హైదరాబాద్‌లో జెడ్‌ఎఫ్ టెక్నాలజీస్ సెంటర్
హైదరాబాద్, సాక్షి: ఆటోమోటివ్ టెక్నాలజీ దిగ్గజం జెడ్‌ఎఫ్ టెక్నాలజీస్... భారత్‌లో తన తొలి డెవలప్‌మెంట్ సెంటర్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించింది. ఈ సందర్భంగా ఇక్కడి హోటల్లో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రాన్ని వ్యాపార పెట్టుబడులకు అనుకూల రాష్ట్రంగా మార్చేందుకు కృషి చే స్తున్నామని చెప్పారు. డిజిటల్ రంగం దినదినాభివృద్ధి చెందనుందని, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని తెలియజేశారు. జడ్‌ఎఫ్ పెడుతున్న ఈ పెట్టుబడిని హైదరాబాద్‌లో ఎకో సిస్టమ్ బిల్డర్‌గా చూస్తున్నామన్నారు.
భారతదేశంలో తమ తొలి సెంటర్‌కు తెలంగాణను జడ్‌ఎఫ్ ఎంచుకోవడం సంతోషంగా ఉందన్నారు. అంతర్జాతీయంగా పలు కంపెనీలకు హైదరాబాద్ అత్యంత ప్రాధాన్యత కలిగిన కేంద్రంగా నిలుస్తోందని చెప్పారు. అక్షయ పాత్ర పౌండేషన్లో జెడ్‌ఎఫ్ సంస్థ భాగస్వామి అవుతున్నందుకు సంతోషం వ్యక్తంచేశారు. చిన్నారులకు మధ్యాహ్నం భోజనం అందించే ప్రపంచంలోనే అతిపెద్ద లాభాపేక్షలేని స్వచ్ఛంద సంస్థ అక్షయపాత్ర అని కొనియాడారు. కార్యక్రమంలో జెడ్‌ఎఫ్ సీఈవో డాక్టర్ స్టీఫా సొమ్మర్, ఇండియా టెక్నాలజీ సెంటర్ ఎగ్జిక్యూటీవ్ లీడ్, డిజిటల్ ఆఫీసర్ మమతా చామర్తి తదితరులు పాల్గొన్నారు.