జోమాటో ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ (ఫైల్ ఫోటో)
ముంబై : భారత్‌లో అతిపెద్ద ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జోమాటోకి ఎదురు దెబ్బ తగిలింది. సీనియర్ మేనేజ్‌మెంట్‌లో మరో అధికారి ఆ కంపెనీ నుంచి వైదొలిగారు. చీఫ్ బిజినెస్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న ముకుంద్ కులశేఖరన్, బాధ్యతలు చేపట్టిన ఐదు నెలల వ్యవధిలోనే సంస్థ నుంచి వైదొలిగినట్టు సంబంధిత వ్యక్తులు చెప్పారు. కులశేఖరన్ అర్బన్‌క్లాప్ అనే సంస్థలో చేరబోతున్నారని తెలిపారు. అయితే అర్బన్‌క్లాప్ ఆఫర్‌ను కులశేఖరన్ అధికారికంగా ఆమోదించాల్సి ఉందని, ఇంకా ఆయన అర్బన్‌క్లాప్ సంస్థకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదని సంబంధిత వ్యక్తులు చెప్పారు. డిసెంబర్‌లోనే కులశేఖరన్ తొలిసారి రాజీనామా చేశారు. అయితే ఆయన చీఫ్ బిజినెస్ ఆఫీసర్‌గా ప్రమోట్ చేయడంతో, జోమాటోలోనే ఉండిపోయారు. స్విగ్గీని ఓవర్‌టేక్ చేయడానికి ఎక్కువగా కృషిచేశారు. కులశేఖరన్ కాక, గత మూడు నెలల్లో మరో 10 మంది మధ్య, సీనియర్ స్థాయి ఎగ్జిక్యూటివ్‌లు జోమాటోకు రాజీనామా చేశారు. వారిలో భారత్‌కు చెందిన గ్లోబల్ గ్రోత్ టీమ్ సభ్యులు, ఆస్ట్రేలియా, యునిటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని రీజనల్ ఆపరేషన్స్ టీమ్స్ సభ్యులు ఉన్నారు.
కులశేఖరన్ రాజీనామాను, కంపెనీ నుంచి వైదొలిగిన మిగిలిన సభ్యుల రాజీనామాలను జోమాటో ధృవీకరించింది. గత కొన్ని నెలల కాలంలో ముకుంద్ కులశేఖరన్, మిగతా ఉద్యోగులు జోమాటో నుంచి వెళ్లిపోయినట్టు కంపెనీ వీపీ-పబ్లిక్ రిలేషన్స్ నైనా సాహ్ని చెప్పారు. వీరందరూ జోమాటోలో ఐదేళ్లకు పైగా పనిచేశారని, ఇక్కడ వారు సాధించిన విజయాలకు ఎంతో గర్విస్తున్నామన్నారు. ఎంతో క్లిష్టతరమైన పరిస్థితుల్లో జోమాటోను అభివృద్ధి చేయడానికి ఎంతో సహకరించారన్నారు. ప్రస్తుతం వారి స్థానాలను భర్తీ చేస్తూ మంచి బలమైన నాయకత్వ టీమ్‌ను నియమించామని పేర్కొన్నారు. ముఖ్యంగా ముకుంద్ కులశేఖరన్, జోమాటోను ఫుడ్ ఆర్డరింగ్ బిజినెస్ నుంచి మార్కెట్‌లో ఆధిపత్య స్థానానికి తీసుకొచ్చారని సాహ్ని అన్నారు. ఆయన తమకు ఓ స్నేహితుడిగా, మెంటర్‌గా ఉంటారని ఆశిస్తున్నామని చెప్పారు. అయితే కులశేఖరన్ కానీ, అర్బన్‌క్లాప్ కానీ ఈ విషయాలపై స్పందించడం లేదు. మరోవైపు కులశేఖరన్ స్థానంలో(సీబీఓగా) మరొకర్ని నియమించడం లేదని జోమాటో స్పష్టంచేసింది. ప్రస్తుతం జోమాటో గ్లోబల్ అధినేతగా మోహిత్ కుమార్ ఉన్నారు. అంతకముందు ఆయన రన్నర్ అనే హైపర్-లోకల్ లాజిస్టిక్స్ సంస్థలో పనిచేసేవారు. గతేడాదే మోహిత్‌ను జోమాటో నియమించుకుంది.
Comments
Please login to add a commentAdd a comment