తొలి ఇన్వెస్ట్‌మెంట్‌కు ఎలాంటి ఫండ్స్‌ ఎంచుకోవాలి? | What Funds Should You Choose for First Investment? | Sakshi
Sakshi News home page

తొలి ఇన్వెస్ట్‌మెంట్‌కు ఎలాంటి ఫండ్స్‌ ఎంచుకోవాలి?

Published Mon, Sep 25 2017 1:19 AM | Last Updated on Mon, Sep 25 2017 1:19 AM

What Funds Should You Choose for First Investment?

నాకు నెలకు రూ.25 వేల వరకూ జీతం వస్తోంది. రూ.5,000–8,000 వరకూ పొదుపు చేయగలను. కనీసం 20 ఏళ్లపాటు పొదుపు చేయాలనుకుంటున్నాను. మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయడం కొత్త. తొలిసారిగా మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేసేటప్పుడు ఎలాంటి ఫండ్స్‌ ఎంచుకోవాలి. ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలో తెలపండి?  –ఇంతియాజ్, హైదరాబాద్‌

చాలా మంది మిగులు జీతాన్ని బ్యాంక్‌లో సేవింగ్స్‌ ఖాతాల్లో ఉంచుతారు. ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు అనే ఉద్దేశంతో అలా చేస్తారు. మీరు నెలకు రూ.5,000–8,000 వరకూ ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటున్నారు. కాబట్టి.. మొదటగా మీరు అత్యవసర నిధి ఏర్పాటు చేసుకోవాలి. ఆరు నెలల మీ ఖర్చులకు సరిపడా మొత్తాన్ని అత్యవసర నిధిగా ఏర్పాటు చేసుకోవాలి. ఆ తర్వాత నుంచి ఇన్వెస్ట్‌మెంట్స్‌ ప్రారంభించాలి. దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటున్నారు. కాబట్టి దీర్ఘకాలంలో అధిక రాబడులనిచ్చే ఈక్విటీలను ఎంచుకోవాలి. అయితే మీరు ఇన్వెస్ట్‌మెంట్స్‌కు కొత్త కాబట్టి. మ్యూచువల్‌ ఫండ్స్‌ ద్వారా ఈక్విటీల్లో ఇన్వెస్ట్‌ చేస్తే మంచిది.

మ్యూచువల్‌ ఫండ్స్‌లో ట్యాక్స్‌ సేవింగ్, బ్యాలన్స్‌డ్‌ ఫండ్స్‌ను ఎంచుకోవాలి. ట్యాక్స్‌ సేవింగ్స్‌ ఫండ్స్‌నే ఈక్విటీ లింక్డ్‌ సేవింగ్స్‌ స్కీమ్‌(ఈఎల్‌ఎస్‌ఎస్‌)గా వ్యవహరిస్తారు. ఆదాయపు పన్ను చట్టం సెక్షన్‌ 80 సి ప్రకారం లభించే రూ. లక్షన్నర పన్ను రాయితీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ల్లో ఈఎల్‌ఎస్‌ఎస్‌లు కూడా ఉన్నాయి. వీటికి మూడేళ్ల లాక్‌ ఇన్‌ పీరియడ్‌ ఉంటుంది. ఇక బ్యాలన్స్‌డ్‌ ఫండ్స్‌ విషయానికి వస్తే, వీటిని హైబ్రిడ్‌ ఫండ్స్‌ అని కూడా వ్యవహరిస్తారు. ఈ ఫండ్స్‌ తమ మొత్తం నిధుల్లో కొంత భాగాన్ని ఈక్విటీలోనూ, మరికొంత భాగాన్ని డెట్‌ సాధనాల్లోనూ ఇన్వెస్ట్‌ చేస్తాయి. మార్కెట్‌ క్షీణించినప్పుడు ఈక్విటీ ఫండ్స్‌లా  బ్యాలన్స్‌డ్‌ ఫండ్స్‌ నష్టపోకుండా ఈ డెట్‌ సాధనాలు ఉపకరిస్తాయి.

ఒక్కో కేటగిరి నుంచి ఒక్కో ఫండ్‌ను ఎంచుకొని ప్రతి నెలా మీరు ఇన్వెస్ట్‌ చేయాలనుకున్న మొత్తాన్ని సిప్‌(సిస్టమేటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌) విధానంలో ఇన్వెస్ట్‌ చేస్తే దీర్ఘకాలంలో మీరు మంచి రాబడులు పొందగలరు. దీంతో పాటు బీమా కోసం టర్మ్‌ బీమా పాలసీ తీసుకోండి. ఇతర బీమా పాలసీలతో పోల్చితే టర్మ్‌ బీమా పాలసీలకు చెల్లించాల్సిన ప్రీమియమ్‌ తక్కువగానూ, బీమా కవరేజ్‌ అధికంగానూ ఉంటుంది.  

ఆల్ట్రా షార్ట్‌ టర్మ్‌ ఫండ్స్‌ అంటే ఏమిటి ? సేవింగ్స్‌ ఖాతాల కంటే ఈ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయడం మంచిదా? వీటికి లాక్‌–ఇన్‌ పీరియడ్‌ ఉంటుందా ? ఇన్వెస్ట్‌ చేయడానికి కొన్ని మంచి ఆల్ట్రా షార్ట్‌ టర్మ్‌ ఫండ్స్‌ను సూచించండి?  –మాథ్యూస్, సికింద్రాబాద్‌  

ఏడాదికి మించని మెచ్యూరిటీ ఉండే సాధనాల్లో ఆల్ట్రా షార్ట్‌ టర్మ్‌ ఫండ్స్‌ ఇన్వెస్ట్‌ చేస్తాయి. మీ వద్ద మిగులు నగదు ఉంటే ఏడాదిలోపు ఇన్వెస్ట్‌మెంట్‌ కాలానికి వీటిని ఎంచుకోవచ్చు. వీటిపై గ్యారంటీగా ఇంత రాబడి వస్తుందని చెప్పలేము. పెట్టుబడి రక్షణకు గ్యారంటీ కూడా లేదు. అయితే నష్టభయం పరిగణించదగ్గ స్థాయిలో ఉండదని చెప్పవచ్చు. ఖచ్చితంగా సేవింగ్స్‌ ఖాతా కంటే అదనపు రాబడులే వస్తాయి. ఈ ఫండ్స్‌కు ఎలాంటి లాక్‌–ఇన్‌ పీరియడ్‌ లేదు.

మీరు మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను వెనక్కి తీసుకోవాలనుకున్నప్పుడు రిడంప్షన్‌ రిక్వెస్ట్‌ను సమర్పిస్తే సరిపోతుంది. 1 నుంచి 3 రోజుల్లో మీ డబ్బులు మీకు వచ్చేస్తాయి. కొన్ని ఫండ్స్‌ తక్షణ రిడంప్షన్‌ సదుపాయాన్ని కూడా అందిస్తున్నాయి. ఈ ఫండ్స్‌ నుంచి ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఉపసంహరించుకుంటే.. డెట్‌ ఫండ్స్‌కు వర్తించే పన్ను నిబంధనలు ఈ ఆల్ట్రా షార్ట్‌ టర్మ్‌ ఫండ్స్‌కు వర్తిస్తాయి. ఇక మీరు ఇన్వెస్ట్‌ చేయడానికి ఈ ఫండ్స్‌ను పరిశీలించవచ్చు. ఫ్రాంక్లిన్‌ ఇండియా ఆల్ట్రా షార్ట్‌ బాండ్‌ ఫండ్, బరోడా పయనీర్‌ ట్రెజరీ అడ్వాండేజ్‌ ఫండ్, ఎల్‌ అండ్‌ టీ ఫ్లోటింగ్‌ రేట్‌ ఫండ్, ఇండియాబుల్స్‌ ఆల్ట్రా షార్ట్‌ టర్మ్‌ ఫండ్‌.

ఒక కంపెనీ ఆర్థిక స్థితిగతులను ఎలా అంచనా వేయాలి?  పనితీరు బాగా లేని కంపెనీలను పసిగట్టే విధానాలు ఏమైనా ఉన్నాయా?  –నవనీత, విశాఖపట్టణం

భవిష్యత్తును ఎవరూ సరిగ్గా అంచనా వేయలేరు. ఈ విషయం స్టాక్‌ మార్కెట్‌కు కూడా వర్తిస్తుంది. అయితే భవిష్యత్తులో కంపెనీ పనితీరు బాగా లేకపోయే పరిస్థితులను పసిగట్టటానికి ప్రధానంగా రెండు మార్గాలున్నాయి. మొదటిది షేర్ల తనఖా..వ్యాపారం నిమిత్తమో, లేకుంటే వ్యక్తిగత అవసరాల కోసమో ప్రమోటర్లు తన వాటా షేర్లను తనఖాగా పెట్టి రుణాలు తీసుకుంటారు. అయితే ఇలా షేర్లు తనఖా పెట్టడమనేది సాధారణమైన విషయమే. అయితే ఇలా తనఖా పెట్టే షేర్ల శాతం పెరిగితేనే తంటా.

తనఖా పెట్టిన షేర్లు అధికంగా ఉండి, సదరు కంపెనీ షేరు ధర పడిపోతున్నప్పుడు, సెక్యూరిటీగా మరిన్ని షేర్లను తనఖా పెట్టమని రుణాలిచ్చే సంస్థ.. ప్రమోటర్‌ను డిమాండ్‌ చేయవచ్చు. ప్రమోటర్‌ రుణ చెల్లింపుల్లో విఫలమైతే, తనఖా పొందిన షేర్లను సదరు సంస్థలు విక్రయించవచ్చు. ఫలితంగా కంపెనీ షేర్‌ ధర మరింతగా పతనం కావచ్చు. ఇక రెండో విషయం.. కంపెనీలో ప్రమోటర్ల వాటా తగ్గడం... ఏదైనా కంపెనీలో ప్రమోటర్ల వాటా తగ్గడం కొనసాగుతుంటే.. కంపెనీ ప్రమాదంలో ఉన్నదనే చెప్పవచ్చు. కంపెనీలో ప్రమోటర్ల వాటా తగ్గుతుందంటే.. సదరు వ్యాపారంపై ప్రమోటర్లకు ఆసక్తి తగ్గుతోందని లేదా తనఖా పొందిన షేర్లను రుణదాతలు విక్రయించడం కానీ, కంపెనీ రుణాన్ని ఈక్విటీగా మార్చుకోవడం గానీ జరుగుతోందని అర్థం.  


- ధీరేంద్ర కుమార్‌ సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement