
మృతుడు బోడపాటి వీరప్రకాశ్, మృతుడు గాలింక నాగేశ్వరరావు,lమృతుడు బోడపాటి వీరప్రకాశ్
సాక్షి, శంఖవరం(తూర్పుగోదావరి) : అభంశుభం తెలియని ఇద్దరు చిన్నారులను ఆ ఊరు చెరువు పొట్టన పెట్టుకుంది. ఈ సంఘటనతో సమీప బంధువులైన రెండు కుటుంబాల్లో విషాదం అలముకుంది. తమ బంధువుతో చెరువులో మోటారు బైక్ కడిగేందుకు వెళ్లిన ఈ ఇద్దరు చిన్నారులు మృత్యువాత పడగా, మరో చిన్నారి త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడింది. నిత్యం తమ ఇళ్లలో చలాకీగా తిరిగే ఈ ఇద్దరు చిన్నారులు తిరిగి రాని లోకానికి వెళ్లిపోవడంతో ఆ బంధువుల్లో విషాదం నెలకొంది.
శంఖవరం గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ బోడపాటి వీరాస్వామి, చిలకమ్మ దంపతులకు కుమారు వీరప్రకాశ్(12), కుమార్తె కృపాజ్యోతి(10) ఉన్నారు. కుమారుడు ఆరోతరగతి చదువుతున్నాడు. బంధువైన బోడపాటి వీరాస్వామి అన్నయ్య అల్లుడైన విశాఖ జిల్లా పాయకరావుపేట మండలం గోపాలపట్నం గ్రామానికి చెందిన గాలింక అప్పారావుకు భార్య నాగరత్నం, నాగేశ్వరరావు(10), ప్రదీప్(8) అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరు రెండు నెలల క్రితం వ్యవసాయ పనుల కోసం ఇక్కడి వచ్చి నివాసం ఉంటున్నారు. వీరి సమీప బంధువైన గొల్లప్రోలు మండలం తాడిపత్రి గ్రామానికి చెందిన కొల్లు వీరబాబు(23) వీరాస్వామి కుటుంబాన్ని చూసేందుకు శంఖవరం వచ్చాడు.
శంఖవరానికి సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న మండపం గ్రామం ఊర చెరువులో మోటారు బైక్‌ను కడిగేందుకు వీరాస్వామి కుమారుడు వీరప్రకాశ్, అప్పారావు కుమారుడైన నాగేశ్వరరావు, సమీప బంధువైన బోడపాటి శ్రీను(11)లను చెరువు వద్దకు తీసుకువెళ్లాడు. చెరువు వద్ద వీరబాబు బహిర్భూమికి వెళ్లగా బైక్ కడిగేందుకు ముగ్గురూ చెరువులోకి దిగారు. చెరువు లోతును గమనించకపోవడంతో ప్రమాదవశాత్తూ వీరప్రకాశ్, నాగేశ్వరరావు చెరువులో మునిగిపోయారు. అక్కడే ఉన్న శ్రీను గట్టిగా కేకలు వేయడంతో సమీపంలో ఉన్న వీరబాబుతో పాటు పలువురు వారిని రక్షించేందుకు ప్రయత్నించినా ఫలితం దగ్గలేదు. అప్పటికే చెరువులో మునిగిపోవడంతో మృత్యువాత పడ్డారు. దారిన వెళుతున్న మత్స్యకారులు విషయం తెలుసుకున్న బంధువులు అక్కడికి చేరుకుని రోదించారు. ఉన్న ఒక్కగానొక్క కొడుకు చనిపోయాడంటూ వీరాస్వామి బోరున విలపించాడు. ఇంటికి పెద్ద కొడుకు మృత్యువాత పడడంతో అప్పారావు బోరున విలపించాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment