సాక్షి, హైదరాబాద్: గోదావరి జలాల సద్వినియోగం లక్ష్యంగా చేపట్టిన సీతారామ ఎత్తిపోతల పంప్‌హౌస్‌లో ఏర్పాటు చేయాల్సిన పంపులు, మోటార్ల రాకకు ఎట్టకేలకు మోక్షం లభించింది. చైనా నుంచి రావాల్సిన ఈ మోటార్లు, పంపులు ప్రస్తుత కరోనా సడలింపుల నేపథ్యంలో అక్కడి నుంచి కదిలాయి. వీటి షిప్పింగ్ ఇప్పటికే మొదలవగా, ఆగస్టు నాటికి అవి రాష్ట్రానికి చేరుతాయని ప్రాజెక్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. మార్చి నాటికి వీటి ఏర్పాటును పూర్తి చేయనున్నారు.
ఇప్పటికే 9 నెలలు ఆలస్యం...
సీతారామ ఎత్తిపోతలను ఈ వర్షాకాలానికి ముందే సిద్ధం చేసేలా ప్రభుత్వం ముందునుంచీ ప్రణాళికలు రచించింది. అయితే పనులు వేగిరం అయిన సమయంలోనే మార్చి నుంచి కరోనా ప్రభావం పడటం, చైనా నుంచి రావాల్సిన మిషినరీ రాకపోవడంతో పెను ప్రభావం చూపింది. ప్రాజెక్టు మూడో పంప్‌హౌస్‌లో ఏర్పాటు చేయదలిచిన 30 మెగావాట్ల మూడు పంపులు, మోటార్లు, 40 మెగావాట్ల సామర్థ్యం ఉన్న మరో ఐదు పంపులు చైనాలోని షాంఘై ఎలక్ట్రిక్ కంపెనీ నుంచి కొన్ని మరికొన్ని బీజింగ్, వూహాన్ నుంచి రావాల్సి ఉంది. ఈ పంపులు, మోటార్లు మార్చి నెలలోగానే రాష్ట్రానికి రావా ల్సి ఉన్నా ఫిబ్రవరి నెలాఖరు నుంచే షాంఘై, వూçహాన్‌లో లాక్‌డౌన్ నేపథ్యంలో పోర్టు ల ద్వారా వీటి తరలింపు నిలిచిపోయింది.
మార్చి నెలలోనే ఈ పంపుల పరిశీలనకు ఇంజనీర్ల బృందం చైనా వెళ్లాల్సి ఉన్నా, వైరస్ వ్యాప్తి దృష్ట్యా వాటిని పరీక్షించకుండానే రాష్ట్రానికి తెచ్చేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. దీంతో మూడో పంప్‌హౌస్‌లోని మోటార్లు ఒక్కటీ సిద్ధం కాలేదు. అయితే ఇటీవల చైనాలో కొంత పరిస్థితి మెరుగవడంతో ఈ మోటార్ల తరలింపు ప్రక్రియ మొదలైందని, ఆగస్టు నాటికి రాష్ట్రానికి చేరతాయని ప్రాజెక్టు ఇంజనీర్లు పేర్కొంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఈ పంప్‌హౌస్ పనులను వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేస్తామని ప్రాజెక్టు ఇంజనీర్లు స్టేట్ లెవల్ స్టాండింగ్ కమిటీకి చెప్పగా, అక్కడ ఆమోదం లభించింది. ఇక మొదటి పంప్‌హౌస్‌లో 6 మోటార్లకు మూడు సిద్ధమయ్యాయి.
మరొకటి వారం పది రోజుల్లో పూర్తి కానుండగా, మిగతావి మరో నెల పట్టే అవకాశం ఉంది. అయితే వీటికి డ్రైరన్ నిర్వహించే దానిపై ఇంకా నిర్ణయం జరగలేదు. ఇక్కడి పనులన్నీ డిసెంబర్‌నాటికి పూర్తి చేస్తామని, ప్రాజెక్టు అధికారులు ఎస్‌ఎల్‌ఎస్‌సీ నుంచి ఆమోదం తీసుకున్నారు. ఇక రెండో పంప్‌హౌస్‌లోనూ 6 మోటార్లు ఉండగా, ఇక్కడ రెండు సిద్ధమయ్యాయి. ఈ పనులు డిసెంబర్ నాటికే పూర్తికానున్నాయి.
కార్మికులు లేక నెమ్మదించిన పనులు
ఈ రెండు పంప్‌హౌస్‌ల పరిధిలో పనిచేస్తున్న జార్ఖండ్, ఒడిశా, పశ్చిమబెంగాల్, యూపీ, బిహార్ రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులు వారి సొంత రాష్ట్రాలకు వెళ్లడంతో ఫిట్టింగ్, కాంక్రీట్, వెల్డింగ్, షట్టరింగ్, ప్లంబింగ్, ఎలక్ట్రిక్ పనులన్నీ నెమ్మదించాయి. దీంతో ఆయా రాష్ట్రాల నుంచి వలసకార్మికులను ఇప్పుడు తిరిగి రప్పించేలా ఏజెన్సీలు ప్రయత్నాలు మొదలుపెట్టాయి.
Comments
Please login to add a commentAdd a comment