వాషింగ్టన్ : రెండు నెలల క్రితం చికాగోకి చెందిన ఒక మహిళ, ఆమె కూతురు కలిసి 19 సంవత్సరాల గర్భవతిని హత్యచేసి కడుపు కోసి బిడ్డను బయటకు తీసిన దారుణం గురించి తెలిసిందే. బలవంతంగా బిడ్డను బయటకు తీయడంతో ఆ చిన్నారి ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది పడింది. దాంతో ఆ శిశువును ఆస్పత్రిలో చేర్పించారు. అయితే ఆ బిడ్డ చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.
అసలేం జరిగిందంటే..
మాల్రేన్ ఒహోవా లోపేజ్(19) అనే గర్భవతికి చికాగోకి చెందిన క్లారిస ఫిగురోవా(46),ఆమె కుమార్తె డేసిరీ(24) ఫేస్‌బుక్ ద్వారా పరిచయమయ్యారు. పిల్లలకు సంబంధించిన వస్తువులు తమ వద్ద లభిస్తాయని ఒహోవాను ఆకర్షించి తమ ఇంటికి రప్పించారు. వచ్చిన అనంతరం ఒహోవా గొంతు నులిమి చంపి ఆమె కడుపు కోసి బిడ్డను బలవంతంగా బయటకు తీశారు. ఏప్రిల్ 23న ఈ ఘటన జరిగింది. తల్లి గర్భం నుంచి బయటకు తీసిన ఆ చిన్నారి ఊపిరి తీసుకోలేదు. దాంతో ఫిగురోవా ఆ శిశువును తన బిడ్డ అని ఆసుపత్రిలో చేర్పించింది.
నెలల నిండకముందే.. బలవంతంగా శిశువును బయటకు తీయడంతో.. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదుర్కొన్నది. చివరకు బ్రైయిన్ డెడ్ అయ్యి ఆ శిశువు మరణించినట్లు శుక్రవారం సాయంత్రం వైద్యులు తెలిపారు. మరోవైపు ఒహోవా కుటుంబ సభ్యులు ఆమె కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో భాగంగా ఒహోవా ఫేస్‌బుక్ ఖాతాను పరిశీలించిన పోలీసులకు.. ఫిగురోవా మీద అనుమానం వచ్చింది. ఆమె ఇంటికి వెళ్లి సోదా చేయగా అక్కడ ఒహోవా మృత దేహం కనిపించింది. బిడ్డ కోసం తానే తన కూతురు, ఆమె బాయ్ ఫ్రెండ్‌తో కలిసి ఈ హత్య చేసినట్లు ఫిగురోవా ఒప్పుకోవడంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment