రెండేళ్లకు ఒక అమ్యూజ్మెంట్ పార్క్ | Wonderla Holidays to open ₹250-cr facility in Hyderabad next month | Sakshi
Sakshi News home page

రెండేళ్లకు ఒక అమ్యూజ్మెంట్ పార్క్

Published Wed, Mar 23 2016 2:03 AM | Last Updated on Sun, Sep 3 2017 8:20 PM

రెండేళ్లకు ఒక అమ్యూజ్మెంట్ పార్క్

రెండేళ్లకు ఒక అమ్యూజ్మెంట్ పార్క్

50 లక్షల జనాభా ఉన్నచోట ఏర్పాటు
ఏప్రిల్ నుంచి హైదరాబాద్ పార్క్ రెడీ
కంపెనీ ఎండీ అరుణ్ చిట్టిలపిల్లి

 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అమ్యూజ్‌మెంట్ పార్క్‌ల నిర్వహణలో ఉన్న వండర్‌లా హాలిడేస్ భారీగా విస్తరిస్తోంది. రెండేళ్లకు ఒక పార్క్‌ను నెలకొల్పాలన్నది సంస్థ లక్ష్యం. 50 లక్షల జనాభా ఉన్న నగరాల్లో ఏర్పాటు చేస్తామని వండర్‌లా ఎండీ అరుణ్ కె చిట్టిలపిల్లి మంగళవారమిక్కడ సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. గుజరాత్‌తోపాటు మహారాష్ట్రలో 2018లోగా అడుగు పెడతామని చెప్పారు. చెన్నైలో 65 ఎకరాల్లో రూ.350 కోట్లతో భారీ పార్క్ మూడేళ్లలో సిద్ధమని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని ప్రాంతంలో పార్కు ఏర్పాటు చేయాలన్న ఆలోచన ఉందన్నారు. ఒక్కో ప్రాజెక్టుకు రూ.250 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు వెల్లడించారు. బెంగళూరు, కొచ్చిలో విజయవంతంగా పార్క్‌లను నిర్వహిస్తున్న వండర్‌లా తాజాగా హైదరాబాద్ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసింది.

 రిసార్టుల ఏర్పాటు..
వండర్‌లా హాలిడేస్ బెంగళూరులో రిసార్టును నిర్వహిస్తోంది. హైదరాబాద్ అమ్యూజ్‌మెంట్ పార్కు వద్ద ఇటువంటిది రెండేళ్లలో నెలకొల్పాలని సంస్థ కృతనిశ్చయంతో ఉంది. రిసార్టుకు రూ.50 కోట్ల దాకా వ్యయం అవుతుందని కంపెనీ అడ్మినిస్ట్రేషన్ డెరైక్టర్ ప్రియ జోసెఫ్ మీడియాకు తెలిపారు. ‘బెంగళూరు, కొచ్చి అమ్యూజ్‌మెంట్ పార్క్‌లకు ఏటా 25 లక్షల మంది సందర్శిస్తున్నారు. ఈ పార్కుల విస్తరణకు రూ.200 కోట్లు ఖర్చు చేస్తున్నాం. పార్కులో రైడ్స్ అన్నీ ఉచితమే. ఈ అంశమే అందరినీ ఆకట్టుకుంటోంది’ అని వివరించారు. హైదరాబాద్ పార్కుకు తొలి ఏడాది 7 లక్షల మంది సందర్శకులు వస్తారని అంచనా. తద్వారా రూ.60 కోట్లు సమకూరతాయని సంస్థ భావిస్తోంది.

 ఏప్రిల్ నుంచి రెడీ..
హైదరాబాద్ పార్క్‌ను ఏప్రిల్ 2 నుంచి ప్రారంభిస్తున్నారు. ఔటర్ రింగ్‌రోడ్డు ఎక్సిట్ నంబరు 13 వద్ద 50 ఎకరాల్లో ఇది నెలకొంది. రూ.250 కోట్లు ఖర్చు చేశారు. 43 రకాల ల్యాండ్, వాటర్ ఆధారిత రైడ్స్ అలరించనున్నాయి. శంషాబాద్ విమానాశ్రయం నుంచి 15 నిమిషాల్లో చేరుకోవచ్చు. ఒకే రోజు 10,000 మందికి ఆతిథ్యం ఇచ్చే సామర్థ్యం ఉంది. టికెట్ ధర సాధారణ రోజుల్లో రూ.900, వారాంతాలు, పండుగలకు రూ.1,000 ఉండే అవకాశం ఉంది. పిల్లలకు ఎత్తునుబట్టి టికెట్ ధరలు ఉంటాయని వండర్‌లా సీఈవో దీపిందర్‌జిత్ సింగ్ సచ్‌దేవా తెలిపారు. దేశంలో మొదటిసారిగా రివర్స్ లూపింగ్ రోలర్ కోస్టర్ ఇక్కడ ఏర్పాటైంది. ఒక మెగావాట్ సౌర విద్యుత్ వ్యవస్థా నెలకొంది. తెలుగు రాష్ట్రాల్లో ఇది మొదటి అమ్యూజ్‌మెంట్ పార్క్. తెలంగాణ ప్రభుత్వ సహకారంతో తక్కువ సమయంలో 15 నెలల్లోనే నిర్మాణం పూర్తి చేసినట్లు ప్రమోటర్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement