బ్రిటిష్ మోడల్ క్లోహి అయిలింగ్
గత ఏడాది వేసవిలో కిడ్నాప్‌కు గురైన బ్రిటిష్ మోడల్ ఎంతో శారీరక, మానసిక హింసను అనుభవించిందని ఇటలీ పోలీసులు తెలిపారు. ఇటలీలో కిడ్నాపైన క్లోహి అయిలింగ్‌కు డ్రగ్స్ ఇచ్చి.. ఓ సూట్‌కేస్‌లో కుక్కి.. అత్యంత కిరాతకంగా ఆమెను బట్వాడా చేశారని, ఆన్‌లైన్‌లో ఆమెను సెక్స్ బానిసగా అమ్మేయాలని ప్రయత్నించారని వెల్లడించారు.
20 ఏళ్ల క్లోహి అపహరణ కేసులో ప్రధాన నిందితుడైన లుకాస్ పవాల్ హెర్బాను పోలీసులు విచారించగా.. పలు దారుణమైన విషయాలు వెలుగుచూశాయి. ఇంగ్లండ్‌లో తాత్కాలికంగా నివసిస్తున్న హెర్బా (30 ఏళ్లు).. మిలాన్‌లో బూటకపు ఫొటోషూట్ ఆశజూపి.. అయిలింగ్‌కు వలవేశాడు. లండన్ నుంచి ఆమెను ఇటలీకి రప్పించి కిడ్నాప్ చేశాడని పోలీసులు తెలిపారు. ఇంటర్నెట్‌లోని డార్క్ వెబ్‌లో తనను సెక్స్ బానిసగా అమ్మేయాలని కిడ్నాపర్లు ప్రయత్నించారని, మూడు లక్షల డాలర్లకు తనను అమ్మేందుకు బేరం పెట్టారని బాధితురాలు అయిలింగ్ పోలీసులకు వెల్లడించింది. కిడ్నాప్ చేసిన తర్వాత తనకు డ్రగ్స్ ఇచ్చి.. నోటికి గుడ్డ కట్టి.. కాళ్లుచేతులు కట్టేసి.. ఓ బ్యాగులో కుక్కేసి.. కారు డిక్కీలో వేసుకొని టురిన్ శివార్లలో ఉన్న ఓ ఫామ్‌హౌజ్‌కు తరలించారని, అక్కడ కుర్చీకి కాళ్లు చేతులు కట్టేసి.. బంధించారని, ఆ కుర్చీకి అతుక్కొని తాను రోజులు గడిపానని, నిద్రపోయానని ఆమె పోలీసులకు వివరించారు. అయిలింగ్ రెండేళ్ల బాబుకు తల్లి అని తెలియడంతో కిడ్నాపర్లు ఆమెను గత ఏడాది జూలైలో విడిచిపెట్టారు. మిలాన్‌లోని బ్రిటిష్ కాన్సులేట్‌లో ఆమెను విడిచారు. ఆ వెంటనే ఈ కేసులో ప్రధాన నిందితుడైన హెర్బాను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో డార్క్ వెబ్‌లో వేలం వేసేందుకు సాగుతున్న విచ్చలవిడి మానవ అక్రమ రవాణా వ్యవహారం వెలుగుచూసింది.
Comments
Please login to add a commentAdd a comment