ఎంతఘోరం! | 18 People Arrest In Gang Rape Case Tamil Nadu | Sakshi
Sakshi News home page

ఎంతఘోరం!

Published Wed, Jul 18 2018 8:24 AM | Last Updated on Mon, Jul 23 2018 8:51 PM

18 People Arrest In Gang Rape Case Tamil Nadu - Sakshi

కోర్టు ప్రాంగణంలో ఉద్రిక్తత ,అరెస్టయిన 18 మంది నిందితులు

సభ్యసమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన సంఘటన ఇది. జనారణ్యంలో సంచరిస్తున్న క్రూరమృగాలు దివ్యాం గురాలైన బాలికపై లైంగిక దాడికి పాల్పడిన దారుణమిది.

సాక్షి ప్రతినిధి, చెన్నై: 20కి పైగా వృద్ధులు, మధ్య వయస్కులు కలిసి ఏడు నెలలపాటు సామూహిక అత్యాచారానికి పాల్పడిన విషాదానికి చెన్నై నగరం వేదికైంది. 18 మంది నిందితులను కటకటాల వెనక్కునెట్టారు. మరో 6 మంది కోసం గాలిస్తున్నారు.

చెన్నై ఐనవరంలో ధనిక కుటుంబాలు నివసించే ఒక అపార్టుమెంటు ఉంది. 14 అంతస్తులు, ఐదు బ్లాకులు, 300కు పైగా ఇళ్లు కలిగిన ఈ అపార్టుమెంటులో అన్యులెవరు రాలేనంతగా భద్రతా చర్యలున్నాయి. మూడు చెక్‌పోస్టులు,  25 మందికి పైగా సెక్యూరిటీ గార్డులు, అపార్టుమెంటు చుట్టూ 50కి పైగా సీసీ కెమెరాలున్నాయి. అయితే వీటన్నింటికీ మించి అపార్టుమెంటులో ఖాళీగా ఉన్న అనేక పోర్షన్లు నిందితుల ఆగడాలకు అనుకూలంగా మారాయి. అపార్టుమెంటులో నివసించే వారికి రక్షణగా నిలవాల్సిన వారే భక్షకులుగా మారారు. వయసుకు మించిన ఎదుగుదలతో ఎంతో ఆకర్షణీయంగా ఉండే ఈ బాలికపై రవికుమార్‌ (64) అనే సెక్యూరిటీగార్డు కన్నుపడింది. ఏడోతరగతి చదువుతున్న ఆ బాలిక స్కూలు నుంచి రాగానే ఆడుకుంటూ అపార్టుమెంటులో ఒంటరిగా తిరగడాన్ని గమనించి ఆటాడుకుందాం రా అంటూ పిలుచుకుపోయి అత్యాచారం చేశాడు. ఆ తరువాత అపార్టుమెంటులో పనిచేసే ఇతర మృగాళ్లకు కూడా బాలికను ఆహారంగా వేశాడు.

దాదాపుగా అందరూ మాదకద్రవ్యాలకు బానిసలైన వారు కావడంతో బాలిక చేత కూడా బలవంతంగా తినిపించారు. మత్తు ఇంజక్షన్లు ఇచ్చి లైంగికదాడికి పాల్పడ్డారు. ఈ సమయంలో సెల్‌ఫోన్‌ ద్వారా వీడియో చిత్రీకరించి ఎవరికైనా చెబితే ఈ దృశ్యాలను బైటపెడతామని, మెడపై కత్తిపెట్టి చంపుతామని బెదిరించి అవసరమైనపుడల్లా తమ కామవాంఛ తీర్చుకునేవారు. ఒక్కోసారి టెర్రస్‌పైకి కూడా తీసుకెళ్లి అఘాయిత్యం చేసేవారు. తమ దారుణాలు బైటపడకుండా అపార్టుమెంటులోని సీసీకెమెరాలను మరోవైపు తిప్పి ఉంచేవారు. పోలీసుల తనిఖీల సమయంలో ఖాళీగా ఉన్న అపార్టుమెంటులు, టెర్రస్‌పై పెద్ద సంఖ్యలో మత్తు ఇంజక్షన్ల సిరంజిలు, కండోమ్‌లు దొరికాయి. తల్లిదండ్రులకు చెబితే ఏమి జరుగుతుందోనని భయపడుతూ ఏడునెలలుగా కాలం గడిపింది. ఉత్తరాది రాష్ట్రంలో ఉన్నత విద్యచదువుకుంటున్న బాధిత బాలిక అక్క ఇటీవల చెన్నైకి రావడంతో మూగసైగలతో తన గోడు వెళ్లబోసుకోవడంతో ఈ దారుణం బైటపడింది. అక్క ద్వారా తల్లిదండ్రులకు తెలియడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. 18 మంది నిందితుల్లో 66 ఏళ్లు మొదలుకుని 60 ఏళ్లవారు ముగ్గురు, 55 ఏళ్ల వారు ఇద్దరు, 50, 40, 33, 32, 23 ఉండడం ఘోరమైన వాస్తవం. మరో 6 మంది నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

నిందితులపై ఆగ్రహజ్వాల: చిన్నారి జీవితాన్ని చిదిమేసిన 18 మంది నిందితులను మద్రాసు హైకోర్టులో మంగళవారం ప్రవేశపెట్టినపుడు ప్రజాగ్రహం పెల్లుబుకింది. చుట్టూ పోలీసులు ఉన్నా నిందితులను చూడగానే న్యాయవాదులు, ప్రజలు కోపాన్ని అణచుకోలేకపోయారు. పోలీసులు అడ్డుకుంటున్నా వారిపై పడి కొట్టారు. కిందపడేసి కాళ్లతో తన్నారు. పిడిగుద్దులు కురిపించారు. నిందితులను తుపాకీతో కాల్చిచంపాలని నినాదాలు చేశారు. ఈ కేసులో నిందితుల తరఫున న్యాయవాదులెవ్వరూ వాదించకూడదని నిర్ణయం తీసుకున్నట్లు మద్రాసు హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు మోహన్‌కృష్ణ ప్రకటించారు.

హేయమైన చర్య
11 సంవత్సరాల బదిర బాలికపై కామాంధులు ఏడు నెలలుగా అత్యాచారం చేయడం నిజంగా చాలా హేయమైన చర్యని మద్రాసు హైకోర్టు న్యాయవాది కమలాపురం లక్ష్మీ శ్రీదేవి రెడ్డి ఖండించారు. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా ఉండాలంటే నేరస్థులను వీలైనంత వేగంగా కఠిన శిక్షపడాలి. ఇలాంటి దుర్మార్గులకు ఏ అడ్వకేటు వాదించకూడదని, ఒకవేళ బెయిల్‌ పిటిషన్‌ విచారణకు వచ్చినా బెయిల్‌ రాకుండా ఇంటర్వీనింగ్‌ పిటిషన్‌ వేస్తామని అన్నారు. భారతదేశంలో ఇలాంటి సంఘటనలు పునరావృతం కావడం చాలా సిగ్గుచేటని అన్నారు. స్త్రీని దేవతగా చూసి మన దేశంలో నిర్భయలాంటి చట్టాలు చేసిన మగవాడు పాశవికంగా ప్రవర్తించడం చాలా ఘోరమని ఆవేదన వ్యక్తం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement