
పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు వచ్చిన రైతులు
సాక్షి ప్రతినిధి, కాకినాడ/సత్తెనపల్లి: అధికారాన్ని అడ్డం పెట్టుకొని మాజీ స్పీకర్ కోడెల కుటుంబం చేసిన దౌర్జన్యాల పర్వం రోజుకొకటి వెలుగు చూస్తోంది. తమకు చెందిన 17.52 ఎకరాల భూమిని కబ్జా చేశారంటూ కోడెల శివప్రసాద్ కుమారుడు శివరామ్, అతని పీఏ గుత్తా నాగప్రసాద్‌పై సత్తెనపల్లి మండలం వెన్నాదేవి గ్రామానికి చెందిన 16 మంది బాధిత రైతులు గురువారం సత్తెనపల్లి రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఎస్‌ఐ మౌనిషాకు ఫిర్యాదు చేశారు. అనంతరం బాధిత రైతు గొడుగుల సుబ్బారావు మాట్లాడుతూ.. ధూళిపాళ్ల సమీపంలోని మొత్తం 17.52 ఎకరాల భూమిని 16 మంది రైతులు సాగు చేసుకుంటున్నారన్నారు. 1900 సంవత్సరం పూర్వం నుంచి తమ ముత్తాత తాతల నుంచి ఈ భూమిని సాగు చేసుకుంటున్నామని పేర్కొన్నారు. అలాగే ఉమ్మడి కుటుంబం కింద 7 గృహాలు ఉన్నాయన్నారు. అయితే ఈ స్థలంపై కోడెల కుమారుని కన్ను పడటంతో తమను వేధించడం మొదలు పెట్టారని వివరించారు.
2016 ఏప్రిల్ 2న రాత్రి 9.30 గంటల సమయంలో కోడెల శివప్రసాదరావు పీఏ గుత్తా నాగప్రసాద్, యెలినేడి శ్రీనుతోపాటు సుమారు 20 మంది రౌడీ షీటర్లు పౌల్ట్రీ ఫారంలోకి ప్రవేశించి సీసీ కెమెరాలు పగుల గొట్టారన్నారు. రూ. 2 లక్షల డబ్బులు, 40 గ్రాముల గోల్డ్ చైన్ తీసుకొని ఇంట్లో మహిళలను కొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే భూమిని వదిలి పెట్టి వెళ్లిపోకుంటే చంపేస్తామని బెదిరించారని తెలిపారు. 2016 ఏప్రిల్ 4న కూడా కోడెల అనుచరులు పోలీసుల సహాయంతో దౌర్జన్యం చేశారని వివరించారు. రెండు పౌల్ట్రీ షెడ్లలో ఉన్న 10 వేల కోళ్లు, వందలాది పొట్టేళ్లను తీసుకెళ్లారని చెప్పారు. కోటిన్నర విలువైన ఆస్తిని స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. వీరి వేధింపులు తాళలేక భయపడి ఇన్నాళ్లూ తమ కుటుంబం హైదరాబాద్‌లో తల దాచుకుందన్నారు. ప్రస్తుతం అందరూ కేసులు పెడుతున్నారని తెలిసి మేము ధైర్యంగా కేసు పెట్టామని, న్యాయం చేయాలని కోరారు.
తూర్పుగోదావరిలోనూ కోడెల లీలలు
కోడెల కుటుంబ అక్రమాలు తూర్పుగోదావరి జిల్లాలోనూ బయటపడుతున్నాయి. కోడెల శివరాం రాజానగరం గ్రామ రెవెన్యూ పరిధిలోని 10 ఎకరాల భూమిలో ఫార్మా ఉత్పత్తుల గోడౌన్ కోసం అడ్డగోలు నిర్మాణాలు ప్రారంభించారు. అటు పంచాయతీ నుంచిగానీ, ఇటు గోదావరి అర్బన్ డెవలప్‌మెంట్ అథారటీ (గుడా) నుంచి గాని ఎలాంటి అనుమతులు తీసుకోలేదు. అప్పట్లో ఈ వ్యవహారంపై చర్యలు తీసుకోవడానికి ఎవరూ ముందుకు రాలేదు. తాజాగా ఈ నెల 19న గుడా అధికారులు శివరామకృష్ణకు నోటీసులు జారీ చేశారు. ఇదే విషయాన్ని గుడా వైస్ చైర్మన్ అమరేంద్ర కుమార్ ‘సాక్షి’ వద్ద ధ్రువీకరించారు.
Comments
Please login to add a commentAdd a comment