విదేశీ బ్రాండ్లకు దేశీ బాండ్..!
ఫ్రాంచైజీలో ఔట్‌లెట్లు తెరుస్తున్న ఎల్లో టై హాస్పిటాలిటీ
⇒ ప్రస్తుతం 6 బ్రాండ్లు; ఒక్కోదానికి రూ.6–8 కోట్ల ఖర్చు
⇒ రూ.9 కోట్ల టర్నోవర్; రూ.30 కోట్ల నిధుల సమీకరణపై దృష్టి
⇒ ‘స్టార్టప్ డైరీ’తో సంస్థ ఫౌండర్ అండ్ సీఈఓ కరన్ టన్నా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో:
ట్విస్ట్ ఆఫ్ థడ్కా, వ్రాప్‌చిక్, ధడూం, బీబీ జాన్, బ్రోస్టర్.. ఇవేవో బాలీవుడ్ సినిమా పేర్లు అనుకునేరు. ఇవన్నీ పాపులర్ ఫుడ్ బ్రాండ్లు. వెరైటీ రుచులతో దేశీయ భోజనప్రియుల్ని వహ్వా అనిపిస్తున్నాయి. మన దేశంలో ఈ బ్రాండ్లకు అంబాసిడర్‌గా మారి... ఫ్రాంచైజీ విధానంలో స్టోర్లను ఏర్పాటు చేస్తోంది ‘ఎల్లో టై హాస్పిటాలిటీ’. విదేశీ బ్రాండ్లు, వాటి రుచులు, సంస్థ విస్తరణ ప్రణాళికల గురించి సంస్థ ఫౌండర్ అండ్ సీఈఓ కరన్ టన్నా ‘స్టార్టప్ డైరీ’కి వివరించారు.
గుజరాత్‌లోని సర్దార్ పటేల్ యూనివర్సీటీలో ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చేశాక.. జనరల్ మోటార్స్, మెకెన్సీ కంపెనీల్లో పనిచేశా. 2012లో అహ్మదాబాద్ కేంద్రంగా ఆటోమొబైల్ సర్వీస్ అండ్ రిపెయిర్ చెయిన్ ‘కార్‌ప్లస్’ను ఆరంభించా. కానీ, తల్లిదండ్రులకు రెస్టారెంట్ ఉండటం వల్ల కావొచ్చు... ఆ రంగంలోనే ఏదో సాధించాని అనిపించేది. అహ్మదాబాద్‌లో పార్సీ రెస్టారెంట్ గుడీస్‌ను ప్రారంభించా. తర్వాత బేకరీ స్టార్టప్ ఫ్లోర్‌బాక్స్‌ను ఓపెన్ చేశా.
అక్కడి నుంచి విపుల్ పటేల్‌కు చెందిన ఫాస్ట్‌ఫుడ్ చెయిన్ కచ్చీకింగ్ రెస్టారెంట్‌లో పార్టనర్‌గా జాయినయ్యా. నేను చేరిన కొత్తలో 18 ఔట్‌లెట్లుగా ఉన్న కచ్చీకింగ్‌ను రెండేళ్ల కాలంలో 200 ఔట్‌లెట్లకు విస్తరించా. అయినా సంతృప్తిగా లేదు. ఎందుకంటే పైన చెప్పిన సంస్థలన్నింట్లోనూ స్వదేశీ రుచులే ఉంటాయి. విదేశీ ఫుడ్ బ్రాండ్స్ రుచులు చూద్దామంటే దేశంలో ఒక్క ఔట్‌లెట్ కూడా లేదే అనిపించేది. అదే యెల్లో టై హాస్పిటాలిటీకి బీజం వేసింది. ఓ ప్రైవేట్ ఇన్వెస్టర్‌తో కలసి రూ.16 కోట్లతో ముంబై కేంద్రంగా 2015 డిసెంబర్‌లో యెల్లో టై హాస్పిటాలిటీని ప్రారంభించా.
ఫ్రాంచైజీకి రూ.60–70 లక్షలు..
ఆయా బ్రాండ్ స్టోర్‌ను ఫ్రాంచైజీ విధానంలో స్థానికంగా ప్రారంభించడమే మా వ్యాపార విధానం. ఒక్కో ఔట్‌లెట్‌కు రూ.60–70 లక్షల పెట్టుబడి కావాలి. ఔట్‌లెట్ ఏర్పాటుకు కనీసం 1,000 చ.అ. స్థలం అవసరం. రూ.3 లక్షల నుంచి రూ.3 కోట్ల వరకు ఫ్రాంచైజీ బ్రాండ్లున్నాయి. తొలి ఏడాది ఫీజుతో పాటు నెలవారీ ఆదాయంలో వాటా ఇవ్వాల్సి ఉంటుంది. అది బ్రాండ్‌ను బట్టి 6–10 శాతం వరకూ ఉంటుంది. బ్రాండ్ల వారీగా చూస్తే.. బ్రోస్టర్ 6 శాతం, ధడూమ్ 8 శాతం, ట్విస్ట్ ఆఫ్ థడ్కా, బీబీ జాన్ 10 శాతంగా ఉన్నాయి. మార్చితో ముగియనున్న ఆర్ధిక సంవత్సరం నాటికి రూ.9 కోట్ల టర్నోవర్‌ను చేరుకుంటాం.
వాహనాల్లో వంటల సరఫరా..: వంటకాల తయారీ, సరఫరా కోసం చంఢీఘడ్, హైదరాబాద్, ముంబై, రాజ్‌కోట్, ఢిల్లీలో వెండర్స్ ఉన్నారు. ఇక్కడి నుంచే దేశవ్యాప్తంగా ఉన్న ఔట్‌లెట్లకు ఫ్రోజెన్ వెహికిల్స్‌లో వంటకాలను సరఫరా చేస్తాం. ఎందుకంటే ఫుడ్ క్వాలిటీ, రుచిలో తేడాలుండకూడదు. మా సంస్థకు కన్సల్టెంట్‌గా షెఫ్ హర్పాల్ ఉన్నారు. తనయ్ గోరేగావ్‌కర్ మెయిన్ షెఫ్‌గా ఉండగా... 8 మంది ఇతర షెఫ్‌లున్నారు. ఫ్రాంచైజీ ఔట్‌లెట్‌ను ఏర్పాటు చేయడం నుంచి ఇంటీరియర్, బ్రాండ్ గుర్తింపు, మెనూ ఎంపిక, వంటకాల తయారీ, సరఫరా, మార్కెటింగ్ వరకు అన్ని సేవలూ అందిస్తాం.
హైదరాబాద్‌లో బ్రోస్టర్ ఔట్‌లెట్..
అమెరికాకు చెందిన జెన్యూన్ బ్రోస్టర్ చికెన్ (జీబీసీ), లండన్‌కు చెందిన వ్రాప్‌చిక్, దుబాయ్‌కు చెందిన జస్ట్ ఫలాఫెల్. మన దేశం నుంచి చెఫ్ హర్పాల్ సింగ్‌కు చెందిన ట్విస్ట్ ఆఫ్ థడ్కా, బీబీ జాన్, మా సొంత బ్రాండ్ ధడూంలున్నాయి. వీటిల్లో ప్రస్తుతం బ్రోస్టర్ ఔట్‌లెట్ ముంబై, కోల్‌కతా, రాయ్‌పూర్, సూరత్, పట్నా, హైదరాబాద్‌లో, ట్విస్ట్ ఆఫ్ థడ్కా (వెజ్ బ్రాండ్) బెంగళూరు, అమృత్‌సర్, బీబీ జాన్ జలంధర్‌లో ఉన్నాయి. ఏప్రిల్‌లో ధడూం, ఫలాఫెల్ బ్రాండ్లను ముంబైలో, వ్రాప్‌చిప్‌ను బెంగళూరులో ప్రారంభించనున్నాం.
రూ.30 కోట్ల నిధుల సమీకరణ..
ప్రస్తుతం మాకు విదేశీ బ్రాండ్లు 3, మన దేశం నుంచి 3 బ్రాండ్లతో ఒప్పందాలున్నాయి. ఒక్కో బ్రాండ్‌తో జీవితకాల ఒప్పందం కోసం రూ.6–8 కోట్లు ఖర్చవుతుంది. వచ్చే నెల మొదటి వారంలోగా రూ.2.72 కోట్లతో అమెరికాకు చెందిన ప్రీమియం క్లబ్ బ్రాండ్‌తో ఒప్పందం చేసుకోనున్నాం. మొత్తం మీద ఈ ఏడాది ముగింపు నాటికి 10 బ్రాండ్లతో ఒప్పందం చేసుకోవాలనేది లక్ష్యం. అలాగే 2017 ముగింపు నాటికి అన్ని బ్రాండ్లు కలిపి 50కి, మన బ్రాండ్లు కనీసం 5 ఔట్‌లెట్లు విదేశాల్లో తెరవాలని లక్ష్యించాం. అందుకే తొలిసారిగా నిధుల సమీకరణ చేయాలని నిర్ణయించాం. ఈ ఏడాది ముగింపు నాటికి ఈక్విటీ రూపంలో రూ.30 కోట్ల నిధులను సమీకరిస్తాం.
అద్భుతమైన స్టార్టప్‌ల గురించి అందరికీ తెలియజేయాలనుకుంటే startups@sakshi.com కు మెయిల్ చేయండి...