సూరి హత్యకేసు నిందితుడు భానుపై మరోకేసు | Another case on Bhanu | Sakshi
Sakshi News home page

సూరి హత్యకేసు నిందితుడు భానుపై మరోకేసు

Published Thu, May 10 2018 11:17 AM | Last Updated on Thu, May 10 2018 11:23 AM

Another case on Bhanu - Sakshi

భాను కిరణ్‌ (ఫైల్‌)

సాక్షి, సిటీబ్యూరో : మద్దెలచెరువు సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న భానుకిరణ్‌కు 2009 నాటి అక్రమ ఆయుధాల కేసులో శిక్ష విధిస్తూ న్యాయస్థానం బుధవారం తీర్పు ఇచ్చింది. ఇతడితో పాటు రాజశేఖర్‌రెడ్డి, శివప్రసాద్‌రెడ్డి, వినోద్‌లనూ దోషులుగా తేల్చి శిక్ష విధించింది. తీవ్ర సంచలనం సృష్టించిన ఈ కేసు వివరాలు.  అసాంఘిక ముఠాలకు అక్రమ ఆయుధాలను సరఫరా చేయడానికి ప్రయత్నిస్తున్న ఈ ముఠాను హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు 2009 మార్చ్‌ 11న పట్టుకున్నారు.

వీరి నుంచి 20 తుపాకులు, 42 తూటాలు తదితరాలు స్వాధీనం చేసుకున్నారు. అప్పట్లో అరెస్టు అయిన వారిలో ఏపీఎస్పీ మాజీ కానిస్టేబుల్, పదవీ విరమణ చేసిన ఆర్మీ జవాన్‌తో మద్దెలచెరువు సూరికి అనుచరుడిగా వ్యవహరించిన భాను కిరణ్‌ సైతం ఉన్నాడు. కర్నూలు జిల్లా ఆత్మకూరు మండలం రాంపల్లికి చెందిన పొరెడ్డి రాజశేఖర్‌రెడ్డి ఈ ముఠాకు నాయకుడు. ఇతను 2007లో ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో అగ్రికల్చరల్‌ బీఎస్సీ చేస్తున్న సమయంలో ఫిరోజాబాద్‌కు చెందిన ఆయుధాల స్మగ్లర్‌తో పరిచయమైంది.

అతని సాయంతో అక్రమ ఆయుధాలు తక్కువ ధరకు సేకరించి, వాటిని రాష్ట్రానికి తరలించి అధిక ధరలకు విక్రయించడం ప్రారంభించాడు. దీనికోసం ముఠా ఏర్పాటు చేసుకున్నాడు. హైదరాబాద్‌కు ఓ వ్యక్తి ఆక్రమ ఆయుధం కలిగి ఉన్నాడనే సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్‌ మధ్య మండల బృందం రంగారెడ్డి జిల్లా మాదాపూర్‌కు చెందిన సోలెం సుబ్బయ్య అలియాస్‌ సుబ్బును అరెస్టు చేసింది. ఇతని నుంచి ఓ కంట్రీమేడ్‌ పిస్టల్‌ను స్వాధీనం చేసుకుంది.

సుబ్బును విచారిస్తున్న సమయంలో ఇతర రాష్ట్రాల నుంచి ఆయుధాలు అక్రమంగా ఎలా సరఫరా అవుతున్నాయనే విషయంపై చిన్న తీగ దొరికింది. దీని ఆధారంగా దర్యాప్తు చేసిన అప్పటి అధికారులైన టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ వీబీ కమలాసన్‌రెడ్డి, ఇన్‌స్పెక్టర్‌ మద్దిపాటి శ్రీనివాసరావు, ఎస్సైలు ఎన్‌సీహెచ్‌ రంగస్వామి, బి.నవీన్‌రెడ్డి, కె.శ్రీనివాస్, జె.రాంబాబు తమ బృందాలతో నగర వ్యాప్తంగా జల్లెడపట్టారు.

బేగంపేట రోడ్‌లో ఉన్న ట్రాన్సిస్ట్‌ హోటల్‌పై బుధవారం దాడి చేసి పొరెడ్డి రాజశేఖర్‌ రెడ్డి, ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌కు చెందిన సర్వేష్, సంజయ్‌ భరద్వాజ్, మహ్మద్‌ జఫార్, జహంగీర్‌ ఖాన్‌ అలియాస్‌ సమీర్‌లను పట్టుకున్నారు.

వీరిచ్చిన సమాచారం మేరకు నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు చేసి భాను కిరణ్, ఏపీఎస్పీ సెకండ్‌ బెటాలియన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేసిన ఎర్ల మాధవయ్య, ముల్లా అబ్దుల్‌ రవూఫ్, కర్నూ లు జిల్లాకు చెందిన భంగిరాజు, బోనం వినోద్‌ అలియాస్‌ చక్రి, కడప జిల్లాకు చెందిన మాజీ ఆర్మీ జవాన్‌ కర్ణ శివప్రసాద్‌రెడ్డిలను అరెస్టు చేశారు. ఈ కేసు దర్యాప్తు నిమిత్తం సీఐడీకి బదిలీ అయింది. మొత్తం 13 మంది నిందితులు కాగా... బుధ వారం నలుగురిపై నేరం నిరూపణ అయింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement