అవినీతి ప్లానర్‌ | acb rides in pradeepkumar house | Sakshi
Sakshi News home page

అవినీతి ప్లానర్‌

Published Tue, Jan 30 2018 9:02 AM | Last Updated on Sat, Sep 22 2018 8:25 PM

acb rides in pradeepkumar house - Sakshi

ప్రదీప్‌కుమార్‌ ఇంటిలో గుర్తించిన ఆభరణాలు, వస్తువులు చూపిస్తున్న ఏసీబీ డీఎస్పీ ఎస్‌వీవీ ప్రసాద్‌

విశాఖ నగరాభివృద్ధి సంస్థలో మరో అవినీతి చేప బయటపడింది. పదోన్నతిపై విధుల్లోకి చేరి 25 రోజులు గడవకముందే అడిషనల్‌ చీఫ్‌ అర్బన్‌ ప్లానర్‌ ప్రదీప్‌కుమార్‌పై అవినీతి నిరోధక శాఖ దాడులు నిర్వహించడం చర్చనీయాంశమైంది. విశాఖతోపాటు తెలుగు రాష్ట్రాల్లో 12 చోట్ల సోదాలు నిర్వహించారు. 24 ఏళ్ల క్రితం డ్రాఫ్ట్స్‌మెన్‌గా విధుల్లో చేరినప్పుడు అతని జీతం రూ.1300 కాగా... ప్రస్తుతం ఏసీబీ దాడుల్లో అధికారులు గుర్తించిన ఆస్తుల విలువ రూ.40 కోట్లకుపైనే.. ఈ లెక్కన ఆయన అవినీతి ప్రస్థానం ఏ స్థాయిలో ఉందో తెలుస్తోంది.

విశాఖ క్రైం: అతను ఓ డ్రాఫ్ట్స్‌మెన్‌గా 24 ఏళ్ల కిందట విధుల్లో చేరాడు. అనంతరం అంచెలంచెలుగా ఎదిగి అదనపు చీఫ్‌ అర్బన్‌ ప్లానర్‌ స్థాయికి ఎదిగాడు. ఈ క్రమంలో ధనార్జనే ధ్యేయంగా సాగించిన ప్రస్థానంలో కోట్లాది రూపాయలు అక్రమంగా సంపాదించాడు. విషయం తెలుసుకున్న అవినీతి నిరోధక శాఖ అధికారులు ఏసీబీ డీజీ ఆర్‌పీ ఠాకూర్‌ ఆదేశాల మేరకు సోమవారం విశాఖతోపాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏక కాలంలో 12 చోట్ల సోదాలు చేయడంతో కోట్లాది రూపాయల ఆస్తులు వెలుగుచూశాయి. వివరాల్లోకి వెళ్తే... ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో విశాఖ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (వుడా) అడిషనల్‌ చీఫ్‌ అర్బన్‌ ప్లానర్‌ పసుపర్తి ప్రదీప్‌కుమార్, అతని బంధువులు, స్నేహితుల ఇళ్లపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) సెంట్రల్‌ ఇన్వెస్టిగేషన్‌ యూనిట్‌ అధికారులు సోమవారం ఏకకాలంలో 12చోట్ల దాడులు చేశారు.

విశాఖలో ఉదయం 5 గంటల నుంచే ఈ సోదాలు ప్రారంభించారు. సంపత్‌ వినాయగర్‌ గుడి సమీపంలో ఆయన నివసిస్తున్న నటరాజ్‌ టవర్స్‌లోని ఫ్లాట్‌ నెంబర్‌ 301, స్నేహితులు నివసిస్తున్న సీతమ్మధార బాలాజీ శాస్త్రి లే అవుట్, శివాజీపాలెం, కిర్లంపూడి లే అవుట్‌లోని ఇళ్లు, వుడా కార్యాలయంలోని ప్రదీప్‌ చాంబర్‌లో అధికారులు సోదాలు చేశారు. అదేవిధంగా అనంతపురం జిల్లాలో మూడు చోట్ల, ఒంగోలులో ఒక చోట, విజయవాడలో ఒక చోట, హైదరాబాద్‌లో రెండుచోట్ల కుటుంబ సభ్యులు, స్నేహితుల ఇళ్లలో సోదాలు చేశారు. ఈ సోదాలలో 40 కోట్ల రూపాయల విలువ గల స్థలాలు, ఫ్లాట్‌లు, బంగారం, వెండి ఆభరణాలు గుర్తించారు. తవ్వుతున్న కొద్దీ కోట్ల విలువ గల ఆస్తులు బయటపడుతున్నాయి.

ఇదీ పసుపర్తి ప్రస్థానం
కర్నూలు జిల్లాకు చెందిన పసుపర్తి ప్రదీప్‌కుమార్‌ 1984వ సంవత్సరంలో అ నంతపురం జిల్లా గుంతకల్లులో డ్రాప్ట్స్‌మెన్‌గా రూ.1300ల జీతానికి విధుల్లో చేరాడు. అనంతరం పలుచోట్ల పనిచేస్తూ 1999లో ప్లానింగ్‌ ఆఫీసర్‌గా ఉద్యోగోన్నతి పొందారు. ఆ తర్వాత 2010లో అసిస్టెంట్‌ సిటీ ప్లానర్‌గా, 2013లో డిప్యూటీ సిటీ ప్లానర్‌గా పనిచేశారు. ఈ క్రమంలో 2008 నుంచి 2010 వరకు పెందుర్తి జోన్‌ –6లో అసిస్టెంట్‌ సిటీ ప్లానర్‌గా పనిచేశారు. తాజాగా 25 రోజుల కిందట విశాఖ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (వుడా) అడిషనల్‌ చీఫ్‌ అర్బన్‌ ప్లానర్‌గా పదోన్నతిపై వచ్చారు. అంతకుముందు విజయవాడలో టౌన్‌ ప్లానింగ్‌ విభాగం జాయింట్‌ డైరెక్టర్‌గా పనిచేసేవారు.

కుమారుల విద్యకు భారీగా ఖర్చు
కుమారుల విద్య కోసం ప్రదీప్‌కుమార్‌ భారీగా ఖర్చు చేస్తున్నట్లు ఏసీబీ అధికారులు గుర్తింఆచరు. పెద్ద కుమారుడు హేమంత్‌సాయి విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించారు. స్కాట్లాండ్‌లో ఎంఎస్‌ చేసి నగరంలోని మధురవాడ వద్ద హెచ్‌.ఎస్‌.కనస్ట్రక్షన్‌ పేరిట వ్యాపారం చేస్తున్నాడు. చిన్న కుమారుడు జయంత్‌ సాయి మణిపాల్‌లో ఇంజినీరింగ్‌ విద్యసభ్యసిస్తున్నాడు. ఏడాదికి రూ.3లక్షలు  వెచ్చించి ఇంజినీరింగ్‌ చదివిస్తుండడంపై ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు.

సింగపూర్‌ పర్యటనలో భార్య లత
వుడా అడిషినల్‌ చీఫ్‌ అర్బన్‌ ప్లానర్‌ ప్రదీప్‌కుమార్‌ భార్య లత ఈ నెల 27న సింగపూర్‌ పర్యటనకు వెళ్లారు. ఆమె పేరిట మూడు బ్యాంకు లాకర్లు ఉన్నట్లు ఏసీబీ అధికారులు
గుర్తించారు. ఆమె వచ్చిన తర్వాత లాకర్లు తెరిచే అవకాశం ఉంది. అదేవిధంగా పనిమనిషి ఖాతాలపై కూడా ఏసీబీ దృష్టి సారించినట్లు తెలిసింది.  

భారీగా ఆభరణాలు, వస్తువులు
2.7 కిలోల బంగారు ఆభరణాల గుర్తింపు.  
12.5కిలోలు వెండి, రూ.4లక్షల నగదు.
బ్యాంకు ఖాతాలో రూ.3లక్షల బ్యాలెన్స్‌.
ప్రదీప్‌కుమార్‌తోపాటు అతని భార్య పేరు మీద రూ.18 లక్షలు విలువ చేసే ఫిక్సిడ్‌ డిపాజిట్‌ బాండ్లు.
రూ.10లక్షలు విలువ చేసే బీమా డాక్యుమెంట్లు.
రూ.2.50లక్షల విలువ చేసే డైమండ్‌ నక్లెస్, రూ.21లక్షలు విలువ చేసే ఇతర వస్తువులను అధికారులు గుర్తించారు.
ఈ దాడుల్లో భారీ విలువ చేసే విదేశీ వాచీలు కూడా లభ్యమయ్యాయి.

ఇదీ అక్రమాస్తుల చిట్టా
2005లో మధురవాడలో 500 గజాలు స్థలం ప్రదీప్‌కుమార్‌ కొనుగోలు చేశారు.
2006లో మధురవాడలో 599 చదరపు అడుగుల స్థలం కొనుగోలు చేశారు.
2017లో మధురవాడలో 200 గజాలు బాబాయి నారాయణరాజు పేరు మీద కొనుగోలు చేశారు.
రాజమండిలో ప్రదీప్‌కుమార్‌ తండ్రి స్వర్గీయ
వెంకటరాజు పేరు మీద 250 గజాల స్థలం.
2006లో మధురవాడలో భార్య లత పేరు మీద 311 గజాలు స్థలం.
2007లో భార్య లత పేరు మీద 311 స్కేర్‌యార్డ్స్‌ ఇంటి స్థలం.
2016లో విజయవాడలోని దేవినగర్‌లో 166 చదరపు అడుగుల స్థలం.
కృష్ణా జిల్లాలో భార్య లత పేరు మీద 7 సెంట్లుభూమి.
విశాఖ కిర్లంపూడి లే అవుట్‌లో భార్య లత పేరు మీద శ్రీపాద నిలయం(16వందల చదరపు అడుగులు).
కడప జిల్లా  మైదుకూరులో భార్య లత పేరు మీద 4 ఏకరాల 8సెంట్లు స్థంలం.
శివాజీపాలెంలో నివసిస్తున్న సింహాద్రి పేరు మీద రూ. 8.50 లక్షల విలువ చేసే కారు.
ప్రదీప్‌కుమార్‌ పేరు మీద బుల్లెట్, భార్య లత పేరు మీద స్కూటీ.
మొత్తం 5 ఇళ్ల ప్లాట్స్, 4 ఫ్లాట్స్, 9.20 ఎకరాల వ్యవసాయ భూమికి సంబంధించిన పత్రాలు అధికారులు గుర్తించారు.
బీచ్‌రోడ్డులోని కోహినూర్‌ బ్యాంక్‌లో రెండు లాకర్లు, కిర్లంపూడి లే అవుట్‌ ప్రాంతంలోని సిండికేట్‌ బ్యాంక్‌లో రెండు లాకర్లు ఉన్నాయని,  వాటిని తెరవాల్సి ఉందని ఏసీబీ డీఎస్పీ ఎస్‌వీవీ ప్రసాద్‌ తెలిపారు. ప్రదీప్‌కుమార్‌ని అరెస్ట్‌ చేశామని తెలిపారు. ఈ దాడుల్లో ఏసీబీ సీఐలు కె.వెంకటేశ్వర్లు, రమేష్, లక్ష్మ జీ, మహేష్, అప్పారావు, సతీష్‌ సిబ్బంది పాల్గొన్నారు.

వుడాలో అవినీతి ఊడలు : రూ.500 కోట్ల కుంభకోణం నుంచి ఇప్పటి వరకూ అవినీతి కంపు
విశాఖ సిటీ: విశాఖ నగరాభివృద్ధికి పెద్దన్నలా వ్యవహరించాల్సిన వుడా.. అవినీతికి అమ్మమ్మలా మారిపోతోంది. క్షేత్రస్థాయిలో చేయి తడపకుంటే పని చేయని ఉద్యోగులు... ప్లాన్‌ కోసం కాళ్లరిగేలా తిప్పించుకునే నైజం.. డిప్యుటేషన్లపై వచ్చిన అధికారులకు సహకరించని వైనంతో వుడా ప్రతిష్ట రోజు రోజుకీ దిగజారిపోతోంది. మొన్న వెలుగులోకి వచ్చిన రూ.500 కోట్ల కుంభకోణం నుంచి తాజాగా అడిషనల్‌ సీయూపీపై ఏసీబీ అధికారుల దాడుల వరకూ అవినీతిని విస్తరించుకుపోతున్నారు.

అభివృద్ధితోపాటే అవినీతి జోరు
ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పన, సామాన్యులకు అందుబాటులో ఇళ్ల స్థలాలు, ఇళ్లు అందించే లక్ష్యంతో 1962లో విశాఖలో టౌన్‌ ప్లానింగ్‌ ట్రస్ట్‌(టీపీటీ) ఏర్పాటైంది. ఇది క్రమంగా 1978 జూన్‌ 17న విశాఖ నగరాభివృద్ధి సంస్థ(వుడా)గా రూపాంతరం చెందింది. వుడాలో 2008 నుంచి అక్రమాలు జోరందుకున్నాయి. ల్యాండ్‌ పూలింగ్‌లో అవకతవకలు, వుడా స్థలాలను తక్కువ ధరకు ప్రైవేటు వ్యక్తులకు కేటాయింపులు, నిబంధనలకు విరుద్ధంగా ఓపెన్‌ స్పేస్‌లలో నిర్మాణాలకు అనుమతులు.. ఇలా అనేక వరుస కుంభకోణాలు సంస్థ ప్రతిష్టను దెబ్బతీశాయి. ఇందులో ఐఏఎస్‌ అధికారులల పాత్ర ఉన్నప్పటికీ కేవలం కింది స్థాయి అధికారులపైనే చర్యలు తీసుకొని చేతులు దులిపేసుకుంటున్నారు.
భూ సమీకరణ, ప్రత్యామ్నాయ భూముల కేటాయింపుల్లో జరిగిన రూ.500 కోట్ల కుంభకోణం 2009లో పెద్ద దుమారాన్నే లేపింది.
పరదేశిపాలెం, కొమ్మాది, రుషికొండ, మధురవాడ ప్రాంతంలో ఓజోన్‌ వ్యాలీ లే అవుట్‌ అభివృద్ధి విషయంలో జరిగిన అవినీతి అక్రమాల్లో అప్పటి వుడా అధికారుల పాత్ర ఉన్నట్లు స్పష్టమైంది.
అసైన్డ్‌ భూములను గుర్తించి ల్యాండ్‌ పూలింగ్‌లో సేకరించేందుకు పథకం పన్నారు. ప్రధానంగా అప్పటి ఎస్టేట్‌ అధికారి జగదీష్‌ కీలక భూమిక పోషించినట్లు అప్పట్లోనే సంచలనమైంది.
ఆ తర్వాత విశాఖలోని ఎంవీపీ కాలనీ సెక్టార్‌ – 2లో గల 4,114 చదరపు అడుగుల కమ్యూనిటీ సెంటర్‌ స్థలం కేటాయింపుల్లో స్వలాభం కోసం వుడాకు రూ.5.23కోట్లు నష్టం వాటిల్లేలా చేసిన వ్యవహారం కూడా ప్రకంపనలు సృష్టించింది. ఈ కేసుని దర్యాప్తు చేసిన సీఐడీ అప్పటి వీసీ విష్ణు, ఈవో జగదీష్‌తో పాటు మరో 9 మందిపై కేసు నమోదు చేసింది. ఇలా అవినీతికి పట్టుగొమ్మగా మారిపోయిన వుడా అధికారుల మాటలను దిగువ స్థాయి సిబ్బంది పెడ చెవిన పెట్టడం ప్రారంభమైంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement