
వివరాలు వెల్లడిస్తున్న బోయిన్‌పల్లి ఇన్‌స్పెక్టర్ డి. రాజేశ్
కంటోన్మెంట్: ఆరు నెలల బాలుడిని అపహరించిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్న బోయిన్‌పల్లి పోలీసులు బాధిత బాలుడిని శిశువిహార్‌కు తరలించారు. బోయిన్‌పల్లి పోలీసులు తెలిపిన మేరకు... నిజామాబాద్ జిల్లా వార్షి మండలం, మున్సాపూర్‌కు చెందిన సీహెచ్. ప్రసాద్ (40) నగరంలోని లంగర్ హౌజ్‌లో నివసిస్తున్నాడు. ఇతనికి ఇద్దరు కుమార్తెలు. ఉండగా, కొడుకు కావాలన్న కోరికతో ఉన్నాడు. శనివారం రాత్రి నిజామాబాద్‌లోని బంధువుల ఇంటికి వెళ్లేందుకు బయలుదేరిన ప్రసాద్, మద్యం తాగి రాత్రి నిజామాబాద్ బస్టాండ్ సమీపంలో నిద్రించాడు.
మరుసటి ఉదయం బస్టాండ్ ఆవరణలోని యాచకుల ఆధీనంలో కొందరు చిన్నారులు ఉండటాన్ని గమనించాడు. వారి వద్ద ఉన్న ఆరు నెలల బాబును తనకు ఇవ్వాల్సిందిగా యాచకురాలిని అడగ్గా, రూ.10 వేలు ఇస్తే బాబును ఇస్తానని ఆమె తెలిపింది. చివరకు రూ.4వేలు యాచకురాలికి ఇచ్చిన ప్రసాద్ బాబును తీసుకుని నగరానికి బయలుదేరాడు. ఆదివారం ఉదయం 10.30 గంటలకు న్యూబోయిన్‌పల్లి బస్టాప్‌లో దిగిన ప్రసాద్ అనుమానాస్పద కదలికలను గమనించిన బోయిన్‌పల్లి ఏఎస్‌ఐ వీరయ్య అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెల్లడించారు. బాలుడిని యూసుఫ్‌గూడలోని శిశువిహార్‌కు తరలించిన పోలీసులు, ప్రసాద్‌పై కేసు నమోదు చేసి సోమవారం కోర్టులో ప్రవేశపెట్టారు. ప్రసాద్‌కు బాలుడిని అమ్మిన యాచకురాలి కోసం గాలిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment