పోలీస్ స్టేషన్‌లో జర్మన్ టూరిస్టు ఎరిక్ ఫిర్యాదు ఇన్‌సెట్‌లో (బాధితుడు ఎరిక్, నిందితుడు అమన్)
వారణాసి : భారత్‌లో మరో విదేశీ పర్యాటకుడిపై దాడి సంచలనంగా మారింది. ఉత్తరప్రదేశ్‌లోని సోన్‌భద్ర జిల్లాలోని రాబర్ట్స్‌గంజ్ రైల్వే స్టేషన్‌లో శనివారం ఈ ఘటన జరిగింది. ఇటీవలే ఆగ్రాలో తమతో సెల్ఫీ దిగలేదన్న సాకుతో కొందరు యువకులు స్విట్జర్లాండ్‌కు చెందిన జంటను చితక్కొట్టిన సంగతి తెలిసిందే. ఆ ఉదంతం ఇంకా చల్లారకముందే యూపీలోనే మరో టూరిస్టుపై దాడి జరగడం గమనార్హం.
అసలేం ఏం జరిగింది? : జర్మనీ రాజధాని బెర్లిన్‌కు చెందిన హాల్గర్ ఎరిక్ మిస్చ్.. ప్రస్తుతం భారత్‌లో పర్యటిస్తున్నాడు. యూపీ సోన్‌భద్ర జిల్లాలోని ప్రఖ్యాత అఘోరి కోటను చూసేందుకు శనివారం రైలులో వెళ్లాడు. రాబర్ట్స్‌గంజ్ స్టేషన్‌లో దిగిన తర్వాత, అక్కడినుంచి కోటకు వెళ్లే దారి సూచనల కోసం వెతికాడు. ఆ సమయంలో సహాయం సాకుతో అమన్ కుమార్ అనే వ్యక్తి ఎరిక్ దగ్గరికొచ్చి వేధింపులు మొదలుపెట్టాడు. ఒక దశలో ఎరిక్‌ను కొట్టి, కిందపడేశాడు. గలాటా జరుగుతోందన్న సమాచారంతో అక్కడికొచ్చిన పోలీసులు ఇద్దరినీ స్టేషన్‌కు తీసుకెళ్లారు.
వెల్‌కమ్ టు ఇండియా అంటే కొట్టాడు : ఎరిక్ ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసుకున్న పోలీసులు.. ‘ఎందుకు కొట్టావ’ని నిందితడు అమర్ కుమార్‌ని ప్రశ్నించగా.. ‘నేను కాదు.. అతనే నాపై దాడి చేశాడు. ఆ టూరిస్టు(ఎరిక్) రైలుదిగి వస్తున్నప్పుడు వెల్‌కమ్ టు ఇండియా అని స్వాగతం పలికానని, తన మాటలను పట్టించుకోకపోగా, దాడి చేశాడు’’ అని అమన్ రివర్స్ ఫిర్యాదు చేశాడు. ఇతను ఓ ప్రైవేటు కంపెనీలో ఎలక్ట్రిషన్‌గా పనిచేస్తున్నాడు. కేసుకు సంబంధించిన నిజానిజాలను వెలికితీసేందుకు పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. ఈ ఘటనపై యూపీ ఉన్నతాధికారులు, విదేశాంగ మంత్రిత్వ శాఖ, జర్మన్ ఎంబసీలు స్పందించాల్సిఉంది.
Comments
Please login to add a commentAdd a comment