అరుణ్‌ దొరికాడోచ్‌.. | Arun reached home after one year | Sakshi
Sakshi News home page

ఏడాది తర్వాత దొరికిన అరుణ్‌ ఆచూకీ

Published Mon, May 21 2018 2:16 PM | Last Updated on Fri, Jul 12 2019 3:29 PM

Arun reached home after one year - Sakshi

బాలుడిని ఎత్తుకున్న ఎంపీపీ గడ్డమీది స్వప్న, పక్కన అరుణ్‌ తల్లిదండ్రులు

తప్పిపోయిన కుమారుడి కోసం ఆ తల్లిదండ్రి వెతకని చోటు లేదు.. మొక్కని దేవుడు లేడు.. సరిగ్గా ఏడాది తర్వాత ఆ చిరుప్రాయం స్వస్థలం యాదగిరిగుట్టలోనే ప్రత్యక్షమవ్వడంతో పేద దంపతుల ఆనందానికి అవధుల్లేవు..తమ కన్నపేగు దరికి చేరేలా చొరవచూపిన ‘సాక్షి’కి వారు ఈ సందర్భంగా ఆనందబాష్పాలతో  ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

యాదగిరిగుట్ట (ఆలేరు) : యాదగిరి పట్టణానికి న్యాలపట్ల అశోక్, నిర్మల దంపతులకు అరుణ్‌ ఒక్కడే కుమారుడు. అశోక్‌ ఆటోడ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. గతేడాది మే 16వ తేదీన అరుణ్‌ తన స్నేహితులతో ఆడుకుంటున్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు.ఆ రోజు అరుణ్‌ తల్లిదండ్రులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో అప్పటి ఏసీపీ సాదూమోహన్‌రెడ్డి, సీఐ రఘువీరారెడ్డి, ఎస్‌ఐ గోపాల్‌దాస్‌ ప్రభాకర్‌ వివిధ ప్రాంతాల్లో బాలుడి ఆచూకీ కోసం వెతికినా ప్రయోజనం లేకుండా పోయింది. ఆ ముగ్గురు పోలీస్‌ అధికారులు ఇక్కడి నుంచి బదిలీపై వెళ్లారు. దీంతో ఇటీవల బాధ్యతలు తీసుకున్న ఏసీపీ శ్రీనివాసచార్యులు, టౌన్‌ సీఐ అశోక్‌ కుమార్‌లను బాలుడి తల్లిదండ్రులు కలిసి తన కొడుకు జాడ చూపాలని వేడుకున్నారు. 

జనసంద్రంగా పోలీస్‌స్టేషన్‌...
ఏడాది క్రితం తప్పిపోయిన బాలుడు ఆదివారం కనిపించడంతో యాదగిరిగుట్ట పోలీస్‌స్టేషన్‌కు బీసీకాలనీ, గుండ్లపల్లి, శ్రీరాంనగర్‌ ప్రాంతాలకు చెందిన ప్రజలు అధిక సంఖ్యలో చేరుకున్నారు. బాలుడిని చూసి అరుణ్‌ బంధువులతో పాటు స్థానిక ప్రజలు కన్నీరుకార్చారు. సంవత్సరం అంతా చిన్నారి ఎక్కడ ఉన్నాడు.. ఎలా ఉన్నాడు.. ఏమీ చేశాడని పలువురు బాలుడిని అడిగే ప్రయత్నం చేశారు. దీంతో బాలుడు తల్లిదండ్రులతో పాటు అమ్మమ్మ తాతా, తన స్నేహితులను ప్రతి ఒక్కరిని పేరుపెట్టి అడగడంతో అందరూ ఆనందం వ్యక్తం చేశారు. 

ఆ చిట్టీలో ఏముంది..?

అరుణ్‌ను పాతగుట్ట చౌరస్తాలో సుమారు సాయంత్రం 4.20గంటల సమయంలో ఓ కారులో ఇద్దరు వ్యక్తులు వచ్చి వదిలి వెళ్లారని తెలుస్తోంది. వారు వెళ్లే ముందు బాలుడి జేబులో ఓ చిట్టీని ఆ వ్యక్తులు పెట్టి వెళ్లారని తెలుస్తోంది. ఆ చిట్టీలో ‘నాకు ముగ్గురు కూతుళ్లు.. మగపిల్లలు లేరు.. అరుణ్‌ను నాకు రంగారెడ్డి జిల్లా ఘట్‌కేసర్‌ సమీపంలో కనిపించాడు.. అతడిని అక్కడి నుంచి తీసుకెళ్లాను..

ఇటీవల ఓ దిన పత్రికలో వచ్చిన కథనం చూసి బాలుడిని ఇక్కడ వదిలేసి వెళ్తున్నా.. వేరే ఏ దురుద్దేశంతో బాలుడిని తీసుకెళ్లలేదు.. నన్ను క్షమించండి’ ఉందని తెలుస్తోంది. కారు ఎక్కడి నుంచి వచ్చింది.. ఆ కారులో ఎవరు ఉన్నారనే అంశాలపై సీఐ అశోక్‌ కుమార్‌ ఆరా తీస్తున్నారు.

బాలుడిని తీసుకెళ్లిన వ్యక్తులను త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు. అరుణ్‌ను ఎవరైనా కిడ్నాప్‌ చేసి ఈ రోజు వదిలి వెళ్లిన వ్యక్తులకు అమ్మారా.. లేక.. ఇక్కడి నుంచి అరుణ్‌ను తీసుకెళ్లిన వ్యక్తులే పెంచుకుంటున్నారా అనే అంశాలు తెలియాల్సి ఉంది. 

ఆస్పత్రికి బాలుడి తరలింపు

ఏడాది తర్వాత కనిపించిన అరుణ్‌ను స్థానిక సీఐ అశోక్‌కుమార్‌ ఆస్పత్రికి తరలించారు. బాలుడి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అనే అంశాలపై ఆస్పత్రికి తీసుకెళ్తున్నట్లు సీఐ వెల్లడించారు. అరుణ్‌ వద్ద పూర్తి వివరాలు సేకరించి మీడియాకు తెలుపుతామని సీఐ పేర్కొన్నారు. 

‘సాక్షి’కి ప్రత్యేక ధన్యవాదాలు...

సాక్షి పత్రికలో ఈ నెల 16వ తేదీన ప్రచురితమైన కథనంతోనే తమ కొడుకు దొరికాడని అరుణ్‌ తల్లిదండ్రులు న్యాలపట్ల అశోక్‌–నిర్మల తెలిపారు. ఇటీవల సాక్షి పత్రికల్లో కథనాలు రావడంతోనే ఆ వ్యక్తి అరుణ్‌ను గుట్టలో వదిలేసి వెళ్లారని చెప్పారు. ట్రాఫిక్‌ పోలీసుల చెంత...ఏడాది క్రితం ఇంట్లో నుంచి కిడ్నాప్‌ అయినా అరుణ్‌.. ఆదివారం పాతగుట్ట చౌరస్తా వద్ద ఏడ్చూకుంటూ తిరుగుతున్నాడు.

దీంతో వాహనాలను క్రమబద్ధీకరిస్తున్న ట్రాఫిక్‌ సీఐ ప్రవీణ్‌కుమార్, కానిస్టేబుల్స్‌ గోవర్ధన్, సిద్దులు, నర్సింహలు బాలుడి వద్దకు వెళ్లి ఎవరని ఆరా తీశారు.  దీంతో అరుణ్‌ మాది గుట్టనే.. నేను ఆటోడ్రైవర్‌ కొడుకును అని చెప్పాడు. దీంతో ట్రాఫిక్‌ పోలీసులు స్థానిక పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి టౌన్‌ సీఐ అశోక్‌కుమార్‌కు అప్పగించారు.

ఇటీవల సాక్షి పత్రికలో వచ్చిన కథనంలో బాలుడిలానే ఉన్నాడని సీఐ అశోక్‌ కుమార్‌ అరుణ్‌ తల్లిదండ్రులు అశోక్‌–నిర్మలలకు సమాచారం ఇచ్చారు. పోలీస్‌ స్టేషన్‌కు చేరుకున్న అరుణ్‌ తల్లిదండ్రులతో పాటు యాదగిరిగుట్ట ఎంపీపీ గడ్డమీది స్వప్నరవీందర్‌గౌడ్‌లు అనంద బాష్పాలతో కన్నీరు కార్చారు.

ఈనెల 16న సాక్షి కథనంతో...

ఈనెల 16వ తేదీన సాక్షి మినీలో ‘ బాలుడి ఆచూకీ ఎక్కడ..? అరుణ్‌ కనిపించక నేటికి ఏడాది.. కిడ్నాప్‌ అయ్యాడా..? తప్పిపోయాడా..? ఎమయ్యాడో స్పష్టత కరువు.. బాలుడి కోసం తల్లిదండ్రుల ఎదురుచూపులు..’ అనే కోణంలో కథనాన్ని ప్రచురించింది. ఈ కథనంతో అప్రమత్తమైన పోలీసులు బాలుడి ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. బాలుడి తల్లిదండ్రులతో స్థానిక టౌన్‌ సీఐ అశోక్‌ కుమార్‌ పలుమార్లు కలిసి.. ఏవరైనా శత్రువులు ఉన్నారా.. ఎవరిపైన అనుమానం ఉందా.. అనే అంశాలపై ఇటీవల ఆరా తీశారు.ప్రత్యేకంగా ఆయనే రంగంలోకి దిగి బాలుడి ఆచూకీ కోసం వెతకడానికి సిద్ధమయ్యాడు. దీంతో ఆదివారం బాలుడు యాదగిరిగుట్ట పట్టణంలోని పాతగుట్ట చౌరస్తాలో కనిపించాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/4

2
2/4

అరుణ్‌ను ముద్దాడుతున్న అమ్మమ్మ

3
3/4

అరుణ్‌ను ఆప్యాయంగా చూస్తూ సంతోషం వ్యక్తం చేస్తున్న బంధువులు

4
4/4

బాలుడిని గుర్తించిన ట్రాఫిక్‌ పోలీసులు 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement