విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న రాచకొండ సీపీ మహేశ్ భగవత్, తదితరులు
ఉప్పల్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో భాగంగా హైదరాబాద్‌లో జరిగే మ్యాచ్‌లకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశామని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆడే అన్ని మ్యాచ్‌ల కోసం భారీ భద్రతను మోహరించామని చెప్పారు. శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ మహేశ్ భగవత్ పలు భద్రతా అంశాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో హెచ్‌సీఏ కార్యదర్శి శేష్ నారాయణ్, రాచకొండ జాయింట్ పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు, మల్కాజిగిరి డీసీపీ ఉమామహేశ్వర్ రావు పాల్గొన్నారు. ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ తలపడే 7 మ్యాచ్‌ల కోసం వివిధ విభాగాలకు చెందిన 2500 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ఇందులో 250 మంది సెక్యూరిటీ వింగ్ పోలీసులు, 329 ట్రాఫిక్ సిబ్బంది, 1038 మంది లా అండ్ ఆర్డర్ పోలీసులు, 6 ప్లాటూన్ల ఆర్మ్‌డ్ ఫోర్స్, ఆక్టోపస్, స్పెషల్ బ్రాంచ్ పోలీసులు, సీసీఎస్ స్టాఫ్ పోలీసులు ఉన్నారు.
పోలీస్ పహారాలో క్రికెట్ స్టేడియం
శనివారం నుంచే స్టేడియంను తమ ఆధీనంలోకి తీసుకోనున్నట్లు మహేశ్ భగవత్ తెలిపారు. పోలీస్ భద్రతతో పాటు 100 సీసీ కెమెరాలు, చెక్ పాయింట్లు, బాంబు స్క్వాడ్ బృందాలతో నిరంతరం పహారా కాస్తున్నట్లు తెలిపారు. అవాంఛనీ య ఘటనలు ఏర్పడితే అప్పటికప్పుడు స్పం దించేలా అత్యవసర టీంలను ఏర్పాటు చేశామన్నారు. సంఘ విద్రోహ శక్తులపై గట్టి నిఘా వేసి ఉంచామని, అనుమానితులను ఎప్పటికప్పుడు విచారించి తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు. స్టేడియంలో మహిళా రక్షణ కోసం షీ టీమ్‌లు అందుబాటులో ఉంటాయన్నారు. తినుబండారాలను అ ధిక ధరలకు విక్రయించే వ్యాపారస్తులపై చర్యలు తీసుకునేందుకు ప్రత్యేక వెండర్ సూపర్‌వైజింగ్ టీమ్‌లు ఏర్పాటు చేశామన్నారు. మ్యాచ్‌కు 3గంటల ముందు నుంచే అభిమానులను స్టేడియంలోకి అనుమతించనున్నట్లు తెలిపారు.
నిషేధిత వస్తువులు...
ఎలక్ట్రానిక్ పరికరాలు, కెమెరాలు, అగ్గిపెట్టెలు, బైనాక్యులర్స్, బ్యాగ్‌లు, బ్యానర్లు, సిగరేట్స్, లైట ర్స్, కాయిన్స్, హెల్మెట్స్, బయటి తినుబండారా లు, వాటర్ బాటిల్స్, పెన్నులు, పర్‌ఫ్యూమ్స్, సెల్‌ఫోన్ బ్యాటరీలను మైదానంలోకి అనుమతించరు. మొబైల్ ఫోన్‌కు అనుమతి ఉందని సీపీ తెలిపారు.
ట్రాఫిక్ దారి మళ్లింపు...
సికింద్రాబాద్ నుంచి ఉప్పల్ వైపు వెళ్లే భారీ వాహనాలను మ్యాచ్ జరుగుతున్న సమయాల్లో అనుమతించరు. సికింద్రాబాద్ నుంచి ఘట్‌కేసర్ వెళ్లే భారీ వాహనాలు హబ్సిగూడ ఎన్‌ఎఫ్‌సీ బ్రిడ్జి మీదుగా చంగిచర్ల నుంచి వరంగల్ హైవేకు వెళ్లాలని సూచించారు. ఎల్‌బీనగర్ నుంచి సికింద్రాబాద్ వెళ్లాలంటే బోడుప్పల్, చంగిచర్ల మీదుగా హబ్సిగూడ చేరుకోవాల్సి ఉంటుంది.
పార్కింగ్...
1800 ఫోర్ వీలర్స్, 4400 ద్విచక్ర వాహనాలకు పార్కింగ్ అవకాశం కల్పించారు. వీఐపీలకు ప్రత్యేక పార్కింగ్ ఉంటుంది. కారు పాస్ ఉన్నవారు రామంతపూర్ దారి గుండా గేట్‌నంబర్ 1, 2లకు వెళ్లాల్సి ఉంటుంది. పాస్ లేని వారు రామంతపూర్ రోడ్డుకు ఇరువైపులా వాహనాలను పార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. దివ్యాంగులకు గేట్–3 గుండా లోపలికి వెళ్లే అవకాశాన్ని కల్పించారు.
మెట్రోరైల్, ఆర్టీసీ ప్రత్యేక ట్రిప్పులు...
ఐపీఎల్ మ్యాచ్ జరిగే రోజుల్లో ఆర్టీసీ, మెట్రో రైల్ ప్రయాణికుల కోసం అర్ధరాత్రి ఒంటిగంట వరకు తమ సేవల్ని అందించనున్నాయని మహేశ్ భగవత్ తెలిపారు. ప్రైవేట్ వాహనాలు ప్రయాణీకులను నిలువునా దోచుకుంటున్నందున ఈ ఏర్పాట్లు చేశామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment