‘‘అమ్మా.. మా చుట్టూ నీళ్లే.. మమ్మల్ని ఎక్కడ వదిలేసినవ్.. తమ్ముడు గుక్కపట్టి ఏడుస్తున్నడు.. నాకూ ఏడుపొస్తోంది.. నువ్వు దూరంగా మాకు కనిపిస్తున్నా దగ్గరకు తీసుకోవట్లేదు ఎందుకమ్మా... నేను ఏడిస్తే ఆకలేస్తుందా అని అన్నం పెట్టేదానివి.. తమ్ముడు ఏడిస్తే పాలు పట్టేదానివి.. అలాంటిది నువ్వు మమ్మల్ని దూరంగా చూస్తూనే ఉన్నా.. ఏమైంది బిడ్డా అని కూడా అడుగట్లేదు.. నీ గుండె ఎందుకింత కఠినంగా మారిందమ్మా.. అందరూ నువ్వే మమ్మల్ని బావిలో తోసేశావ్ అంటున్నరు.. ఇన్నాళ్లూ ప్రేమను పంచిన నువ్వే ఇలా చేశావా..
మేం ఏం తప్పు చేశాం.. ఎందుకిలా చేశావ్.. నాన్నకు, నీకు మధ్య గొడవతో ఎంత పని చేశావమ్మా.. నీ క్షణికావేశం మన కుటుంబాన్ని ఎలా విడదీసిందో చూశావా.. అమ్మా.. నువ్వు ఏడవకు.. నువ్వు ఏడుస్తుంటే మాకు ఇంకా ఏడుపొస్తుంది..’’ అంటూ ఆ పసి హృదయాల ఆత్మఘోషించే ఉంటుంది.! ఇద్దరు పిల్లలను బావిలో తోసి తల్లీ ఆత్మహత్యకు యత్నించగా.. పిల్లలిద్దరూ మృత్యువాతపడిన హృదయవిదారక ఘటన ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని బాలాపూర్‌లో చోటు చేసుకుంది.
సాక్షి, ఆదిలాబాద్: కాపురంలో కలహాలు సహజం.. అయితే అవి చినికి చినికి గాలివానలా మారి అభం శుభం తెలియని ఇద్దరు చిన్నారులను బలిగొన్న ఘటన ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం బాలాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థాని కుల కథనం ప్రకారం.. బేల మండలం సాంగిడి గ్రామానికి చెందిన సుష్మతో జైనథ్ మండలం బాలాపూర్ గ్రామానికి చెందిన వాన్‌ఖెడే గణేశ్‌కు ఆరేళ్ల క్రితం వివాహమైంది. వారికి ఆదిత్య(4), ఆర్యన్(18నెలలు) సంతానం. భార్యాభర్తలిద్దరూ కూలీనాలి చేసుకుంటూ జీవనం గడుపుతున్నారు.
సాఫీగా సాగిపోతున్న వారి జీవితంలో చిన్న చిన్న కలహాలు పెను తుపాను రేపాయి. ఈ క్రమంలో కలహాలతో విసిగిపోయిన సుష్మ చనిపోవాలని నిర్ణయించుకుంది. బుధవారం భర్త కూలీ పనికి వెళ్లిన సమయంలో గ్రామానికి కొంచెం దూరంలో ఉన్న వ్యవసాయ బావి వద్దకు పిల్లలతో కలిసి వెళ్లింది. పిల్లలిద్దరినీ ముందుగా అందులో తోసేసి అనంతరం తానూ దూకింది. అయితే నీటిలో మునిగే సమయంలో భయభ్రాంతులకు గురై కేకలు వేయడంతో పక్కనే చేలో ఉన్న రైతు తాడు సాయంతో బావిలో దూకాడు. ముగ్గురిని బయటకు తీయగా సుష్మ ప్రాణాపాయం నుంచి బయటపడగా.. చిన్నారులు కొన ఊపిరితో ఉన్నారు. వారిని వెంటనే గ్రామానికి తీసుకెళ్లే క్రమంలో చనిపోయారు.
మిన్నంటిన రోదనలు..
పాల బుగ్గల చిన్నారులు విగతజీవులుగా పడి ఉండటంతో కుటుంబీకులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. గ్రామస్తులు భారీగా తరలివచ్చి కడసారి చూపుకోసం గుమిగూడారు. తల్లే క్షణికా వేశంలో బిడ్డలను పొట్టన పెట్టుకుందని భర్త తరఫువారు ఆరోపించగా.. భర్త వేధింపులతోనే జీవితంపై విరక్తి చెంది ఇద్దరు పిల్లలతో సుష్మ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని ఆమె తల్లిదండ్రులు వాపోయారు. ఏదేమైనా భార్యాభర్తల మధ్య కలహాలు రెండు పసిప్రాణాలను బలి గొనడంతో ఆ గ్రామం శోకసంద్రంలో మునిగిపోయింది.
భార్యాభర్తలపై కేసు ..
చిన్నారులు మృతిచెందిన ఈ సంఘటనలో భార్యాభర్తలిద్దరిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే చిన్న చిన్న గొడవలతో సుష్మ అనవసరంగా పిల్లలతో కలిసి బావిలో దూకి వారి ప్రాణాలు తీసిందని, చి న్నారుల నానమ్మ నీలాబాయి ఇచ్చిన ఫిర్యా దు మేరకు పోలీసులు సుష్మపై కేసు నమోదు చేశారు. దీంతోపాటు తన అల్లుడు వాన్‌ఖెడే గణేష్ వేధింపులతోనే కూతురు సుష్మ ఆత్మహత్యాయత్నం చేసింద ని, చిన్నారుల అమ్మమ్మ జిజాబాయి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వాన్‌ఖెడే గణేశ్‌పై కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్సై పెర్సిస్ బిట్ల తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment