మేడ్చల్ డీఈప్రసాదరావు,సైబర్‌సిటీ డీఈ ముత్యం వెంకటరమణ
సాక్షి, సిటీబ్యూరో: దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ అవినీతికి నిలయంగా మారింది. పైసా విదల్చనిదే ఫైలు కదలని పరిస్థితి నెలకొంది. ట్రాన్స్‌ఫార్మర్, కొత్త వెంచర్‌లో లైన్ల ఏర్పాటు, లైన్ల మార్పిడి, ప్యానల్ బోర్డు, కరెంట్ మీటర్....ఇలా ప్రతి పనికీ ఓ రేట్ ఫిక్స్ చేశారు. అడిగినంత ఇస్తే సరి..లేదంటే వినియోగదారులకు చుక్కలు చూపుతున్నారు. ఇంజినీర్ల తీరుతో విసిగిపోయిన వినియోగదారులు, విద్యుత్ కాంట్రాక్టర్లు చివరకు ఏసీబీ అధికారులను ఆశ్రయిస్తుండటంతో వారు వలపన్ని అవినీతి తిమింగలాలను పట్టుకుంటున్నారు. అయితే ఇప్పటికే ఒక సారి ఏసీబీ కేసులో అరెస్టై కేసు విచారణలో ఉన్న అధికారులు కూడా ఏడాది తిరక్క ముందే అంత కంటే మంచి పోస్టులో చేరిపోతుండటంపై విశేషం. ఏసీబీ కేసులున్న అధికారులను నాన్ ఫోకల్ పోస్టుల్లో నియమించాల్సి ఉండగా, దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలో ఇందుకు విరుద్ధంగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి పెద్దపీట వేస్తుండటం గమనార్హం.
ఆ డివిజన్లు అవినీతికి నిలయాలు: నగర శివార్లలో కొత్తగా అనేక వెంచర్లు వెలుస్తున్నాయి. కొత్తలైన్లు, మీటర్లు కరెంటోళ్లకు కామధేనువులా మారాయి. నిజానికి నాలుగు మీటర్లకు మించితే ప్యానల్ బోర్డు ఏర్పాటు చేసుకోవాలి. అయితే పలవురు వినియోగదారులు జీహెచ్‌ఎంసీ అనుమతి తీసుకోకుండా నిర్మాణాలు చేపడుతున్నారు. ఒక వేళ అనుమతి తీసుకున్నా..సెట్‌బ్యాక్, పార్కింగ్, ఫైర్‌సేఫ్టీ తదితర నిబంధనలు పాటించకపోవడంతో వాటికి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ ఇవ్వరు. ఈ నేపథ్యంలో రాజేంద్రనగర్, గచ్చిబౌలి, కూకట్‌పల్లి, చంపాపేట్, హబ్సిగూడ, కుత్బుల్లాపూర్, జీడిమెట్ల, మియాపూర్, కూకట్‌పల్లి, కొండాపూర్, మాదాపూర్ డివిజన్లలో పని చేస్తున్న కొందరు అధికారులు వినియోగదారుల బలహీనతను ఆసరాగా చేసుకుని అందినకాడికి దండుకుంటున్నారు. అధికారికంగా ఎలాంటి ఎస్టిమేషన్లు లేకుండానే కొత్తలైన్లు, ప్యానల్‌బోర్డులు, ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
జీడిమెట్ల సుభాష్‌నగర్, ప్రగతినగర్, షాపూర్‌నగర్, డీపీపల్లి, ప్రగతినగర్‌లోని క్షేత్రస్థాయి సిబ్బందిపై ఇటీవల పెద్దత్తున ఆరోపణలు వెల్లువెత్తడంతో ఇద్దరు క్షేత్రస్థాయి సిబ్బందిపై చర్యలు తీసుకుని చేతులు దులుపుకున్న విషయం తెలిసిందే. వాస్తవానికి భవనం, వెంచర్ యజమానులు కొత్త లైన్లు, కనెక్షన్ల కోసం ఆయా డివిజన్ల పరిధిలోని వినియోగదారుల సేవాకేంద్రంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ కేంద్రం నుంచి దరఖాస్తు సంబంధిత సెక్షన్ ఏఈ, ఏడీఈ, డీఈ,ఎస్‌ఈకి వెళుతుంది. వర్క్ ఎస్టిమేషన్ దగ్గరి నుంచి మెటీరియల్ సరఫరా, వర్క్ పూర్తయిన తర్వాత తనిఖీ చేసే వరకు ఆయా విభాగాల అధికారులకు అడిగినంత ఇచ్చుకోవాల్సిందే. లేనిపక్షంలో రోజుల తరబడి తిరిగినా పనులు కావడం లేదు. క్షేత్రస్థాయి ఇంజినీర్లపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో విసుగెత్తిన వినియోగదారులు, విద్యుత్ కాంట్రాక్టర్లు గత్యంతరం లేర ఏసీబీని ఆశ్రయిస్తున్నారు.
ఏసీబీకి చిక్కిన ఇద్దరు డీఈలు
కీసర విలేజ్, నాగారం పరిధిలో ఇటీవల కొత్తగా ఓ వెంచర్ వెలసింది. కొత్తలైన్‌కోసం యజమానులు డిస్కంకు దరఖాస్తు చేశారు. వర్క్ ఎస్టిమేషన్, అనుమతులు మంజూరు చేసేందుకు మేడ్చల్ డీఈ ప్రసాదరావు సంబంధిత కాంట్రాక్టర్ బొల్లారం బాలనరసింహను రూ.50 వేలు డిమాండ్ చేశారు. రెండు రోజుల క్రితం ఆయనకు రూ.25 వేలు చెల్లించారు. అయినా వర్క్ ఆర్డర్ ఇవ్వకుండా ఆఫీసు చుట్టూ తిప్పుకుంటుండటంతో విసుగుచెందిన కాంట్రాక్టర్ నరసింహ ఏసీబీని ఆశ్రయించారు. గురువారం మధ్యాహ్నం తన కార్యాలయంలోనే డీఈ ప్రసాదరావు కాంట్రాక్టర్ నుంచి రూ. 5000 లంచంగా తీసుకుంటుండగా, ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని, ఏసీబీ కోర్టులో హాజరు పరిచారు. సదరు అధికారి ఇటీవలే కార్పొరేట్ ఆఫీసు(నాన్‌ఫోకల్ ఫోస్టు) నుంచి మేడ్చల్ డీఈ (ఫోకల్ పోస్టు)కు బదిలీ కావడం విశేషం.
♦ మణికొండలోని ఓ బహుళ అంతస్తుల భవనానికి విద్యుత్ కనెక్షన్ కోసం వర్క్స్ ఎస్టిమేషన్‌కు భవన యజమాని రవీందర్‌రెడ్డి దరఖాస్తు చేసుకున్నాడు. ఇందుకుగాను సైబర్‌సిటీ డీఈ టెక్నికల్ ముత్యం వెంకటరమణ రూ.25 వేలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో ఆ భవనం పనులు దక్కించుకున్న విద్యుత్ కాంట్రాక్టర్ శివకుమార్‌రెడ్డి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. గురువారం సాయంత్రం డీఈ వెంకటరమణ కాంట్రాక్టర్ నుంచి రూ.25 వేలు లంచం తీసుకుంటుండగా, రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
మచ్చుకు కొన్ని కేసులు:
♦ సెప్టెంబర్‌లో లైన్‌మెన్ రాజేందర్ గచ్చిబౌలిలోని నిర్మాణంలో ఉన్న భవనానికి మీటర్ బిగించేందుకు రూ.60వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిపోయాడు.
♦ నవంబర్‌లో కొండాపూర్ ఏడీఈ డి.శ్యాంమనోహర్ రూ.లక్ష లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ట్రాన్స్‌ఫార్మర్, ఆరు మీటర్లు మంజూరు చేసేందుకు లంచం డిమాండ్ చేశారు.
♦ మియాపూర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌కు మీటర్ అమర్చేందుకు ఓ సోలార్ విద్యుత్ సంస్థ ప్రతినిధి నుంచి లంచం తీసుకుంటున్న మియాపూర్ ఏడీఈ రమేష్, సబ్ ఇంజినీర్ పాండులను ఏసీబీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. ఏడీఈ రమేష్‌పై 2008లోనే ఏసీబీ కేసు నమోదైంది. కేసు విచారణలో ఉన్న సమయంలోనే ఆయన మరోసారి పట్టుబడటం విశేషం.
♦ షాపూర్‌నగర్ ఏఈ చిత్తరంజన్ సహా యూసఫ్‌గూడ ఏఈ సుధాకర్ కూడా ఇటీవల ఏసీబీకి పట్టుబడ్డవారిలో ఉన్నారు.
♦ 2017 జూన్‌లో అసెస్‌మెంట్స్ ఎస్‌ఈ శివాజీ రాఠోడ్ ఐమ్యాక్స్ థియేటర్‌లో వినియోగదారుల నుంచి రూ.80వేలు లంచం తీసుకుంటూ దొరికాడు.
♦ గత ఏడాది ఏప్రిల్‌లో షేక్‌పేట ఏఏఈ షేక్‌బాబా మెహిదీపట్నంలోని అపార్ట్‌మెంట్‌కు ట్రాన్స్‌ఫార్మర్ మంజూరు చేసేందుకు రూ.30వేలు తీసుకుంటుండగా ఏసీబీ పట్టుకుంది.
Comments
Please login to add a commentAdd a comment