
తండావాసులకు నచ్చజెప్పుతున్న ఎస్‌ఐ నరేష్, దివాకర్‌నాయక్ (ఫైల్)
మద్దూరు (కొడంగల్): వేగంగా వచ్చిన ద్విచక్రవాహనం ఢీకొని ఓ బాలుడు మృతిచెందాడు. అయితే స్పీడ్ బ్రేకర్లు లేకపోవడం వల్లే తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆందోళన చేపట్టిన సంఘటన శనివారం మండలంలోని పల్లెగండ్డతండాలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ నరేష్ కథనం ప్రకారం.. గుర్తుతెలియని వ్యక్తి శుక్రవారం రాత్రి ద్విచక్రవాహనంపై మద్దూరు నుంచి కోస్గి వెళ్తున్నాడు. ఇదే క్రమంలో దోరేపల్లి పంచాయతీ పరిధిలోని పల్లెగడ్డతండా చెందిన రెండో తరగతి విద్యార్థి ఎస్.దివాకర్‌నాయక్(7) అడ్డంగా వేగంగా ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బాలుడిని స్థానికులు హైదరాబాద్‌కు తరలించగా.. గుర్తుతెలియని వ్యక్తిని జిల్లాకేంద్రంలోని ఎస్వీఎస్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. కాగా బాలుడు చిక్సిత పొందుతూ మధ్యరాత్రి మృతిచెందాడు.
అయితే తండా దగ్గర కొత్తగా వేసిన డబుల్ రోడ్డుకు స్పీడ్ బ్రేకర్స్ లేకపోవడం వల్లే ఈ ప్రమాదం చోటుచేసుకుందని, గతంలో కూడా ఇక్కడ రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని ఎన్నిసార్లు ఆర్‌అండ్‌బీ అధికారులకు తెలియజేసినా ఫలితం లేదని గ్రామస్తులంతా శనివారం ఉదయం రోడ్డుపై భైటాయించారు. దాదాపు రెండు గంటల పాటు ధర్నా కొనసాగింది. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ నరేష్ అక్కడికి చేరుకొని వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఆర్‌అండ్‌బీ డిప్యూటీ ఈఈ సర్ధార్‌సింగ్, ఏఈ శ్రీనివాసచారిలతో మాట్లాడి స్పీడ్ బ్రేకర్ వేయిస్తామని హామీ ఇవ్వడంతో తండావాసులు ధర్నా విరమించారు. దివాకర్‌నాయక్ తండ్రి నాగరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. ప్రమాదంలో మృతిచెందిన బాలుడి కుటుంబ సభ్యులను టీఆర్‌ఎస్ నాయకులు సలీం, మద్దూరు సర్పంచ్ వెంకటయ్య పరామర్శించారు. ప్రభుత్వం నుంచి కుటుంబానికి ఆర్థికసాయం అందించడానికి కృషిచేస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment