సీఐ ఎదుట రోదిస్తున్న మృతుడి తల్లి వీరమ్మ, బంధువులు
కడప, ఎర్రగుంట్ల : తన కూతురును రోజూ మద్యం తాగి వచ్చి వేధిస్తున్నాడని పిల్లనిచ్చిన అత్తనే అల్లుడిని దారుణంగా హత్యచేసింది. ఎర్రగుంట్ల మండలం కేజీవీపల్లెలో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుడు రమేష్ తల్లి వీరమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలిలా ఉన్నాయి... హనుమనుగుత్తి గ్రామ పంచాయతీ కేజీవీ పల్లెకు చెందిన పెద్దక్క కుమార్తె అంజనమ్మకు, సింహద్రిపురం మండలం హిమకుంట్ల గ్రామానికి చెందిన వీరమ్మ కుమారుడు రమేష్(43)కు 15 ఏళ్లు కిందట వివాహం అయింది.
రమేష్ మద్యానికి బానిసై తరచూ అంజనమ్మను, కుమార్తె అనూషాను వేధిస్తుండేవాడు. దీంతో అంజనమ్మ తల్లి పెద్దమనుషులతో పంచాయతీ పెట్టి అల్లుడు రమేష్‌ను కేజీవీపల్లెకు పిలుచుకొని వచ్చింది. కాగా అక్కడే రమేష్ కూలి పనులకు వెళుతూ జీవనం సాగించేవాడు. అయితే మళ్లీ మద్యానికి బానిసై భార్యను, అత్తను చిత్రహింసలకు గురి చేస్తుండేవాడు. శుక్రవారం ఉదయం అంజనమ్మ, రమేష్ గొడవపడ్డారు. ఈక్రమంలో పక్కనే ఉన్న అత్త చలించి తట్టుకోలేక గొడ్డలి తీసుకొని రమేష్ తలపై బలంగా కొట్టగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే 108 వాహనంలో ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఘటనా స్థలాన్ని సీఐ వెంకటరమణ పరిశీలించారు. మృతుడి తల్లి వీరమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment