గాంధీనగర్: గుజరాత్‌లోని ఓ రసాయన ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. బుధవారం మధ్యాహ్నం దాహెజ్ పారిశ్రామిక వాడలోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో బాయిలర్ పేలుళ్లు సంభవించడంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసి పడుతున్నాయి. ఫ్యాక్టరీ మొత్తాన్ని మంటలు దహించివేస్తుండటంతో చుట్టు పక్కల ప్రాంతాల్లోనూ దట్టమైన నల్లటి పొగలు కమ్ముకున్నాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించగా, పరిశ్రమలో పనిచేసే సుమారు 40 మంది సిబ్బంది గాయాలపాలైనట్లు బరూచ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ పేర్కొన్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక దళాలు ఘటనా స్థలానికి చేరుకుని అగ్నికీలలను నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్నాయి. (కళ్ల ముందే కష్టం బూడిద)
మరోవైపు అధికారులు ముందస్తు జాగ్రత్తగా పరిసర గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ ఘటనపై బరూచ్ జిల్లా కలెక్టర్ ఎండీ మోడియా మాట్లాడుతూ.. నేడు మధ్యాహ్నం అగ్రో కెమికల్ కంపెనీలో బాయిలర్ పేలుళ్లు సంభవించాయని తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. కాగా సోషల్ మీడియాలోనూ ప్రమాదానికి సంబంధించిన వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. (భారీ అగ్ని ప్రమాదం: ఏడుగురు సజీవ దహనం)
Comments
Please login to add a commentAdd a comment