ఎంవీపీ కాలనీలోని ఈశ్వరరావుకు చెందిన రెండు అంతస్తుల గ్రూప్ హౌస్, ఈశ్వరరావు
సాక్షి, విశాఖపట్నం/విశాఖ క్రైం: కేజీహెచ్ పర్చేస్ సెక్షన్‌లో సీనియర్ అసిస్టెంట్‌గా దశాబ్దమున్నరగా చక్రం తిప్పుతున్న కొటారు ఈశ్వరరావు లీలలు చూసి ఏసీబీ అధికారులే విస్తుపోతున్నారు. ఏపీ ఎన్జీవో అసోసియేషన్ జిల్లా అధ్యక్షునిగా ఉన్న పరిచయాలను అడ్డం పెట్టుకుని కేజీహెచ్‌లోని అన్నింటా పట్టు సంపాదించడంతో ఎన్ని ఫిర్యాదులు వచ్చినా ఆ సీటు నుంచి ఎవరూ కదపలేకపోయారు. దీంతో ఈ 15 ఏళ్ల సమయం నల్లేరు మీద నడకలా సాగిపోయింది. ఇప్పుడు ఆయన అక్రమంగా బోలెడంత సంపాదించారంటూ ఫిర్యాదులు వెల్లువెత్తడంతో అవినీతి నిరోధకశాఖ అధికారులు మంగళవారం ఈశ్వరరావు పనిచేసే కేజీహెచ్ కార్యాలయంలోనూ, ఆయన నివాసం ఉంటున్న ఎంవీపీ కాలనీలో ఇంటితో పాటు నగరంలోని ఇతర ప్రాంతాల్లో ఉన్న ఆయనకు చెందిన ఇళ్లు, స్వస్థలం యలమంచిలి, నక్కపల్లి, నర్సీపట్నంతో పాటు తూర్పు గోదావరి జిల్లా ద్రాక్షారామంలలోని సొంత ఇళ్లలోనూ ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ప్రాథమిక అంచనాల ప్రకారం రూ.10 కోట్లకు పైగా ఆదాయానికి మించిన ఆస్తులున్నట్టు గుర్తించారు.
జూనియర్ అసిస్టెంట్‌గా ప్రస్థానం
ఈశ్వరరావు 1986లో జూనియర్ అసిస్టెంట్‌గా శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం కోస్టలో ఉద్యోగంలో చేరారు. అక్కడ కొన్నాళ్లు ఉద్యోగం చేశాక విశాఖ బదిలీపై వచ్చారు. 15 ఏళ్ల నుంచి కేజీహెచ్‌లో విధులు నిర్వహిస్తున్నారు. ఎన్జీవో సంఘం నేతగా గుర్తింపు పొందిన ఆయనపై తరచూ ఆరోపణలు వస్తున్నా ఎవరూ పెద్దగా పట్టించుకునే వారు కాదు. వివిధ ప్రాంతాల్లో ఆస్తులను కూడబెట్టుకున్నా పెద్దగా దృష్టి సారించలేదు. ఎప్పుడైనా కేజీహెచ్‌కు అవసరమైన మందుల కొరత ఏర్పడినప్పుడు నిధులతో పనిలేకుండా అప్పటికప్పుడు తన పలుకుబడితో రప్పించేవారని చెబుతారు. మరోవైపు కేజీహెచ్ అధికారులకు కూడా మందులు, సర్జికల్స్ కొనుగోళ్లలో కమీషన్లు ముట్టచెబుతారన్న ప్రచారం ఉంది. వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకుని ఏళ్ల తరబడి అక్కడే పనిచేస్తున్నా ఈశ్వరరావును మరో చోటకు కదపకుండా ఉన్నతాధికారులు అక్కడే కొనసాగిస్తున్నారు. తనపై ఆరోపణలు వచ్చినప్పుడల్లా ఆ సీటు నుంచి వెళ్లిపోతానని చెప్పడమే తప్ప అది కార్యరూపం దాల్చలేదు. ఇలా ఈశ్వరరావు తన ప్రస్థానాన్ని కేజీహెచ్‌కే పరిమితం చేస్తూ ఎన్జీవో నేతగా వర్థిల్లుతున్నారు. ఎట్టకేలకు ఏసీబీకి చిక్కడంతో అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి.
డీజీ ఆదేశాలతో సోదాలు
ఏసీబీ డీజీ ఠాకూర్ ఆదేశాల మేరకు శ్రీకాకుళం ఏసీబీ డీఎస్పీ కె.రాజేంద్రతో కలిసి ఈశ్వరరావు ఆస్తులపై సోదాలు నిర్వహించినట్టు విశాఖ ఏసీబీ డీఎస్పీ కె.రామకృష్ణ ప్రసాద్ తెలిపారు. కేజీహెచ్‌లో మెడికల్ స్టోర్, çసర్జికల్స్æ స్టోర్, మందుల కొనుగోలులో అవకతవకలు జరిగినట్టు నిర్థారణ అయిందన్నారు. వీటి కొనుగోలు లావాదేవీలపై పరిశీలిస్తున్నామన్నారు. ఆదాయానికి మించిన ఆస్తులు కేసు నమోదు చేసి, ఈశ్వరరావును ఆరెస్టు చేసినట్టు ఆయన తెలిపారు. అదేవిధంగా బయోమెట్రిక్ విధానం పరిశీలించగా 25 శాతం డాక్టర్లు విధులకు గైర్హాజరైనట్లు తెలిసిందన్నారు. మినిస్టీరియల్ స్టాఫ్ కూడా 20 శాతం హాజరుకావడం లేదన్నారు. సోదాల్లో సీఐలు గణేష్, రమేష్, అప్పారావు, సిబ్బంది పాల్గొన్నారు.
ఉద్యోగుల్లో కలకలం
ఆదాయానికి మించిన ఆçస్తుల కేసులో ఏపీ ఎన్జీవోల సంఘం జిల్లా అధ్యక్షుడు ఈశ్వరరావు ఏసీబీ అధికారులకు చిక్కడంతో ఉద్యోగుల్లోకలకలం రేగుతోంది. త్వరలో ఎన్జీవోసంఘం ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఏసీబీ దాడుల వెనక రాజకీయ కారణాలు కూడా ఉన్నాయన్న ప్రచారం ఆ వర్గాల నుంచివినిపిస్తోంది.
ఇదీ ఈశ్వరరావు ఆస్తుల చిట్టా
ఈశ్వరరావుకు తన సొంతూరు యలమంచిలిలో మూడు మందుల షాపులు కూడా ఉన్నాయని తెలుస్తోంది. మందుల కొనుగోలులో ఆరితేరిన ఆయన ఈ మందుల షాపులను బినామీల పేరిట నడుపుతున్నారని సమాచారం. మరోవైపు కేజీహెచ్‌కు 80 శాతం మందులు సెంట్రల్ డ్రగ్ స్టోర్ నుంచి వస్తుంటాయి. మిగిలిన 20 శాతం స్థానికంగా కొనుగోలు చేసుకోవడానికి అనుమతిస్తారు. ఇలా గుంటూరులో జైకృష్ణా ఏజెన్సీస్‌కు పలుమార్లు టెండర్లు ఖరారు చేసి కొనుగోళ్లు జరుపుతున్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. అలాగే నర్సీపట్నంలో 2 ఎకరాల భూమి, 1,416.5 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇల్లు, 375 గజాల ఇళ్ల స్థలం, నక్కపల్లిలో 1.62 ఎకరాల వ్యవసాయ భూమి, ద్రాక్షారామం వెంకటాయపాలెం 1.40 ఎకరాల పంటభూమి, యలమంచిలి సమీపంలోని కొక్కిరాపల్లిలో 0.25 సెంట్ల భూమి, అక్కయ్యపాలెం జగ్గారావు బ్రిడ్జి దరి రాధ ఎన్‌క్లేవ్‌లో ఒక ప్లాట్, ఎంవీపీలో రెండు అంతస్తుల భవనం, బ్యాంక్ బ్యాలెన్స్ రూ.6లక్షలు, బీమా పాలసీలు రూ.7లక్షలు, సీతమ్మధారలో కెనరా బ్యాంక్‌లో లాకర్ ఉన్నట్లు గుర్తించారు. కో ఆపరేటివ్ బ్యాంకులో రూ.10 లక్షల పొదుపు ఖాతాలున్నట్టు నిర్థారించారు. భూములకు సంబంధించిన దస్తావేజులను స్వాధీనం చేసుకున్నారు. ఎంవీపీ కాలనీలోని ఇంట్లో రూ.90 వేల నగదు, 160 గ్రామల బంగారం, కిలోన్నర వెండిని ఉన్నట్టు గుర్తించారు. బ్యాంకు లాకరును బుధవారం తెరవనున్నారు. బహిరంగ మార్కెట్లో వీటి విలువ రూ.10 కోట్లకు పైగానే ఉంటుందని ఏసీబీ అ«ధికారులు అంచనా వేస్తున్నారు.
యలమంచిలిలోని తల్లి ఇంట్లో సోదాలు
యలమంచిలి: పట్టణంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని ఒక ఇంటిలో మంగళవారం ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. కేజీహెచ్‌లో మెడికల్ పర్చేజ్ ఇన్‌చార్జిగా పనిచేస్తున్న కె.ఈశ్వరరావు ఆదా యానికి మించిన ఆస్తులు సంపాదించారని గుర్తించిన ఏసీబీ అధికారులు ఆయన స్వగ్రామమైన యలమంచిలిలో తనిఖీలు నిర్వహించారు. యలమంచిలిలో ఈశ్వరరావు తల్లి సన్యాసమ్మ ఉంటున్న ఇంటిలో సోదాలు నిర్వహించారు. ఆస్తుల వివరాలపై ఆమెను ప్రశ్నించినట్టు తెలిసింది. ఈ సోదాల్లో ఏసీబీ అధికారి మహేష్‌తోపాటు మరో నలుగురు సిబ్బంది పాలొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment