సాక్షి, చెన్నై: పెరియార్ వర్సిటీ ఇన్‌చార్జ్ రిజిస్ట్రార్ గోపీని సోమవారం సాయంత్రం సేలం సూర మంగళం పోలీసులు అరెస్టు చేశారు. ఓ విద్యార్థిని లైంగికంగా వేధించడమే కాకుండా, ఆమెకు వ్యతిరేకంగా పోలీసులకు ఫిర్యాదు చేసి ఆయన అడ్డంగా బుక్కయ్యాడు. వివరాలు.. సేలం పెరియార్ వర్సిటీలో ఇన్‌చార్జ్ రిజిస్ట్రార్‌గా గోపీ పనిచేస్తున్నారు. ఆదివారం పరిశోధక ఓ విద్యార్థినిని వర్సిటీలోని తన చాంబర్‌కు రావాలని ఆయన ఆదేశించాడు. అక్కడికి వచ్చిన ఆ విద్యార్థిని కాసేపటి తర్వాత మౌనంగా బయటకు వెళ్లి పోయింది. అయితే, ఆ విద్యార్థినిపై సాయంత్రం ఆయన సూర మంగళం పోలీసు స్టేషన్‌లో ఓ ఫిర్యాదు చేశాడు.
అధిక మార్కులతో పాటుగా త్వరితగతిన డిగ్రీ దక్కే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తన బంధువుల ద్వారా ఆ విద్యార్థిని దాడి తనపై చేయించినట్టు ఆరోపించాడు. అంతే కాకుండా, రాత్రి ఓ ప్రైవేటు ఆస్పత్రిలోనూ అడ్మిట్ అయ్యాడు. సోమవారం ఉదయాన్నే పోలీసులు సంబంధిత విద్యార్థిని పిలిపించి విచారించగా రిజిస్ట్రార్ బండారం బయట పడింది. చాంబర్‌కు పిలిపించి తనపై లైంగిక దాడికి ప్రయత్నించినట్లు, తాను బయటకు చెప్పుకోలేక మౌనంగా ఉండి పోయినట్లు ఆ విద్యార్థిని ఇచ్చిన సమాచారాన్ని పోలీసులు పరిగణనలోకి తీసుకున్నారు.
ఆ విద్యార్థినితో పోలీసులే ఫిర్యాదు చేయించారు. అలాగే, గోపీతో పాటుగా ఆదివారం వర్సిటీలో విధుల్లో ఉన్న సిబ్బంది, సహచర విద్యార్థుల్ని పోలీసులు విచారించారు. గోపీ బండారం బయట పడడంతో ఆయన్ని అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టారు. కాగా, చేసిన తప్పును కప్పి పుచ్చుకునేందుకు పోలీసుల్ని ఆశ్రయించిన నాటకం ఆడిన రిజిస్ట్రార్ గోపీ.. చివరకు తాను తవ్వుకున్న గోతిలోనే పడ్డారని పలువురు వాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment