నారపల్లి పీహెచ్‌సీలో శిశువు అపహరణ | Birth Child Robbed in Narapalli PHC | Sakshi
Sakshi News home page

నారపల్లి పీహెచ్‌సీలో శిశువు అపహరణ

Published Wed, Feb 20 2019 9:28 AM | Last Updated on Wed, Feb 20 2019 9:28 AM

Birth Child Robbed in Narapalli PHC - Sakshi

తల్లిదండ్రుల చెంతకు చేరిన శిశువు

బోడుప్పల్‌: నారపల్లి ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో అప్పుడే పుట్టిన మగ శిశువు అపహరణకు గురైన సంఘటన మంగళవారం మేడిపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది.  ఫిర్యాదు అందిన మూడున్నర గంటల్లో శిశువును పోలీసులు గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించారు. అపహరణకు పాల్పడిన వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇన్‌స్పెక్టర్‌ అంజిరెడ్డి, శిశువు తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం.. మేడిపల్లి మండలం చెంగిచర్ల  గ్రామంలో నివసించే బంగారు నరేష్, అరుణ భార్యాభర్తలు.

వీరికి ఇప్పటికే ముగ్గురు మగ పిల్లలున్నారు. నరేష్‌ మెకానిక్‌గా, అరుణ లేబర్‌గా పనిచేస్తున్నారు. నిండు గర్భిణి అయిన అరుణ వారం రోజుల క్రితం ఉప్పల్‌ ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో చేరింది. డెలివరీ సమయం దగ్గర పడుతుండడంతో మెరుగైన వైద్యం కోసం ఘట్‌కేసర్‌ మండలం నారపల్లిలోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం చేర్పించగా అదేరోజు అర్ధరాత్రి మగబిడ్డకు జన్మనిచ్చింది. వెంటనే కేసీఆర్‌ కిట్స్‌ కూడా తీసుకున్నారు. అనంతరం అరుణ నిద్రలోకి జారుకోగా తెల్లవారుజాము 4 గంటల ప్రాంతంలో శిశువు కనిపించకుండా పోయింది. దీంతో కంగారు పడ్డ శిశువు తల్లిదండ్రులు మేడిపల్లి పోలీస్‌ స్టేషన్‌లో మంగళవారం మధ్యాహ్నం ఫిర్యాదు చేశారు. 

రంగ ప్రవేశం చేసిన పోలీసులు
మగశిశువు అపహరణకు గురైందన్న ఫిర్యాదు మేరకు పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు. మేడిపల్లిలోని భగత్‌సింగ్‌ కాలనీలో ఓ ఇంట్లో ఉందని తెలుసుకుని అక్కడకు వెళ్లారు. అక్కడ ఓ మహిళ వద్ద ఓ మగ శిశువు ఉండడంతో వారి తల్లిదండ్రులను పిలిపించారు. వారు తమ బిడ్డేనని చెప్పడంతో వారికి అప్పగించారు. 

అనుమానితుల విచారణ  
శిశువు అపహరణకు కారకులు నరేష్‌ పక్కంటి వారని తెలుసుకున్న పోలీసులు ఆ కుటుంబానికి చెందిన ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.  అలాగే నారాపల్లి ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేసే ఓ నర్సు ప్రమేయం ఉందని ప్రాధమిక విచారణలో తేలడంతో ఆమెనూ అదుపులోకి తీసుకున్నారు. అయితే, పోలీసులు అధికారికంగా ధ్రువీకరించడం లేదు.

అర్ధరాత్రి డిశార్చి అయినట్లురికార్డుల్లో నమోదు  
ఆస్పత్రిలో అరుణ రాత్రి 12 గంటలకు ప్రసవం కాగా, మగ శిశువు అపహరణకు గురి కావడంతో వెంటనే హాస్పిటల్‌లో పనిచేసే సిబ్బంది శిశువు తల్లిదండ్రులకు కేసీఆర్‌ కిట్స్‌ ఇచ్చినట్లు ఫొటోలు తీసుకున్నారు. అనంతరం హాస్పిటల్‌ నుంచి డిశ్చార్జి అయినట్లు వారితో సంతకాలు తీసుకున్నట్లు తెలిసింది. కిడ్నాప్‌ వ్యవహారం బయట పడడంతో ఆస్పత్రి సిబ్బంది ఇలా చేసినట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న మేడిపల్లి పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement