మానస సరోవర్ హోటల్ కిచెన్‌లో ఆహార పదార్థాలను పరిశీలిస్తున్న ఫుడ్ విభాగం అధికారులు
సనత్‌నగర్: అమెరికా వెళ్లేందుకు వీసా కోసం నగరానికి వచ్చి బేగంపేటలోని స్టార్ హోటల్‌లో బస చేసిన సాఫ్ట్‌వేర్ దంపతులు రవి నారాయణరావు, శ్రీవిద్య దంపతుల చిన్నకుమారుడు విహాన్ మృతిపై పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. కలుషితాహరం తిని చిన్న కుమారుడు మృతి చెందాడు. దంపతులతో పాటు వారి పెద్ద కొడుకు అస్వస్థతకు గురయ్యారు. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రవి నారాయణరావు, ఆయన భార్య శ్రీవిద్య నుంచి సేకరించిన వాంగ్మూలం ఆధారంగా బాలుడు విహాన్‌ది అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు బేగంపేట ఏసీపీ నరేష్‌రెడ్డి, ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసరావులు తెలిపారు. వారు చెబుతున్నట్లు కుటుంబసభ్యులు విషాహారం కారణంగానే అస్వస్థతకు గురయ్యారా..? బాలుడు ఈ కారణంగానే మృతి చెందాడా? లేక మరేమైన కారణాలు ఉన్నాయా అనే కోణాల్లో విచారణ చేస్తున్నామని చెప్పారు. సోమవారం రాత్రి వీరు తీసుకున్న ఆహారంలోని కడాయ్ పన్నీరును హోటల్‌లో బస చేసిన మరో ఇద్దరు కూడా తీసుకున్నారని, వారు ఆరోగ్యంగానే ఉన్నామనే సమాచారం తమకు అందిందన్నారు. ఈ నేపథ్యంలో రవి నారాయణ కుటుంబసభ్యులు బయటకు ఏమైనా వెళ్లారా, మరేమైనా ఆహారం తీసుకున్నారా? లేదా హోటల్‌లో తీసుకున్న ఆహారం కారణంగానే అస్వస్థతకు గురయ్యారా అనే కోణంలో అన్ని ఆధారాలు సేకరిస్తున్నామని చెప్పారు. మంగళవారం తెల్లవారుజామున హోటల్‌కు వచ్చిన రవి నారాయణరావు మామ ప్రసాదరావును కూడా విచారించి వివరాలు సేకరించామన్నారు.
ఆహార నమూనాల సేకరణ
చిన్నారి మృతి చెందడం, కుటుంబసభ్యులు అస్వస్థతకు గురి కావడంతో జీహెచ్‌ఎంసీ ఆహార తనిఖీ విభాగం అధికారులు బేగంపేటలోని మానస సరోవర్ హోటల్‌లో బుధవారం సందర్శించి కిచెన్‌ను తనిఖీ చేశారు. అక్కడి వంటకాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఫుడ్ ఇన్‌స్పెక్టర్ సుదర్శన్‌రెడ్డి నేతృత్వంలో ఏహెచ్‌ఎంసీ డాక్టర్ రవీందర్‌గౌడ్, వెటర్నరీ అధికారి శ్రీనివాస్‌రెడ్డి, ఇతర అధికారులు ఆహార శాంపిళ్లను సేకరించారు. బాధితులు తీసుకున్నట్లుగా చెబుతున్న రోటి, కడాయ్ పన్నీర్‌కు సంబంధించిన నమూనాలతో పాటు వారు బస చేసిన గదిలో పడకలపై చేసుకున్న వాంతులకు సంబంధించిన నమూనాలను కూడా అధికారులు సేకరించారు. వీటిని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించగా, నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని ఫుడ్ ఇన్‌స్పెక్టర్ సుదర్శన్‌రెడ్డి తెలిపారు.
బాలుణ్ని కాపాడడానికి 45 నిమిషాలు శ్రమించాం: కిమ్స్ వైద్యులు
రవి నారాయణ కుమారుడు నిహాన్ మృతి, సభ్యులంతా అస్వస్థకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా కిమ్స్ వైద్యులు ఒక ప్రకటనను విడుదల చేశారు. ఈ నెల 10న 5.30 గంటల సమయంలో కిమ్స్ హాస్పిటల్‌కు రవినారాయణ, శ్రీవిద్య, ఇద్దరు పిల్లలను తీసుకుచ్చారు. అప్పటికే వారు 8– 10 సార్లు వాంతులు చేసుకున్నారు. వారి పరిస్థితిని దర్యాప్తు చేసిన డాక్టర్లు వారిని మెడికల్ స్టెప్‌డౌన్ యూనిట్‌కు తరలించారు. ఆ ఇద్దరు పిల్లల్లో రెండేళ్ల నిహాన్ పరిస్థితి విషమంగా ఉంది. 45 నిమిషాల పాటు సీపీఆర్ అతనికి అందించారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో నిహాన్‌ను కాపాడలేకపోయాయమని వైద్యులు తెలిపారు. మరో బాలుడిని ఐసీయూకు పంపించాం. అతనితో పాటు తల్లిదండ్రులకు ఫ్లూయిడ్స్, యాంటీబయోటిక్స్‌తో చికిత్స అందించాం. ప్రస్తుతం ఈ ముగ్గురి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది. డీహైడ్రేషన్‌కు గల కారణం ఇంకా తెలియరాలేదు. ఫుడ్‌పాయిజనింగ్‌గా అనుమానిస్తున్నాం. పరీక్షల కోసం రక్త నమూనాలను పంపించాం. వాటి ఫలితాల కోసం ఎదురు చూస్తున్నామని కిమ్స్ ఆస్పత్రి వైద్యులు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. వీరికి కన్సల్టెంట్ ఇంటర్నల్ మెడిసిన్ డాక్టర్ ప్రవీణ్, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ డాక్టర్ సంధ్య చికిత్స అందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment