మూడు ప్రమాదాల్లో 20 మందికి గాయాలు | 20 people Have Been Injured In Three Accidents | Sakshi
Sakshi News home page

మూడు ప్రమాదాల్లో 20 మందికి గాయాలు

Published Thu, May 10 2018 12:39 PM | Last Updated on Sat, Sep 1 2018 5:08 PM

20 people Have Been Injured In Three Accidents - Sakshi

గాయపడ్డ చిన్నారి

మూడు ప్రమాదాల్లో మొత్తం 20 మంది గాయపడ్డారు. ఆటోను లారీ ఢీకొనడంతో పదిమందికి, ముందు వెళుతున్న ట్రాక్టర్‌ను ఆటో ఢీకొనడంతో నలుగురికి, డీసీఎం వ్యాన్, ద్విచక్ర వాహనం ఢీకొన్న ప్రమాదంలో ఆరుగురికి గాయాలయ్యాయి.

పెనుబల్లి (ఖమ్మం): రోడ్డు పక్కన ఆగిన ఆటోను వెనుక నుంచి లారీ ఢీకొంది. ఆటోలోని పదిమంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. మండలంలోని టేకులపల్లిలో బుధవారం సాయంత్రం ఇది జరిగింది. కృష్ణా జిల్లా గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్‌ దాసరి నరసింహారావు, తన ఆటోలో భార్య శ్రీలక్ష్మితో కలిసి ఏన్కూర్‌ మండలం జన్నారం గ్రామంలో వివాహ వేడుకకు బయల్దేరాడు. టేకులపల్లిలో తమ బంధువులు కొందరిని ఎక్కించుకున్నాడు.

ఇంకొకరు రావడం ఆలస్యమవడంతో ఆటోను రోడ్డు పక్కన ఆపాడు. సత్తుపల్లి వైపు నుంచి ఖమ్మం వైపు వెళ్తున్న లారీ. రోడ్డు పక్కన ఆగిన ఆ ఆటోను వెనుక నుంచి ఢీకొంది. ఆటో బోల్తాపడింది. అందులో ఉన్న డ్రైవర్‌ నరసింహారావు, ఆయన భార్య, బొల్లెపోగు రాములు, టేకులపల్లి గ్రామాలనికి చెందిన మచ్చ విశ్వనాధం, మచ్చ సరోజిని, మచ్చ వీణాశ్రీజ, శ్రీవర్షిణి, రాఘవేంద్ర, మచ్చ వెంకటనరసమ్మ, పార్వతి, వెంకటమ్మ గాయపడ్డారు. వీరిని స్థానికులు వెంటనే పెనుబల్లి ఏరియా వైద్యశాలకు తరలించారు. ఎవ్వరికీ ప్రాణాపాయం లేదని వైద్యు చెప్పారు. కేసును ఎస్‌ఐ జి.నరేష్‌ దర్యాప్తు చేస్తున్నారు.

ట్రాక్టర్‌ను ఆటో ఢీకొని నలుగురికి... 

జూలూరుపాడు: మండలంలోని మాచినేనిపేటతండా గ్రామ సమీపంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురికి గాయాలయ్యాయి. జూలూరుపాడు మండలం మాచినేనిపేటతండాకు చెందిన బానోతు ఉమేష్‌ ఆనే ఆటోడ్రైవర్‌ తన ఆటోలో కొత్తగూడెం నుంచి  ప్రయాణికులను ఎక్కించుకొని జూలూరుపాడు వస్తున్నాడు. మాచినేనిపేటతండా హరిజనవాడకాలనీ సమీపంలోకి రాగానే. ముందు వెళుతున్న ట్రాక్టర్‌ ఒక్కసారిగా ఆగింది

. వెనకనే వస్తున్న ఆటో, ఆ ట్రాక్టర్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో జూలూరుపాడు మండలం గుండ్లరేవు గ్రామానికి చెందిన పూనెం సారమ్మ, చింతూరు మండలానికి  చెందిన మడి వెంకటేష్, చండ్రుగొండ మండలం పోకలగూడెం పంచాయతీ వెంకట్యాతండాకు చెందిన బానోతు బాలు, ఆటో డ్రైవర్‌ ఉమేష్‌ గాయపడ్డారు. పడమటనర్సాపురంలోని ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఆటోలోని ఎనిమిదిమంది ప్రయాణికులలో మిగతా వారు క్షేమంగా ఉన్నారు. ఆటో దెబ్బతిన్నది.

మరో ప్రమాదంలో ఆరుగురికి... 

అశ్వారావుపేటరూరల్‌ : డీసీఎం వ్యాన్, ద్విచక్ర వాహనం ఢీకొన్న ప్రమాదంలో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. పాల్వంచ సమీపంలోని పాతూరు నుంచి పశ్చిమ గోదావరి జిల్లా వేలేరు పాడు మండలం కొత్తూరులో జరిగే వివాహ కార్యక్రమానికి వెళ్తున్న డీసీఎం వ్యాన్, ఎదురుగా వచ్చిన ద్విచక్ర వాహనం అశ్వారావుపేట మండలంలోని తిరుమలకుంట సమీపంలోగల కోతులవాగు వద్ద ఢీకొన్నాయి.

ద్విచక్ర వాహనంపై ఉన్న వేలేరుపాడు మండలం కొర్రాజులగూడేనికి చెంది న పద్దం మల్లయ్య, పదం సుజాత, డీసీఎం వ్యాన్‌ లో ఉన్న వంకా కృష్ణవేణి, కొడిమి తిరుపతమ్మ, సరియం ముత్తయ్య, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని స్థానికులు వెంటనే వినాయకపురం పీహెచ్‌సీకి తరలించారు. డీసీఎం వ్యాన్‌లో ఉన్న వారంతా క్షేమంగా బయటపడ్డారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement