
ప్రముఖ నిర్మాత హార్వే వెయిన్‌స్టీన్ లైంగిక అఘాయిత్యాల కుంభకోణం సినీ పరిశ్రమను కుదుపుతూనే ఉంది. తాజాగా మరో నటి ఆయన బాగోతాన్ని బయటపెట్టింది. 2008లో లండన్‌లోని ఓ హోటల్ గదిలో తనపై వెయిన్‌స్టీన్ లైంగిక దాడి చేశాడని, ఆ తర్వాత నటిగా కొనసాగుతున్నకాలంలో ఆయనను తనను వేధించాడని నటి నటాసియా మల్థే తాజాగా మీడియాకు వెల్లడించారు.
పలు హాలీవుడ్ సినిమాల్లో నటించిన మల్థే న్యూయార్క్‌లో విలేకరుల సమావేశం పెట్టి వెయిన్‌స్టీన్ దుర్మార్గాన్ని వెల్లడించారు. ఇప్పటికే పలువురు నటీమణులు, మహిళలు వెయిన్‌స్టీన్ కామోన్మాదాన్ని బహిర్గతం చేసిన సంగతి తెలిసిందే. 2008 ఫిబ్రవరిలో బఫ్తా అవార్డుల వేడుక సందర్భంగా తాము కలిశామని, అతనితో లైంగిక సంబంధానికి ఎంతమాత్రం ఇష్టంలేదని ఎంత చెప్పినా.. వెయిన్‌స్టీన్ వినిపించుకోలేదని, సండర్సన్ హోటల్‌లో తనపై బలాత్కారం చేశాడని, సమ్మతి లేకుండానే తనతో శృంగారంలో పాల్గొన్నాడని ఆమె తెలిపింది. ఇందుకు బదులుగా తన సినిమాల్లో అవకాశాలు కల్పిస్తానని వెయిన్‌స్టీన్ పేర్కొన్నాడని, కానీ, ఈ ఆఫర్‌ను తాను తిరస్కరించానని ఆమె చెప్పారు.
మల్థే రేప్ అనే పదాన్ని నేరుగా ఉపయోగించకపోయినప్పటికీ.. ఆమె లాయర్ మాత్రం ఇది బలవంతపు లైంగికదాడియేనని స్పష్టం చేశారు. అతను శృంగారంలో పాల్గొంటున్నప్పుడు తాను సహకరించలేదని, శవంలా నిశ్చేష్టంగా ఉండిపోయానని ఆమె తెలిపారు. ఇప్పటికే తొమ్మిది మంది మహిళలు తమపై వెయిన్‌స్టీన్ లైంగిక దాడులు జరిపినట్టు బహిరంగంగా వెల్లడించిన సంగతి తెలిసిందే. మిమి హాలెయి అనే మహిళ మంగళవారం వెయిన్‌స్టీన్‌పై రేప్ ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణల నేపథ్యంలో పలు దర్యాప్తు సంస్థలు వెయిన్‌స్టీన్ బాగోతంపై విచారణ చేపడుతున్నాయి.