
ఫెడ్ వాయిదాతో లాభాలు
అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల పెంపును వాయిదా వేయడం మన స్టాక్‌మార్కెట్‌ను లాభాల్లో నడిపించింది
255 పాయింట్ల లాభంతో 26,219కు సెన్సెక్స్
83 పాయింట్ల లాభంతో 7,982కు నిఫ్టీ
అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల పెంపును వాయిదా వేయడం మన స్టాక్‌మార్కెట్‌ను లాభాల్లో నడిపించింది. ఫెడ్ నిర్ణయం, ద్రవ్యోల్బణం తగ్గుతుండడం వంటి కారణాల వల్ల రిజర్వ్ బ్యాంక్ కీలక రేట్లను తగ్గిస్తుందన్న అంచనాలతో బ్యాంక్, రియల్టీ షేర్లు పెరిగాయి. రూపాయి 79 పైసలు పెరగడం కూడా ప్రభావం చూపింది. బీఎస్‌ఈ సెన్సెక్స్ 255 పాయింట్లు లాభపడి 26,219 పాయింట్ల వద్ద, నిఫ్టీ 83 పాయింట్లు లాభపడి 7,982 పాయింట్ల వద్ద ముగిశాయి. ఒక దశలో సెన్సెక్స్ 500 పాయింట్లు. నిఫ్టీ 150 పాయింట్లు వరకూ లాభపడ్డాయి.
అయితే ట్రేడింగ్ చివరి గంటలో లాభాల స్వీకరణ చోటు చేసుకోవడం, యూరోప్ మార్కెట్లు బలహీనంగా ప్రారంభం కావడంతో లాభాలకు కళ్లెం పడింది. బ్యాంక్, రియల్టీ షేర్లతో పాటు ఫార్మా, ఆయిల్, గ్యాస్ షేర్లలో కూడా కొనుగోళ్లు జరిగాయి. ఎఫ్‌ఎంసీజీ, క్యాపిటల్ గూడ్స్ సూచీలు మినహా మిగిలిన అన్ని రంగాల సూచీలు లాభాల్లోనే ముగిశాయి. ఈ వారంలో సెన్సెక్స్ 609 పాయింట్లు(2.4 శాతం), నిఫ్టీ 193 పాయింట్లు(2.5 శాతం) చొప్పున పెరిగాయి. స్టాక్ మార్కెట్ లాభాల్లో ముగియడం ఇది వరుసగారెండో వారం.
యాక్సిస్ బ్యాంక్ 4.7 శాతం అప్: రేట్ల పెంపు నిర్ణయాన్ని ఈ ఏడాదిచివరకు ఫెడ్ వాయిదా వేయడం భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఒకింత రిలీఫ్‌ను ఇచ్చిందని రిలయన్స్ సెక్యూరిటీస్ హెడ్ హితేశ్ అగర్వాల్ చెప్పారు. 30 సెన్సెక్స్ షేర్లలో 17 షేర్లు లాభాల్లో, 13 షేర్లు నష్టాల్లో ముగిశాయి. యాక్సిస్ బ్యాంక్ 4.7 శాతం, ఓఎన్‌జీసీ 3.4 శాతం, మహీంద్రా అండ్ మహీంద్రా 3 శాతం, లుపిన్ 2.7 శాతం, రిలయన్స్ 2.6 శాతం, ఎస్‌బీఐ 2.4 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 2.3 శాతం, హీరో మోటొకార్ప్ 2.2 శాతం, సన్ ఫార్మా 2 శాతం, విప్రో 1.9 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 1.8 శాతం చొప్పున పెరిగాయి.
టాటా మోటార్స్ 2.8 శాతం, బజాజ్ ఆటో 2.2 శాతం, గెయిల్ 1.7 శాతం, హిందాల్కో 1.4 శాతం, సిప్లా 1 శాతం, హిందూస్తాన్ యూనిలివర్ 1 శాతం, ఐటీసీ 0.8 శాతం, భారతీ ఎయిర్‌టెల్ 0.8 శాతం, చొప్పున నష్టపోయాయి. 1,712 షేర్లు లాభాల్లో 917 షేర్లు నష్టాల్లో ముగిశాయి. టర్నోవర్ బీఎస్‌ఈలో రూ.4,594 కోట్లుగా, ఎన్‌ఎస్‌ఈ నగదు విభాగంలో రూ.23,031 కోట్లుగా, ఎన్‌ఎస్‌ఈ డెరివేటివ్స్ విభాగంలో రూ.3,54,978 కోట్లుగా నమోదైంది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.644 కోట్లు, దేశీ ఇన్వెస్టర్లు రూ.415 కోట్లు నికర కొనుగోళ్లు జరిపారు. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి.