సాక్షి, న్యూఢిల్లీ: టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం మూడు నెలల కనిష్ట స్థాయికి దిగి వచ్చింది. నవంబరు నెలలో 4.64 శాతంగా నమోదయ్యింది. అక్టోబర్ లో ఇది 5.28గా ఉంది. ఈ ఏడాది ఆగస్ట్ నుంచి చూస్తే ఇదే కనిష్ట స్థాయి. ఆగస్ట్‌లో డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం 4.62 శాతంగా ఉంది. ఆహార ఉత్పత్తులు, ముఖ్యంగా కూరగాయల ధరలు దిగి రావడంతో టోకు ధరలుకూడా శాంతించాయి.
వాణిజ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం చక్కెర, పొగాకు, రసాయన ఉత్పత్తులు, సిమెంట్, టెక్స్‌టైల్స్ వంటి మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్టుల ద్రవ్యోల్బణం నవంబర్‌లో 4.21 శాతానికి దిగి వచ్చింది. అక్టోబర్‌లో ఇది 4.49 శాతంగా ఉంది. మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్టులకు డబ్ల్యూపీఐ ఇండెక్స్‌లో 64.2 శాతం వెయిటేజీ ఉంది. డబ్ల్యూపీఐ ఇండెక్స్‌లో ప్రధానమైన విద్యుత్ విభాగ ద్రవ్యోల్బణం 18.44 శాతం నుంచి 16.28 శాతానికి తగ్గింది. ఇక ఆహార ఉత్పత్తుల విభాగంలో (డబ్ల్యూపీఐ ఇండెక్స్‌లో 15.3 శాతం వెయిటేజీ) ధరలు సాధారణ స్థాయి కన్నా దిగువున ఉన్నాయి.
కాగా అక్టోబర్‌లో డబ్యూపీఐ ద్రవ్యోల్బణం 5.28 శాతం వద్ద నాలుగు నెలల గరిష్ట స్థాయిని నమోదయ్యింది. గతేడాది అక్టోబర్ నెలలో టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం 3.6, నవంబరులో 4.02 శాతంగాను ఉంది.
Comments
Please login to add a commentAdd a comment