
మీడియా ఎదుట నిందితుడిని హాజరుపర్చి, వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ అమ్మిరెడ్డి
సాక్షి, శ్రీకాకుళం: జిల్లాలో సంచలనం సృష్టించిన ఏటీఎం మాయం కేసులో పురోగతి లభించింది. ఎచ్చెర్ల పోలీసు క్వార్టర్స్ ఆవరణలో గత నెల 5న ఎస్‌బీఐ ఏటీఎం రూ. 8,23,900తో ఎత్తుకుపోయిన విషయం విదితమే. ఇది పోలీసుల వైఫల్యంగా విమర్శలు వెల్లువెత్తాయి. ఇంత పెద్ద స్థాయిలో చోరీకి పాల్పడిన తీరును బట్టి అంతర్రాష్ట్ర ముఠాగానే మొదట్నుంచి భావించారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఒకరిని పోలీసులు అరెస్ట్ చేయగా, మరో ఆరుగురు పరారీలో ఉన్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను శుక్రవారం ఎస్పీ ఆర్‌ఎన్ అమ్మిరెడ్డి వెల్లడించారు. వివరాలు ఇలా... ఏఎస్పీ గంగరాజు, డీఎస్పీలు సత్యనారాయణ, చక్రవర్తిల పర్యవేక్షణలో జేఆర్‌పురం సీఐ మల్లేశ్వరరావు, ఎచ్చెర్ల ఎస్సై జీ రాజేష్ కేసు దర్యాప్తు ప్రారంభించారు.
ఈ సంఘటనకు ముందు నిందితులు రెక్కీ నిర్వహించారు. చోరీకి పాల్పడుతున్న సమయంలో ఏటీఎం కేంద్రంలో సీసీ కెమెరాకు ప్లాస్టర్ అంటించారు. ఈ ప్లాస్టర్ అంటించే ముందు ఓ నిందితుని చిత్రం సీసీఫుటేజీలో నమోదు అయ్యింది. దీన్ని ఆధారంగా చేసుకుని టోల్‌గేట్‌ల్లో సీసీఫుటేజీలను పరిశీలించారు. రెండు చోట్ల ఏటీఎంలో కనిపించే నిందితుని చిత్రంతో సరిపోలడంతో దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ మేరకు పలాస సమీపంలో నిందితుడు వెళ్తున్న వాహనాన్ని తనిఖీలు చేపట్టగా గుర్తించారు. తరువాత వాహన రిజిస్ట్రేషన్ ఆధారంగా దర్యాప్తు చేపట్టగా రాజస్థాన్, హర్యానా రాష్ట్రాలకు చెందినవారుగా తేలింది.
వీరు దొంగిలించిన మొత్తం ఖర్చుకాగానే మరలా చోరీలకు పాల్పడటం అలవాటుగా మార్చుకున్నారు. ఈ నేపథ్యంలో చోరీకి పాల్పడిన వారిలో నిందితుల్లో ఒకరైన సమయుద్దీన్ నరసన్నపేట టోల్‌గేట్ సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతుండగా పోలీసులు ఆదుపులోకి తీసుకుని ప్రశ్నంచారు. దీంతో నేరాన్ని అంగీకరించాడు. ఇటువంటి చోరీలకు పాల్పడటంలో ఫకృద్దీన్ అనే మరో నిందితుడు ఆరితేరాడని, ఇతను మరికొందరిని మచ్చిక చేసుకుని నేరాలకు పాల్పడుతున్నట్లు వివరించాడు. ఫకృద్దీన్‌తోపాటు నజీర్, నయామత్, ముల్లీ, షేఖుల్, సద్దాన్ పరారీలో ఉన్నారు. వీరిని కూడా త్వరలోనే అరెస్టు చేస్తామని, ప్రస్తుతం అరెస్ట్ అయిన వ్యక్తి నుంచి రూ. లక్షతోపాటు సెల్‌ఫోన్, మారుతీ వాహనం స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ వివరించారు.
పోలీసులకు రివార్డులు
కేసును ఛేదించడంలో చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులకు ఎస్పీ రివార్డులను ప్రకటించారు. ఈ మేరకు జేఆర్‌పురం సీఐ మల్లేశ్వరరావు, ఎచ్చెర్ల ఎస్సై రాజేష్, ఏఎస్సై కృష్ణ, హెచ్‌సీ రమణ, కానిస్టేబుళ్లు భాస్కరరావు, మహామ్మద్‌బషీర్, లక్ష్మణ, రవికుమార్, సూర్యనారాయణలకు రివార్డులు అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment