అమ్మాయి కోసం అరాచకం | Anarchy for the girl at Ananthapuram Arts College | Sakshi
Sakshi News home page

అమ్మాయి కోసం అరాచకం

Published Sat, Jun 29 2019 5:01 AM | Last Updated on Sat, Jun 29 2019 5:14 AM

Anarchy for the girl at Ananthapuram Arts College - Sakshi

యువకునిపై విచక్షణా రహితంగా దాడి చేస్తున్న విద్యార్థులు , బాధితుడు శివయ్య

అనంతపురం సెంట్రల్‌: పాతిక మందికి పైగా విద్యార్థులు ఓ యువకుడిని చితకబాదారు. రౌడీల్లా అరాచకం సృష్టించారు. అచేతన స్థితికి చేరుకున్నా ఏమాత్రం కనికరం లేకుండా బెల్టులు, బండరాళ్లతో దాడి చేశారు. ఈ ఘటన అనంతపురంలోని ఆర్ట్స్‌ కళాశాలలో మూడ్రోజుల క్రితం చోటు చేసుకుంది. ఈ దాడి దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడంతో విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. ధర్మవరం మండలం చిగిచెర్లకు చెందిన రాజేష్‌ అనంతపురం ఆర్ట్స్‌ కళాశాలలో బీకాం మొదటి ఏడాది చదువుతున్నాడు. రాజేష్‌ స్నేహితుడైన శివయ్య పదో తరగతి వరకు చదివి మానేశాడు. అతను అప్పుడప్పుడు ఆర్ట్స్‌ కళాశాలకు వెళ్లి స్నేహితుడు రాజేష్‌ను కలుస్తుండేవాడు.

ఈ క్రమంలో శివయ్య ఓ విద్యార్థినితో ప్రేమలో పడ్డాడు. అయితే ఆ అమ్మాయి భరత్‌ అనే విద్యార్థితో చనువుగా ఉంటోంది. దీంతో శివయ్యకు వార్నింగ్‌ ఇవ్వాలని భరత్‌ అనుకున్నాడు. ఈ విషయాన్ని రాజేష్‌కు చెప్పి ఈనెల 25వ తేదీన శివయ్యను కళాశాలకు పిలిపించాడు. ఆవరణలోని కామర్స్‌ బిల్డింగ్‌ ఎదుట శివయ్యపై భరత్‌ పాతిక మందికి పైగా విద్యార్థులతో కలసి దాడి చేశాడు. దెబ్బలకు తాళలేక బాధితుడు అపస్మారక స్థితికి చేరుకున్నా వదలకుండా బెల్టులు, బండరాళ్లతో దాడి చేశారు.

తీవ్రంగా గాయపడిన యువకుడిని సహచరులు స్థానిక ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స చేయించారు. కాగా, బాధితుడు జరిగిన ఘటనపై అదే రోజు త్రీటౌన్‌ పోలీసులను ఆశ్రయించగా సర్దిచెప్పి పంపినట్లు తెలిసింది. అయితే దాడికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేయడం, విషయం ఎస్పీ బూసారపు సత్యయేసు బాబు దృష్టికి వెళ్లడంతో శుక్రవారం రోజు బాధిత యువకుడిని పిలిపించి రహస్యంగా విచారణ చేపట్టారు. నిందితుల్లో కొందరు పోలీసులకు లొంగిపోగా మరి కొందరు పరారీలో ఉన్నట్టు తెలిసింది. దీనిపై త్రీటౌన్‌ సీఐ బాలమద్దిలేటిని వివరణ కోరగా.. బాధిత యువకుడి పరిస్థితి ఇప్పుడు బాగానే ఉందన్నారు. ఈ దాడికి ప్రేమ వ్యవహారమే కారణం కాదని, పూర్తి వివరాలు విచారణ అనంతరం వెల్లడిస్తామన్నారు. శివయ్య ఆర్ట్స్‌ కళాశాల విద్యార్థి కాదని ఆయన స్పష్టం చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement