కోడెల తనయుడి షోరూంలో అసెంబ్లీ ఫర్నిచర్‌ | Assembly furniture in Kodela Son showroom | Sakshi
Sakshi News home page

కోడెల తనయుడి షోరూంలో అసెంబ్లీ ఫర్నిచర్‌

Published Sat, Aug 24 2019 4:20 AM | Last Updated on Sat, Aug 24 2019 4:20 AM

Assembly furniture in Kodela Son showroom - Sakshi

కోడెల కుమారుడి షోరూమ్‌లో అధికారులు గుర్తించిన అసెంబ్లీ ఫర్నిచర్‌లోని విలువైన కుర్చీలు

సాక్షి, గుంటూరు: మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు స్వాధీనంలో ఉన్న అసెంబ్లీ ఫర్నిచర్‌ను అతని తనయుడికి చెందిన షోరూమ్‌లో గుర్తించారు. అసెంబ్లీ అసిస్టెంట్‌ సెక్రటరీ కె.రాజ్‌కుమార్, తహసీల్దార్‌ తాతా మోహన్‌రావు తదితరులు శుక్రవారం గుంటూరులోని గౌతమ్‌ హీరో షోరూమ్‌లో తనిఖీలు నిర్వహించారు. మొదటి అంతస్తులో 10 బర్మా టేకు కుర్చీలను, రెండు, మూడో అంతస్తుల్లో యూరప్‌ నుంచి దిగుమతి చేసుకున్న 22 కుర్చీలు, నాలుగు సోఫాలు, డైనింగ్‌ టేబుల్, టీపాయ్, దర్బార్‌ కుర్చీ, కంప్యూటర్లు, ఏసీలు, ఇతర ఎలక్ట్రానిక్‌ వస్తువులను గుర్తించారు. 22 యూరప్‌ కుర్చీలు, డైనింగ్‌ టేబుల్‌ విలువ రూ.65 లక్షలు పైమాటేనని తెలుస్తోంది.

అసెంబ్లీ అధికారుల బృందం వస్తున్నట్టు తెలియడంతో కోడెల తనయుడు శివరామ్‌ రవాణా శాఖ అధికారుల అధీనంలో ఉన్న తన షోరూమ్‌ తాళాలను తీసుకోలేదు. షోరూమ్‌ తాళాలను అప్పగించేందుకు డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్‌ ఉదయం నుంచీ ఫోన్‌ చేస్తున్నా మేనేజర్‌ అందుబాటులోకి రాలేదు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో మేనేజర్‌ తాళాలు తీసుకుని షోరూమ్‌ తెరిచారు. పైఅంతస్తుల్లోకి అధికారులు తనిఖీకి వెళ్లే సమయంలో కోడెల తన లాయర్‌ను పంపి అడ్డుకున్నారు. సెర్చ్‌ వారెంట్‌ లేకుండా తనిఖీ చేయడానికి వచ్చారంటూ సుమారు గంటపాటు కోడెల తరఫు న్యాయవాది టి.చిరంజీవి అధికారుల్ని అడ్డుకుని వాదనకు దిగారు.

ఎట్టకేలకు పైఅంతస్తుల్లో తనిఖీ చేసిన అధికారులు పాత అసెంబ్లీ ఫర్నిచర్‌ మొత్తం అక్కడ ఉందని చెప్పారు. ఇదిలావుంటే.. సత్తెనపల్లిలోని కోడెల కార్యాలయంలో రెండు కంప్యూటర్లను దొంగలు ఎత్తుకెళ్లారని పుకారు పుట్టించారు. నిన్న మొన్నటి వరకు కోడెల కార్యాలయంలో పనిచేసిన మున్సిపల్‌ అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగి ఆకురాతి మల్లికార్జునరావు (అర్జునుడు) వాటిని దొంగిలించాడని కట్టుకథ అల్లారు. చోరీ జరిగినట్లు సత్తెనపల్లి పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. శుక్రవారం ఉదయం కోడెల కార్యాలయం వెనుక ఎవరో ఓ కంప్యూటర్‌ పడేశారని అదే వ్యక్తి పట్టుకొచ్చాడు. చోరీకి గురైనట్టు చెబుతున్న కంప్యూటర్ల లో కోడెల కే–ట్యాక్స్‌ వ్యవహారాలు, ఇతర బాగోతాలకు సంబంధించిన డేటా ఉందనే ప్రచారం సాగుతోంది.

30 ల్యాప్‌టాప్‌లు పట్టుకెళ్లారు! 
ఏపీ మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు తనయుడు కోడెల శివరామ్‌ ఆదేశాల మేరకు కొందరు వ్యక్తులు 30 ల్యాప్‌టాప్‌లు, ప్రింటర్‌ తీసుకెళ్లారని నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లా అధికారి షేక్‌ బాజీబాబు సత్తెనపల్లి పట్టణ పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం ఫిర్యాదుచేశారు. గ్రామీణ ప్రాంత యువతలో నైపుణ్యాలు అభివృద్ధి చేసేందుకు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో 2017లో సత్తెనపల్లిలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ను ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ మేరకు అప్పటి నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లా అధికారి అజేష్‌చౌదరి ఆదేశాల మేరకు 30 ల్యాప్‌టాప్‌లు, ఒక ప్రింటర్‌(ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌)ను సత్తెనపల్లి తీసుకొచ్చి ఎన్‌ఎస్‌పీ బంగ్లాలో భద్రపరిచారు.  పర్యవేక్షణ బాధ్యతలను ఎన్‌ఎస్‌పీ ఏఈగా ఉన్న ఏసమ్మకు అప్పగించారు. 2018లో కోడెల శివరామ్‌.. ల్యాప్‌టాప్‌లను, ప్రింటర్‌ను తమ వారికి అందించాలని అజేష్‌చౌదరికి సూచించగా, ఆయన ఆదేశాలతో శివరామ్‌ అనుచరులకు ఏసమ్మ అప్పగించినట్టు బాజీబాబు చెప్పారు. ఈ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను కోడెల కుమారుడు శివరామ్‌ అధికార బలంతో కాజేశారనే ఆరోపణలపై స్థానిక ఎమ్మెల్యే అంబటి రాంబాబు నైపుణ్యాభివృద్ధి సంస్థ ఉన్నతాధికారులకు ఇటీవల ఫిర్యాదు చేశారు. సంస్థ ఎండీ ఐఆర్‌టీఎస్‌ అధికారి ఆర్జా శ్రీకాంత్‌ ఆదేశాల మేరకు బాజీబాబు 16న సత్తెనపల్లి వచ్చి విచారణ చేసి నివేదికను ఉన్నతాధికారులకు అందించారు. వారి ఆదేశాల మేరకు బాజీబాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు.  
 
కోడెలకు అస్వస్థత
టీడీపీ సీనియర్‌ నేత, మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు శుక్రవారం రాత్రి అస్వస్థతకు గురయ్యారు. ఆయనను గుంటూరు నగరం మూడు వంతెనల రోడ్డులోని శనక్కాయల ఫ్యాక్టరీ పక్కన ఉన్న కోడెల కుమార్తె విజయలక్ష్మీకి చెందిన శ్రీలక్ష్మీ మల్టీస్పెషాలిటీ ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement