
కుమారుడి మృతదేహం వద్ద విలపిస్తున్న తండ్రి
చాంద్రాయణగుట్ట: బట్టలు ఉతికేందుకు చెరువుకు వెళ్లిన ఇద్దరు చిన్నారులు ప్రమాదవశాత్తు నీటిలో పడి మృతి చెందిన చాంద్రాయణగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్ రుద్ర భాస్కర్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.బండ్లగూడ సాదత్‌నగర్‌కు చెందిన సయ్యద్ కాజీం హుస్సేన్, సబియా ఖాన్ దంపతులకు ముగ్గురు సంతానం. బుధవారం వారి పెద్ద కుమారుడు మహ్మద్ నవాజ్ (17) బట్టలు ఉతుక్కునేందుకు పక్కనే ఉన్న ఉందాసాగర్‌కు వెళుతుండగా అతని చెల్లెలు ఖుల్సుం ఫాతీమా (6), తమ్ముడు మహ్మద్ కరీం అలియాస్ అబ్బాస్ (4)లు కూడా అతడితో పాటు వెళ్లారు. చెరువు వద్దకు వెళ్లిన తర్వాత సబ్బు కొనుక్కుని వస్తానని నవాజ్ చిన్నారులిద్దరినీ చెరువు గట్టున ఉన్న రాయిపై కూర్చోబెట్టి వెళ్లాడు. అయితే అతను తిరిగివచ్చేసరికి చిన్నారులు కనిపించకపోవడంతో తల్లిదండ్రులకు సమాచారం అందించాడు. స్థానికులు చెరువులోకి దిగి వారికి కోసం గాలించగా అప్పటికే ఇద్దరూ మృతి చెందారు. చిన్నారుల తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.