ముదురుతున్న ఇన్పీ శాలరీ రగడ
ముంబై:దేశీయ అతిపెద్ద ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ లో సంక్షోభం మరింత ముదురుతోంది. ముఖ్యంగా మేనేజ్‌మెంట్ కు వ్యవస్థాపకుల మధ్య నెలకొన్న బోర్డు వివాదం తీవ్ర రూపం దాల్చుతోంది. ముఖ్యంగా కంపెనీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ యూబీ ప్రవీణ్ రావు భారీ వేతన పెంపుపై రగడ మరోసారి రాజుకుంది. ఈ వ్యవహారంపై ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు నారాయణమూర్తి బహిరంగ వ్యాఖ్యలు ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. కంపెనీలో కింది స్థాయి ఉద్యోగుల జీతాలు 8 శాతం , ఉన్నత స్థాయి ఉద్యోగుల జీతాలను 60 శాతం పెంచుకోవడం సరికాదంటూ ఆయన లేఖను విడుదల చేశారు. దీంతో వివాదం ముదురు పాకానపడుతోంది.
ఫౌండర్ నారాయణ మూర్తి వాదనను బలపరుస్తూ ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్‌వో వీ బాలకృష్ణన్ (బాల) బోర్డు చైర‍్మన్ రాజీనామా చేయాలని మరోసారి డిమాండ్ చేశారు. బోర్డును పునరుద్ధరించాలని కోరారు. ఈ పరిష్కరించేందుకు బోర్డు ముందడుగు వేయాలన్నారు. అటు ఇన్ఫోసిస్ మాజీ ఉన్నతాదికారి మోహన్ దాస్ పాయి కూడా నారాయణమూర్తిగా మద‍్దతుగా స్పందించారు. నారాయణ మూర్తి చాలా ముఖ్యమైన అంశాన్ని లేవనెత్తారనీ దీనిపై చర్చ జరగాలని చెప్పారు. ప్రవీణ్ రావు జీతం అద్భుతంగా ఉంది తప్ప ఆయన పెర్‌ఫామెన్స్ కాదంటూ ఎద్దేవా చేశారు. ఇన్ఫీ అమెరికా కంపెనీకాదని, అమెరికా లేదా జపాన్ కంపెనీలతో పోల్చడం సరికాదని, ఒక భారతీయ కంపెనీలో ఇలాంటి వ్యత్యాసాలు ఉండకూడదని వ్యాఖ్యానించారు. లిస్టెడ్ కంపెనీ బోర్డులు పారదర్శకత పాటించాలని కోరారు.
కాగా గత ఏడాదికాలంగా విలువలు, పారదర‍్శకత, కార్పొరేట్ పాలన(గవర్నెన్స్)పై ఇన్ఫోసిస్లో ఆందోళనలు చెలరేగినప్పటికీ ఈ ఏడాది ఫిబ్రవరి 8,9 తేదీల్లో ఇవి మరింత వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. మరోవైపు సీఓఓ వేతన పెంపుపై తన వైఖరిని ఇన్ఫోసిస్ సమర్ధించుకుంది. ప్రమాణాల ఆధారంగానే ప్యాకేజీ చెల్లించినట్టు పేర్కొంది. ప్రమోటర్లు వ్యక్తం చేసిన అభిప్రాయాలను జాగ్రత్తగా గమనిస్తున్నట్టు తెలిపింది. ఇన్ఫీలో రగులుతున్న అంతర్గత కుమ్ములాటతో సంస్థ భవిష్యత్తుపై ఉద్యోగులు, ఇన్వెస్టర్లలో భయాలు మొదలయ్యాయి. దీంతో ఇంట్రా డేలో భారీగా నష్టపోయింది.