senior management
-
జోమాటోకి ఎదురుదెబ్బ
ముంబై : భారత్‌లో అతిపెద్ద ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జోమాటోకి ఎదురు దెబ్బ తగిలింది. సీనియర్ మేనేజ్మెంట్లో మరో అధికారి ఆ కంపెనీ నుంచి వైదొలిగారు. చీఫ్ బిజినెస్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న ముకుంద్ కులశేఖరన్, బాధ్యతలు చేపట్టిన ఐదు నెలల వ్యవధిలోనే సంస్థ నుంచి వైదొలిగినట్టు సంబంధిత వ్యక్తులు చెప్పారు. కులశేఖరన్ అర్బన్‌క్లాప్ అనే సంస్థలో చేరబోతున్నారని తెలిపారు. అయితే అర్బన్‌క్లాప్ ఆఫర్‌ను కులశేఖరన్ అధికారికంగా ఆమోదించాల్సి ఉందని, ఇంకా ఆయన అర్బన్‌క్లాప్ సంస్థకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదని సంబంధిత వ్యక్తులు చెప్పారు. డిసెంబర్లోనే కులశేఖరన్ తొలిసారి రాజీనామా చేశారు. అయితే ఆయన చీఫ్ బిజినెస్ ఆఫీసర్‌గా ప్రమోట్ చేయడంతో, జోమాటోలోనే ఉండిపోయారు. స్విగ్గీని ఓవర్టేక్ చేయడానికి ఎక్కువగా కృషిచేశారు. కులశేఖరన్ కాక, గత మూడు నెలల్లో మరో 10 మంది మధ్య, సీనియర్ స్థాయి ఎగ్జిక్యూటివ్‌లు జోమాటోకు రాజీనామా చేశారు. వారిలో భారత్‌కు చెందిన గ్లోబల్ గ్రోత్ టీమ్ సభ్యులు, ఆస్ట్రేలియా, యునిటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని రీజనల్ ఆపరేషన్స్ టీమ్స్ సభ్యులు ఉన్నారు. కులశేఖరన్ రాజీనామాను, కంపెనీ నుంచి వైదొలిగిన మిగిలిన సభ్యుల రాజీనామాలను జోమాటో ధృవీకరించింది. గత కొన్ని నెలల కాలంలో ముకుంద్ కులశేఖరన్, మిగతా ఉద్యోగులు జోమాటో నుంచి వెళ్లిపోయినట్టు కంపెనీ వీపీ-పబ్లిక్ రిలేషన్స్ నైనా సాహ్ని చెప్పారు. వీరందరూ జోమాటోలో ఐదేళ్లకు పైగా పనిచేశారని, ఇక్కడ వారు సాధించిన విజయాలకు ఎంతో గర్విస్తున్నామన్నారు. ఎంతో క్లిష్టతరమైన పరిస్థితుల్లో జోమాటోను అభివృద్ధి చేయడానికి ఎంతో సహకరించారన్నారు. ప్రస్తుతం వారి స్థానాలను భర్తీ చేస్తూ మంచి బలమైన నాయకత్వ టీమ్‌ను నియమించామని పేర్కొన్నారు. ముఖ్యంగా ముకుంద్ కులశేఖరన్, జోమాటోను ఫుడ్ ఆర్డరింగ్ బిజినెస్ నుంచి మార్కెట్లో ఆధిపత్య స్థానానికి తీసుకొచ్చారని సాహ్ని అన్నారు. ఆయన తమకు ఓ స్నేహితుడిగా, మెంటర్‌గా ఉంటారని ఆశిస్తున్నామని చెప్పారు. అయితే కులశేఖరన్ కానీ, అర్బన్‌క్లాప్ కానీ ఈ విషయాలపై స్పందించడం లేదు. మరోవైపు కులశేఖరన్ స్థానంలో(సీబీఓగా) మరొకర్ని నియమించడం లేదని జోమాటో స్పష్టంచేసింది. ప్రస్తుతం జోమాటో గ్లోబల్ అధినేతగా మోహిత్ కుమార్ ఉన్నారు. అంతకముందు ఆయన రన్నర్ అనే హైపర్-లోకల్ లాజిస్టిక్స్ సంస్థలో పనిచేసేవారు. గతేడాదే మోహిత్‌ను జోమాటో నియమించుకుంది. -
కాగ్నిజెంట్ ఉద్యోగులకు క్యాష్ ఆఫర్
చెన్నై : అంతర్జాతీయ టెక్నాలజీ దిగ్గజం కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ సీనియర్ మేనేజ్మెంట్ ఉద్యోగులకు ఓ వినూత్నకర విధానాన్ని తీసుకొచ్చింది. ఎక్కువ పనితీరు కనబర్చే ఉద్యోగులకు స్టాక్స్ ఆఫన్స్ బదులు నగదును ఇవ్వనున్నట్టు తెలిపింది. దీనికి సంబంధించి సీనియర్ మేనేజర్లకు, అసోసియేట్ డైరెక్టర్లకు సమాచారం అందించింది. ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్ల బదులు ఉద్యోగులు నగదు తీసుకోవాలని కంపెనీ ఆదేశించింది. ఈ ఏడాది మొదట్లోనే ఈ కంపెనీ 3.4 బిలియన్ డాలర్లను వచ్చే రెండేళ్లలో తమ షేర్ హోల్డర్స్‌కు షేర్లు తిరిగి కొనుగోలు, డివిడెండ్ల రూపంలో అందించనున్నట్టు తెలిపింది. 2017 తొలి క్వార్టర్‌లోనే 1.5 బిలియన్ డాలర్లతో షేరును తిరిగి కొనుగోలు చేసే ప్రొగ్రామ్‌ను ప్రారంభించేసింది. ప్రతి క్వార్టర్లోనూ ఒక్కో షేరుకు 0.15 డాలర్ల డివిడెండ్‌ను ఇస్తోంది. ''ఇది ఒక ఆసక్తికరమైన అభివృద్ధి. ఈక్విటీ మంజూరు, స్టాక్ ఆప్షన్స్ అత్యుత్తమ ఈక్విటీని విలీనం చేస్తాయి. వీటిని నగదుకు మార్చడం ద్వారా వీరు స్టాక్ బైబ్యాక్ సంస్కరణను సాధించగలిగారు" అని ఎవరెస్ట్ గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ పీటర్ బెండోర్ శామ్యూల్ తెలిపారు. బైబ్యాక్‌ను ప్రకటించే ముందే కంపెనీ పలువురు సీనియర్ ఉద్యోగులకు వాలంటరీ సెపరేషన్ స్కీమ్‌ను ఆఫర్ చేసింది. అంతేకాక బోర్డులో మార్పులు, ఫైనాన్సియల్ కమిటీ ఏర్పాటు వంటి వాటిని చేపట్టింది. -
ముదురుతున్న ఇన్పీ శాలరీ రగడ
ముంబై:దేశీయ అతిపెద్ద ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ లో సంక్షోభం మరింత ముదురుతోంది. ముఖ్యంగా మేనేజ్మెంట్ కు వ్యవస్థాపకుల మధ్య నెలకొన్న బోర్డు వివాదం తీవ్ర రూపం దాల్చుతోంది. ముఖ్యంగా కంపెనీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ యూబీ ప్రవీణ్ రావు భారీ వేతన పెంపుపై రగడ మరోసారి రాజుకుంది. ఈ వ్యవహారంపై ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు నారాయణమూర్తి బహిరంగ వ్యాఖ్యలు ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. కంపెనీలో కింది స్థాయి ఉద్యోగుల జీతాలు 8 శాతం , ఉన్నత స్థాయి ఉద్యోగుల జీతాలను 60 శాతం పెంచుకోవడం సరికాదంటూ ఆయన లేఖను విడుదల చేశారు. దీంతో వివాదం ముదురు పాకానపడుతోంది. ఫౌండర్ నారాయణ మూర్తి వాదనను బలపరుస్తూ ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్‌వో వీ బాలకృష్ణన్ (బాల) బోర్డు చైర్మన్ రాజీనామా చేయాలని మరోసారి డిమాండ్ చేశారు. బోర్డును పునరుద్ధరించాలని కోరారు. ఈ పరిష్కరించేందుకు బోర్డు ముందడుగు వేయాలన్నారు. అటు ఇన్ఫోసిస్ మాజీ ఉన్నతాదికారి మోహన్ దాస్ పాయి కూడా నారాయణమూర్తిగా మద్దతుగా స్పందించారు. నారాయణ మూర్తి చాలా ముఖ్యమైన అంశాన్ని లేవనెత్తారనీ దీనిపై చర్చ జరగాలని చెప్పారు. ప్రవీణ్ రావు జీతం అద్భుతంగా ఉంది తప్ప ఆయన పెర్ఫామెన్స్ కాదంటూ ఎద్దేవా చేశారు. ఇన్ఫీ అమెరికా కంపెనీకాదని, అమెరికా లేదా జపాన్ కంపెనీలతో పోల్చడం సరికాదని, ఒక భారతీయ కంపెనీలో ఇలాంటి వ్యత్యాసాలు ఉండకూడదని వ్యాఖ్యానించారు. లిస్టెడ్ కంపెనీ బోర్డులు పారదర్శకత పాటించాలని కోరారు. కాగా గత ఏడాదికాలంగా విలువలు, పారదర్శకత, కార్పొరేట్ పాలన(గవర్నెన్స్)పై ఇన్ఫోసిస్‌లో ఆందోళనలు చెలరేగినప్పటికీ ఈ ఏడాది ఫిబ్రవరి 8,9 తేదీల్లో ఇవి మరింత వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. మరోవైపు సీఓఓ వేతన పెంపుపై తన వైఖరిని ఇన్ఫోసిస్ సమర్ధించుకుంది. ప్రమాణాల ఆధారంగానే ప్యాకేజీ చెల్లించినట్టు పేర్కొంది. ప్రమోటర్లు వ్యక్తం చేసిన అభిప్రాయాలను జాగ్రత్తగా గమనిస్తున్నట్టు తెలిపింది. ఇన్ఫీలో రగులుతున్న అంతర్గత కుమ్ములాటతో సంస్థ భవిష్యత్తుపై ఉద్యోగులు, ఇన్వెస్టర్లలో భయాలు మొదలయ్యాయి. దీంతో ఇంట్రా డేలో భారీగా నష్టపోయింది.