(ప్రతీకాత్మక చిత్రం)
పట్నా : యువతీయువకులు తమ వెర్రి చేష్టలతో ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు. సెల్ఫీలు, వీడియోకాల్‌లు అంటూ సిల్లీగా అనిపించే విషయాలను కూడా సీరియస్‌గా తీసుకుంటూ ప్రాణాలను తృణప్రాయంగా వదిలేస్తూ తమ తల్లిదండ్రులకు తీరని కడుపుకోత మిగులుస్తున్నారు. తన గర్ల్‌ఫ్రెండ్‌తో వాట్సాప్ వీడియో కాల్ మాట్లాడుతూ ఓ యువకుడు ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయాడు. చేతిలోని తుపాకీ అనూహ్యంగా పేలడంతో ఆ బుల్లెట్ నేరుగా తలలో నుంచి దూసుకుపోయి అతడు అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. అయితే, ఆ గర్ల్‌ఫ్రెండ్‌తో తిరుగుతూ పరీక్షల్లో తప్పాడని కుటుంబం వేధించిన క్రమంలో ఆ ఒత్తిడి తట్టుకోలేకే అతడు ఆత్మహత్యకు పాల్పడినట్లు మరో కథనం వినిపిస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
అకాష్ కుమార్ (బంటీ) అనే 19 ఏళ్ల యువకుడిది బిహార్‌లోని సాయిచాక్ అనే గ్రామం. అతడు సోమవారం తన ప్రియురాలికి వాట్సాప్ ద్వారా వీడియోకాల్ చేశాడు. ఆ సమయంలో సెమీ ఆటోమేటిక్ పిస్టల్ చేతిలో పట్టుకొని సరదాగా ఆటపట్టిస్తూ తలకు గురిపెట్టుకొని మాట్లాడాడు. ఆటలు కాదని, వెంటనే బుల్లెట్లు అందులో నుంచి తీసేయాలని తన గర్ల్‌ఫ్రెండ్ కోరడంతో బుల్లెట్లు తీసేశాడు. అయితే, అందులో ఒక బుల్లెట్ మాత్రం మిగిలిపోయింది. అది గమనించకుండా మరోసారి ప్రియురాలికి చూపిస్తూ అతడు ట్రిగ్గర్ నొక్కాడు. దాంతో అందులో ఉన్న ఒక్క బుల్లెట్ కాస్త నేరుగా అతడి తలలో నుంచి దూసుకెళ్లి తన ఇంట్లోని బెడ్‌పైనే చనిపోయాడు. కాగా, ఆకాశ్ బంధువులు మాత్రం అతడు చనిపోవడానికి గర్ల్‌ఫ్రెండ్ కారణం అని ఆమెపై కేసులు నమోదు చేయాలని పోలీసులను ఆశ్రయించారు.
Comments
Please login to add a commentAdd a comment