
సాక్షి, హైదరాబాద్ : రోజురోజుకు అమాంతం పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరలు ప్రజలను బెంబెలెత్తిస్తున్నాయి. గడిచిన పదిరోజుల్లో పెట్రోల్ ధర క్రమంగా పెరిగింది కానీ, తగ్గింది లేదు. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో లీటరు పెట్రోల్ 81. 47 రూపాయలకు లభిస్తుండగా.. లీటరు డీజిల్ 74.04 రూపాయలకు లభిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు పెరగడంతో దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయని మార్కెట్ వర్గాలు అంటున్నాయి.
ఏదిఏమైనా పెట్రోల్, డీజిల్ ధరలు అమాంతం పెరగడంతో సామ్యానుడిపై భారం మరింత పడుతోంది. మధ్యతరగతి వేతన జీవులు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరల భారాన్ని తట్టుకోవడానికి తమ రోజువారీ నిత్యావసరాల్లో కోత పెట్టుకోవాల్సి పరిస్థితి నెలకొంది. మొత్తానికి దేశమంతటా పెట్రోల్, డీజిల్ ధరలపై సామాన్య, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాగే ధరలు పెరుగుతూపోతే త్వరలోనే లీటరు పెట్రోల్ ధర రూ. 100లను దాటుతుందని, అప్పుడు మధ్యతరగతి ప్రజలు మరింతగా ఇబ్బంది పడాల్సి వస్తుందని అంటున్నారు. వెంటనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకొని పెట్రో ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంలో కేంద్ర పెట్రోలియంశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చమురు సంస్థలతో చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది.
మరోవైపు పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలంటే రాష్ట్ర స్థాయిలో వ్యాట్ తదితర పన్నులు, కేంద్రం పన్నులు, సుంకాలు తగ్గించడమే ఒక్కటే మార్గమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ‘పెట్రో ధరలు నేరుగా ముడి చమురు ధరలతో ముడిపడి ఉన్నాయి. ఓపీఈసీ దేశాలు ముడిచమురు సరఫరాను నిలిపివేశాయి. అంతర్జాతీయంగా ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ధరలు తగ్గించాలని చెప్పడానికి లేదు. కానీ కేంద్ర, రాష్ట్రాల స్థాయిలో విధిస్తున్న వివిధ పన్నులు, సుంకాలు తగ్గించడం ద్వారా పెరుగుతున్న పెట్రోల్ ధరల నుంచి సామాన్యులకు ఊరట కల్పించవచ్చు. ధరలు తగ్గించడానికి అదొక్కటే మార్గం’ అని పెట్రోల్ పంప్ డీలర్స్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు అజయ్ భన్సల్ తెలిపారు.