నిందితుల్ని మీడియా ముందు ప్రవేశపెట్టిన పోలీసులు ,గాయత్రి (ఫైల్)
కదిరి అర్బన్: గత సంవత్సరం కనిపించకుండా పోయిన కుమ్మరవాండ్లపల్లి గ్రామానికి చెందిన ఈటెల గాయత్రిని తమ్ముడు అంతంమొందించాడు. ఈ కేసును దర్యాప్తు చేసిన రూరల్ పోలీసులు నిందితులను బుధవారం మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా కేసు పూర్వాపరాలను డీఎస్పీ శ్రీలక్ష్మి విలేకరులకు తెలిపారు. తన సోదరి ఈటెల గాయత్రీ కనపడుట లేదని ఆమె సోదరుడు కుమ్మరవాండ్లపల్లికి చెందిన గోవర్దన్ గతేడాది రూరల్ మండల పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అప్పట్లో మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాపు ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే చాలా విషయాలు సేకరించారు. గోవర్దన్ సోదరి గాయత్రి భర్తను వదిలిపెట్టి పుట్టింటిలో ఉండేది. ఈ క్రమంలోనే తన తమ్ముని స్నేహితుడైన అదే గ్రామానికి చెందిన సుదర్శన్‌తో వివాహేతర సంబంధం కొనసాగించింది. ఇది తెలుసుకున్న గోవర్దన్ తన అక్కను పద్ధతి మార్చుకోవాలని మందలించాడు.
అయినప్పటికీ ఆమె వ్యవహారంలో మార్పు కనిపించలేదు. ఈ క్రమంలోనే 2016 మార్చి 3వ తేదీన గాయత్రి ఇంట్లోనే తన స్నేహితుడైన సుదర్శన్‌తో కలిసి ఉండడాన్ని చూసిన గోవర్దన్ తట్టుకోలేకపోయాడు. ఇది గమనించిన సుదర్శన్ అక్కడి నుంచి పారిపోగా... ఆగ్రహంతో ఉన్న గోవర్దన్ అక్కడే ఉన్న కట్టె తీసుకుని గాయత్రి తలపై బాదాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. అనంతరం తన మరో స్నేహితుడైన రాజేశ్‌ను వెంట బెట్టుకుని గాయత్రి మృతదేహాన్ని ముష్టిపల్లి రోడ్డు వద్ద కదిరి కొండకు సమీపంలో ఉపాధి హామీ పనుల్లో తీసిన గుంతలో పూడ్చిపెట్టారు. అనంతరం మూడు రోజుల తర్వాత 2016 మార్చి 6వ తేదీన తన అక్క గాయత్రి కనిపించడం లేదంటూ రూరల్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.
ఆ తర్వాత కొంత కాలానికి మద్యంమత్తులో తన స్నేహితుడైన రాజేశ్‌తో గొడవపడిన గోవర్దన్ మాటామాటా పెరగడంతో తన అక్కను చంపినట్టే నిన్నూ చంపేస్తానని బెదిరించాడు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో వారు నిందితులను అదుపులోనికి తీసుకుని విచారించగా... గాయత్రిని చంపింది తానేనని గోవర్దన్ ఒప్పుకున్నాడు. దీంతో పోలీసులు గోవర్దన్‌ను, అతనికి సహకరించిన రాజేశ్‌ను అరెస్టు చేశారు. సమావేశంలో సీఐ శ్రీధర్, ఎస్‌ఐ వెంకటప్రసాద్‌తో పాటు పలువురు సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment