ముంబై: భారతీయులకు బంగారం పట్ల ఉన్న మక్కువ అంతకంతకూ పెరిగిపోతోంది. 2017లో దేశీయంగా వినియోగం 9 శాతం పెరిగి 727 టన్నులుగా నమోదైంది. కానీ, అంతర్జాతీయంగా మాత్రం డిమాండ్ 7 శాతం పడిపోయింది. ఈ గణాంకాలను వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యూజీసీ) మంగళవారం విడుదల చేసింది. 2016లో దేశీయ బంగారం డిమాండ్ 666.1 టన్నులుగానే ఉంది. ‘‘2017లో డిమాండ్ ప్రధానంగా ఆభరణాల వల్లే పెరిగింది. నూతన పన్ను చట్టం జీఎస్టీ స్థిరపడటం, స్టాక్ మార్కెట్ల ర్యాలీ, జీడీపీ వృద్ధి ఇవన్నీ కలసి వినియోగదారుల సెంటిమెంట్‌ను మెరుగు పరిచాయి’’అని డబ్ల్యూజీసీ ఎండీ (భారత విభాగం) సోమసుందరం పీఆర్ తెలిపారు.
ఆభరణాల కొనుగోళ్లకు యాంటీమనీ లాండరింగ్ చట్టాన్ని తొలగించడం కూడా డిమాండ్ పెరగడానికి దోహదపడినట్టు చెప్పారు. 2016లో ఆభరణాల డిమాండ్ 504.5 టన్నులుగా ఉండగా, 2017లో ఇది 12 శాతం పెరిగి 562.7 టన్నులకు చేరింది. విలువ పరంగా చూస్తే గతేడాది ఆభరణాల డిమాండ్ 9 శాతం వృద్ధితో రూ.1,48,100 కోట్లకు చేరింది. పెట్టుబడుల డిమాండ్ మాత్రం 2016లో 161.6 టన్నులు కాగా, 2017లో ఇది 164.2 టన్నులుగా నమోదైంది.
రానున్న రెండేళ్ల కాలంలో కాయిన్ల వృద్ధి అధికంగా ఉంటుందని సోమసుందరం పేర్కొన్నారు. 2018లో డిమాండ్ విషయంలో తాము ఆశాభావంతో ఉన్నామని, 700–800 టన్నుల మధ్య ఉండొచ్చన్నారు. ఇక దిగుమతుల పరంగా చూస్తే 2017లో 888 టన్నుల బంగారం దిగుమతి అయింది. 2016లో ఉన్న 558 టన్నుల కంటే ఇది 59 శాతం అధికం.
అంతర్జాతీయంగా ప్రతికూలత
అంతర్జాతీయంగా చూస్తే 2017లో బంగారం వినియోగం గతేడాది 7 శాతం క్షీణతతో 4,071.7 టన్నులకు పరిమితమైంది. ఈటీఎఫ్‌ల్లోకి తక్కువ పెట్టుబడులు రావడమే కారణంగా డబ్ల్యూజీసీ తన నివేదికలో పేర్కొంది. 2016లో డిమాండ్ 4,362 టన్నులుగా ఉండటం గమనార్హం. పూర్తి సంవత్సరాన్ని గమనిస్తే ఏడాది అంతటా ఈటీఎఫ్‌లలోకి పెట్టుబడులు వచ్చినప్పటికీ 2016లో వచ్చిన నిధులతో పోలిస్తే మూడింట ఒక వంతుగానే ఉన్నాయని డబ్ల్యూజీసీ తెలిపింది. బంగారం కాయిన్లు, బార్‌ల డిమాండ్ సైతం 2% తగ్గింది.
Comments
Please login to add a commentAdd a comment