నిందితులను పోలీస్ స్టేషన్‌కు తరలిస్తున్న దృశ్యం
సాక్షి, గుంతకల్లు(అనంతపూర్) : గుంతకల్లులో బాలుడి కిడ్నాప్ కలకలం రేపింది. బాధిత కుటుంబ సభ్యులు అప్రమత్తం కావడంతో గ్రామస్తులు వెంటాడి కిడ్నాపర్లను పట్టుకున్నారు. బాధితులు లక్ష్మీదేవి, ఆమె కుమారుడు మండల ఇంజినీర్ ఓబులేసు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. ధర్మవరానికి చెందిన గంగాధర్, వెంకట తిమ్మాపురం గ్రామానికి చెందిన సుబ్బరాయుడు, డ్రైవర్ నాగార్జునరెడ్డి సోమవారం గుంతకల్లులోని కసాపురం రోడ్డు సమీపాన పిరమిడ్ ధ్యాన కేంద్రం వద్దకు స్కార్పియో కారులో వచ్చారు. సన్న (మసూరి) బియ్యం విక్రయించే నెపంతో లక్ష్మీదేవి అనే మహిళ ఇంటి వద్దకు చేరుకున్న వారి ప్రవర్తనపై అనుమానం కలగడంతో ఆమె గట్టిగా కేకలు వేసింది. అప్రమత్తమైన ముగ్గురు వ్యక్తులు సమీపంలో ఆడుకుంటున్న లక్ష్మీదేవి మనవడు ఏడేళ్ల వయసున్న వంశీని కారులోకి బలవంతంగా ఎక్కించుకుని అక్కడి నుంచి ఉడాయించారు. లక్షి్మదేవి కుటుంబ సభ్యులు కారును వెంబడించారు. దొరికిపోతామేమోనని భయపడ్డ వ్యక్తులు బాలుడిని కొంతదూరంలో దించేసి వెళ్లిపోయారు. సమీపంలో ఉన్న మండల ఇంజినీర్ ఓబులేసు వెంటనే డయల్ 100కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చి బైకులో కారును వెంబడించాడు. ఒకానొక సమయంలో కారును క్రాస్ చేసి బైకును అడ్డంగా నిలిపినప్పటికీ దుండగులు చాకచక్యంగా తప్పించుకున్నారు.
పట్టుబడిన దుండగులు
తన నుంచి దుండగులు తప్పించుకోవడంతో ఓబులేసు వెంటనే పాతకొత్తచెరువు గ్రామస్తులకు సమాచారం చేరవేశాడు. పెద్ద సంఖ్యలో రహదారి వద్దకు చేరుకున్న పాతకొత్తచెరువు గ్రామస్తులు వచ్చే ప్రతి వాహనాన్నీ నిలిపి పరిశీలించారు. స్కారి్పయోలో వస్తున్న ముగ్గురు వ్యక్తులు గ్రామస్తులు కాపు కాసిన విషయాన్ని గమనించారు. వారి నుంచి తప్పించుకోవడానికి కారును వెనక్కు తిప్పి.. పక్కనే ఉన్న మెటల్ రోడ్డులో గొందెర్ల వైపు మళ్లించారు. అలా కొంతదూరం వెళ్లాక రోడ్డు మార్గం లేకపోవడంతో కారును రోడ్డుపైనే ఆపి పొలాల్లోకి పరుగులు తీశారు. అప్పటివరకూ రోడ్డుపై కాపుకాసిన గ్రామస్తులు బైకులపై కారును వెంబడించి పొలాల్లో పరుగులు తీస్తున్న ముగ్గురు వ్యక్తుల్లో గంగాధర్, సుబ్బరాయుడులను పట్టుకుని దేహశుద్ధి చేశారు. కారు డ్రైవర్‌గా వచ్చిన నాగార్జునరెడ్డి మాత్రం పరారయ్యాడు. అర్బన్ సీఐ ఉమామహేశ్వరరెడ్డి, రూరల్ సీఐ రాము, రూరల్ ఎస్‌ఐ వలిబాషా సంఘటన స్థలానికి చేరుకుని పట్టుబడిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని గుంతకల్లు రూరల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అయితే పట్టుబడిన నిందితులు తాము కిడ్నాపర్లు కాదని అంటున్నారు. రేషన్ బియ్యాన్ని సోనా మసూరి బియ్యంగా చెప్పి విక్రయించి సొమ్ము చేసుకునేవారిమని, అయితే గుంతకల్లు వద్ద మహిళ తమపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బెంబేలెత్తి కారులో వేగంగా పరారయ్యామని చెబుతున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసను పూర్తిస్థాయిలో విచారిస్తామని పోలీసులు తెలిపారు.
డయల్ 100 సేవలు వినియోగించుకోండి
అనంతపురం సెంట్రల్: డయల్ 100కు సమాచారం అందించి సత్వర సేవలు పొందాలని ఎస్పీ బూసారపు సత్యయేసుబాబు సూచించారు. గుంతకల్లులోని పిరమిడ్ ధ్యాన కేంద్రం వద్ద పిల్లలను దుండగులు కిడ్నాప్ చేసి స్కారి్పయోలో తీసుకెళ్తున్నారని ఓ ఇంజినీర్ డయల్ 100కు ఫిర్యాదు చేశారన్నారు. దీంతో వెంటనే డీఎస్పీ ఖాసీంసాబ్ నేతృత్వంలో గుంతకల్లు పోలీసులు రంగంలోకి దిగి సమీపంలో పాతకొత్తచెరువు గ్రామస్తులను అప్రమత్తం చేసి కిడ్నాపర్లను పట్టుకున్నారన్నారు. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేస్తే కిడ్నాప్.. డ్రామా అని తేలిందన్నారు. నాసిరకం బియ్యాన్ని సోనా మసూరి బియ్యం అని విక్రయించే ముఠా అని బయటపడిందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment