్ స్టీల్‌లో 12 శాతం, వైర్ రాడ్‌లో 46 శాతం అధికంగా ఎగుమతులు జరిగాయి.
ఆగస్టు నెలలో 3.06 లక్షల టన్నుల ఉత్పత్తులు అమ్మకాలు చేయడంతో ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఐదునెలల్లో మొత్తం 12.42 లక్షల టన్నుల ఉత్పత్తుల అమ్మకాలు జరిగాయి. ఆగస్టులో కోక్, ద్రవ ఉక్కు, కాస్ట్ బ్లూమ్స్, వైర్ రాడ్‌లు గత ఏడాది ఆగస్టు కంటే అధికంగా ఉత్పత్తి సాధించడం విశేషం. ఈ సందర్భంగా స్టీల్‌ప్లాంట్ సీఎండీ పి.మధుసూదన్ మాట్లాడుతూ ప్రభుత్వం 100 స్మార్ట్ సిటీలు ప్రకటించడం వల్ల దేశంలో మౌలిక రంగం, ముఖ్యంగా ఉక్కు పరిశ్రమకు మంచి అవకాశాలు లభిస్తాయన్నారు. విస్తరణ యూనిట్లలో ఉత్పత్తిని స్థిరీకరించడం, ఆధునిక యూనిట్లలో ఉత్పత్తిని పెంచడం ద్వారా విశాఖ స్టీల్‌ప్లాంట్ ముందుకు సాగుతుందన్నారు.