అసలు ఈ పీసీలకు ఏమైంది...?
ప్రపంచ చిప్ తయారీ దిగ్గజం ఇంటెల్ ప్రతి పదిమంది ఉద్యోగుల్లో ఒకరిని తొలగిస్తామని ఎందుకు ప్రకటించింది. 2017 మధ్య వరకు ప్రపంచవ్యాప్తంగా తమ సంస్థలలో పనిచేసే 12 వేల మంది ఉద్యోగులను ఎందుకు ఇంటికి పంపేస్తోంది? వీటన్నింటికీ సంస్థ చెప్పే సమాధానం ఒక్కటే.. పర్సనల్ కంప్యూటర్ల (పీసీ) పరిశ్రమ పడిపోవడమని. అసలు మార్కెట్లో పీసీ అమ్మకాలకు ఏమైంది. ఈ అమ్మకాలు అంతలా పడిపోవడానికి కారణమేమిటి.. ఎప్పటి నుంచి అమ్మకాల క్షీణత ప్రారంభమైంది.. ఓసారి చూద్దాం.
పీసీల ఎదుగుదల, తగ్గుదల
2011 వరకూ పీసీ పరిశ్రమకు ఫుల్ క్రేజ్ ఉండేది. ఎవరిని చూసినా ల్యాప్ టాప్ కొనాలని అనుకునేవాళ్లు. సాప్ట్ వేర్ ప్రొఫెషనల్స్, సాధారణ ఉద్యోగుల నుంచి అటు చదువుకునే పిల్లల వరకు అంతా ల్యాప్‌టాప్‌ల వైపే ఎక్కువగా మొగ్గు చూపేవారు. కాస్త ధర ఎక్కువైనా ఫర్వాలేదు గానీ, వాడుకోడానికి సులభంగా ఉంటుందని, ఎక్కడికైనా తీసుకెళ్లచ్చని అనుకునేవారు. అయితే 2016 సంవత్సరం మొదటి త్రైమాసికంలో నమోదైన ఫలితాల్లో పీసీల అమ్మకాలు ఒక్కసారిగా 10 శాతం పడిపోయాయి. కేవలం 6 కోట్ల పీసీలే అమ్ముడుపోయినట్టు గణాంకాలు చూపించాయి. ఇక అప్పటినుంచి మొదలైన అమ్మకాల క్షీణత, 2014లో కొంచెం ఫర్వాలేదు అనిపించినా, తర్వాత మళ్లీ పడిపోయింది. ప్రస్తుతం పీసీల పరిశ్రమల నేలచూపులే చూస్తోంది. భారత్ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కొత్త వినియోగదారులను చేరుకోలేకపోవడం, వినియోగదారులు కూడా చాలావరకు ట్యాబ్లెట్ పీసీలు, స్మార్ట్ ఫోన్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం పీసీల డిమాండ్ పడిపోవడానికి ప్రధాన కారణాలుగా ఉన్నాయి.
స్మార్ట్ బూమ్
టెక్నాలజీ క్రమేపీ అభివృద్ధి చెంది స్మార్ట్ ఫోన్లు మార్కెట్లోకి ప్రవేశించడంతో పీసీల డిమాండ్ దారుణంగా పడిపోయింది. 2016 నుంచి స్మార్ట్ ఫోన్ల బూమ్ మరీ ఎక్కువ కావడంతో పీసీల ఇండస్ట్రీ దిక్కుతోచని పరిస్థితిలో పడిపోయింది. మొదట్లో స్మార్ట్ ఫోన్లకు డిమాండ్ తక్కువగానే ఉన్నా.. తర్వాత ధర తగ్గడం, ఎక్కువ మోడళ్లు అందుబాటులోకి రావడంతో క్రమంగా ప్రపంచమే స్మార్ట్ ఫోన్ లోకంగా మారింది. గతేడాది స్మార్ట్ ఫోన్ల రవాణా 150 కోట్లకు ఎగబాకింది. మరోవైపు పీసీలకు ప్రత్యామ్నాయంగా వస్తున్న టాబ్లెట్లు సైతం పీసీల అమ్మకాలకు గండి కొడుతున్నాయి. పీసీ కొనుకోవాలనుకునేవారిలో చాలామంది టాబ్లెట్ల వైపు మొగ్గుచూపుతున్నారు. పీసీలు ఆఫర్ చేసే ప్రతి ఫీచర్లను టాబ్లెట్లు అందుబాటులోకి తేవడమే వీటి డిమాండ్‌కు ప్రధాన కారణం అవుతోంది. 2010లో టాబ్లెట్ల రవాణా 5శాతం ఉంటే, 2014లో అది కాస్తా 40 శాతానికి పెరిగింది.