రత్నాలుగా ఉన్నప్పుడే...పీఎస్యూలను అమ్మేయాల్సింది | why adopt policy of privatisation by 'malign neglect': Ruchir Sharma | Sakshi
Sakshi News home page

రత్నాలుగా ఉన్నప్పుడే...పీఎస్యూలను అమ్మేయాల్సింది

Published Fri, Jun 24 2016 12:51 AM | Last Updated on Mon, Sep 4 2017 3:13 AM

రత్నాలుగా ఉన్నప్పుడే...పీఎస్యూలను అమ్మేయాల్సింది

రత్నాలుగా ఉన్నప్పుడే...పీఎస్యూలను అమ్మేయాల్సింది

ప్రైవేటు కంపెనీలు నిర్వీర్యం చేస్తుంటే చూస్తూ ఉన్నారు
ప్రభుత్వ విధానాన్ని తప్పుబట్టిన ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్ రుచిర్‌శర్మ...

 న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థలు (పీఎస్‌యూ)ల విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని ప్రముఖ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్ రుచిర్ శర్మ తప్పుబట్టారు. పీఎస్‌యూలను లాభసాటిగా ఉన్నప్పుడే వాటిని ప్రభుత్వం అమ్మేసి ఉండాలని అభిప్రాయపడ్డారు. అలా చేయకపోగా, ప్రైవేటు కంపెనీలు వాటిని నిర్వీర్యం చేస్తూ ఉంటే ప్రభుత్వం కళ్లప్పగించి చూసిందని విమర్శించారు. ‘ద రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ నేషన్స్: టెన్ రూల్స్ ఆఫ్ చేంజ్ ఇన్ పోస్ట్ క్రైసిస్ వరల్డ్’  పేరుతో రుచిర్ శర్మ తాజాగా రాసిన పుస్తకంలో ఈ మేరకు భారత ప్రభుత్వ విధానాలను విశ్లేషించారు. ప్రైవేటీకరణ అనే అసంబద్ధ విధానాన్ని ప్రభుత్వం అమలు చేసిందన్నారు. ‘‘పీఎస్‌యూలను విక్రయించలేదు. అలా అని వాటిని సంస్కరించనూ లేదు. దీనికి బదులు ప్రైవేటు కంపెనీలు పీఎస్‌యూలను బలహీనపరుస్తూ ఉంటే ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహించింది’’ అని మోర్గాన్ స్టాన్లీ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ ముఖ్య వ్యూహకర్త రుచిర్ శర్మ అన్నారు.

 పుస్తకంలోని ప్రధాన అంశాలు: 30 ఏళ్ల క్రితం భారతీయులు గగనతలంలో ప్రయాణించాలంటే ఎయిర్ ఇండియా సంస్థ ఒక్కటే ఆధారం. కానీ, ప్రైవేటు ఎయిర్‌లైన్ సంస్థల రాకతో ఎయిర్ ఇండియా వాటా 25 శాతం కంటే దిగువకు పడిపోయింది. ఒకప్పుడు ఏకఛత్రాధిపత్యంతో టెలికామ్ మార్కెట్‌ను ఏలి నేడు నష్టాల్లో కూరుకుపోయిన బీఎస్‌ఎన్‌ఎల్, ఎంటీఎన్‌ఎల్ పరిస్థితిని కూడా ఆయన వర్ణించారు. దూకుడుగా ఉండే ప్రైవేటు టెలికాం కంపెనీలతో పోటీ పడలేక బీఎస్‌ఎన్‌ఎల్, ఎంటీఎన్‌ఎల్ క్రమంగా క్షీణించిపోయారు.

 మోదీ పానలలో సానుకూలతలు... లోపాలు
ప్రధాని మోదీ సైతం ‘దేశ సంప్రదాయ విధానమైన కాలానుగుణంగా మార్పు’ విధానానికే కట్టుబడి ఉన్నారని శర్మ పేర్కొన్నారు. ఇంధన సబ్సిడీలను తగ్గింపు, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పోటీ వాతావరణం వంటి కొన్ని సానుకూల చర్యలను మోదీ చేపట్టినట్టు ప్రశంసించారు. అయితే, ప్రభుత్వ బ్యాంకింగ్ రంగం 75% రుణాలను నియంత్రిస్తుండడాన్ని  ప్రధాన అవరోధంగా పేర్కొన్నారు. భారత్‌లో తయారీ విధానంలోనే ప్రాథమిక లోపం ఉందని, సాధారణ ఫ్యాక్టరీల ఏర్పాటు గురించి మోదీ మాట్లాడడం లేదన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement